ట్రేడింగ్‌లో దూసుకుపోతున్న మహిళలు.. ఇన్వెస్టర్లుగా సత్తా | The Rise of Women in Investing What You Should Know | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు మగవాళ్ల పేర్లే వినిపించేవి,కానీ పాండమిక్‌ తర్వాత ట్రేడింగ్‌లో..

Published Wed, Sep 20 2023 12:15 PM | Last Updated on Wed, Sep 20 2023 12:44 PM

The Rise of Women in Investing What You Should Know - Sakshi

విజేతల విజయాలు ఇతరులకు స్ఫూర్తి ఇచ్చి ముందుకు నడిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్టార్‌ ఉమెన్‌ ఇన్వెస్టర్‌ల నుంచి స్ఫూర్తి పొందిన ఈతరం అమ్మాయిలు ‘లెర్నింగ్‌ అండ్‌ చేజింగ్‌’ సూత్రంతో ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్టింగ్‌లలో విజయం సాధిస్తున్నారు. తమదైన గెలుపు ప్రణాళికను పక్కాగా రూపొందించుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్‌మెంట్‌ గేమ్‌లో పురుషాధిక్యత కనిపిస్తుంది. ఒక ఆన్‌లైన్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ ప్రకారం అయిదుమందిలో ఒకరు మాత్రమే ఉమెన్‌ ఇన్వెస్టర్‌. అయితే ఈ పరిస్థితులలో ఇప్పుడు ఆశాజనకమైన మార్పు కనిపిస్తుంది. ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఏరియాలోకి మహిళలు వచ్చి సత్తా చాటుతున్నారు. మన దేశం విషయానికి వస్తే పాండమిక్‌ సమయంలోనూ ఉమెన్‌ ఇన్వెస్టర్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన వర్ష శ్రీవాస్తవకు ఇన్వెస్ట్‌మెంట్‌ ఫీల్డ్‌లో రాణించాలనేది భవిష్యత్‌ లక్ష్యం. ఇన్వెస్ట్‌మెంట్‌లో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎంబీఏ చేస్తున్న వర్షకు స్ఫూర్తి. బెంగళూరుకు చెందిన ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ అంకిత వశిష్ఠ ఔత్సాహిక మహిళా ఇన్వెస్టర్‌లకు స్ఫూర్తిగా నిలిచింది.

వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ‘సహ ఫండ్‌’ కు అంకిత ఫౌండర్, సీయివో. వీసీ ఫర్మ్‌ ‘స్ట్రాంగ్‌హర్‌’ ఫౌండర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌. పద్మజ రూపరెల్‌ ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌(ఐఏఎన్‌) కో–ఫౌండర్, ప్రెసిడెంట్‌. ‘ఐఏఎన్‌’ పది దేశాలలో ఫైనాన్స్, వ్యవసాయం, అంతరిక్షం, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వైద్యపరికరాలు... మొదలైన రంగాలలో పెట్టుబడులు పెడుతోంది. పద్మజ ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌’గా గుర్తింపు పొందింది.... ఈ ఇద్దరు మాత్రమే కాదు భారతీ జాకబ్, నీతా మీర్‌చందానీ, సాక్షి చోప్రా, బాలా దేశ్‌ పాండే...లాంటి ప్రముఖ ఇన్వెస్టర్‌లు వర్షకు స్ఫూర్తి.ముంబైకి చెందిన చైత్రకు లారెన్‌ సీమన్స్‌ అంటే చెప్పలేనంత ఇష్టం.


‘సీమన్స్‌ గురించి చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది. ఆమె మాటల్లో ఎంతో స్ఫూర్తి దొరుకుతుంది’ అంటుంది చైత్ర. ఇరవై మూడు సంవత్సరాల వయసులో వాల్‌స్ట్రీట్‌లో యంగెస్ట్‌ ఫుల్‌–టైమ్‌ ఫిమేల్‌ ట్రేడర్‌గా ఎంతోమందికి స్ఫూర్తి  ఇచ్చింది లారెన్‌ సీమన్స్‌. కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు సీమన్స్‌కు ఎలాంటి అనుభవమూ లేదు. కుటుంబ సభ్యులు, బంధువులలోనూ ఆ రంగంలో ఎవరూ లేరు. జెనెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన సీమన్స్‌ న్యూయార్క్‌ సిటీకి వెళ్లి ఫైనాన్స్‌ రంగంలో అడుగు పెట్టింది,.‘డైరెక్షన్‌లెస్‌’ ‘కన్‌ఫ్యూజ్‌డ్‌’ అంటూ ఆమెకు పేర్లు తగిలించేవాళ్లు కొందరు పురుషులు. ఈ పేర్ల వెనుక ఉద్దేశం ఆమెకు ఏమీ తెలియదు అని. అయితే ‘రోసెన్‌బ్లాట్‌ సెక్యూరిటీస్‌’ సీయీవో జో గౌరోస్కి మాత్రం ఆమెపై నమ్మకం ఉంచాడు.

‘జార్జియా నుంచి ఇక్కడికి వచ్చిన ఈ అమ్మాయికి ఫైనాన్స్‌లో డిగ్రీ లేదు. అయితే ఏదో సాధించాలనే ఉత్సాహం ఉంది. అంకితభావం ఉంది’ అన్నారు. రోసెన్‌ బ్లాట్‌ సెక్యూరిటీస్‌లోకి అడుగుపెట్టి ప్రయాణం ప్రారంభించింది సీమన్స్‌. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ కీనోట్‌ స్పీకర్‌గా ఫైనాన్స్‌కు సంబంధించి అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది. వారి కోసం ఎన్నో రచనలు చేసింది. సీమన్స్‌లాగే మన దేశానికి చెందిన మహెక్‌ షాకు వెటకారం మాటలు ఎదురయ్యాయి. పందొమ్మిది సంవత్సరాల వయసులోనే ట్రేడింగ్‌లోకి వచ్చిన మహెక్‌ వాటిని పట్టించుకోలేదు. తన పనితోనే సమాధానం చెప్పాలనుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌తో స్టాక్‌మార్కెట్‌లో తొలి అడుగు వేసింది.

టెక్నికల్‌ టర్మ్స్‌ను అర్థం చేసుకోవడం నుంచి సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం వరకు ఎన్నో విషయాలను తన ప్రయాణంలోనే నేర్చుకుంది. హైయెస్ట్‌ ప్రాఫిట్‌ చూసిన రోజు తన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యేది. ట్రేడింగ్‌లో డబ్బు కోల్పోయిన సందర్భాలు కూడా లేక΄ోలేదు. ‘చాలా నిరుత్సాహానికి గురయ్యాను. అయితే అంతలోనే తేరుకొని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది 26 సంవత్సరాల మహెక్‌. పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు చేతిలో ల్యాప్‌టాప్‌తో పనిలో తలమునకలై ఉంటుంది మహెక్‌. డిగ్రీ తరువాత ఫుల్‌టైమ్‌ ట్రేడర్‌ అయింది.

తల్లిదండ్రులపై ఆధారపడకుండా తాను సంపాదించిన డబ్బుతో యూకేలో ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ చేసింది. చార్టెడ్‌ ఎకౌంటెన్సీ ట్రైనింగ్‌ నుంచి మధ్యలోనే బయటకు వచ్చిన ప్రియల్‌ అనిల్‌ బర్గీ ఈక్విటీ ఇన్వెస్టింగ్‌లోకి అడుగు పెట్టింది. తండ్రి నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని స్టాక్‌మార్కెట్‌లోకి వచ్చిన ప్రియల్‌ ఆ మొత్తాన్ని కొంతకాలానికే రెట్టింపు చేసింది. అంతమాత్రాన ఆమెకు నష్టాలు ఎదురు కాలేదని కాదు. ఒకేరోజు కొన్ని లక్షలు పోగొట్టుకొని షాక్‌కు గురైంది. అయితే నిరాశతో వెనకడుగు వేయకుండా, తాను వేసిన తప్పటడుగును లోతుగా విశ్లేషించుకుంది.

‘ఇతరుల ద్వారా తెలుసుకునే టిప్స్‌ మాత్రమే మనం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడవు. అతిపెద్ద సవాలు ఏమిటంటే దురాశకు దూరంగా ఉండడం. అదే సమయంలో ఆశావాదాన్ని కోల్పోకుండా ఉండడం. భయం ఉండాలి. అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే భయం కాకూడదు. మనల్ని హద్దుల్లో పెట్టే భయమై ఉండాలి’ అంటున్న 27 సంవత్సరాల ప్రియల్‌ బర్గీ నాగ్‌పుర్‌ కేంద్రంగా ‘నతిభాయి తులసీదాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌’ సంస్థను ప్రారంభించింది.
 

పవర్‌ ఆఫ్‌ ట్రేడింగ్‌ తెలుసుకున్నాను. ఫారిన్‌ మార్కెట్‌లో కూడా ట్రేడింగ్‌ చేయాలనుకుంటున్నాను. ఇండియాలో నేర్చుకున్న విషయాలు నాకు ఉపకరిస్తాయి.
–  మహెక్‌ షా

ఇతరుల ద్వారా తెలుసుకునే టిప్స్‌ మాత్రమే మనం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడవు. అతిపెద్ద సవాలు ఏమిటంటే దూరాశకు దూరంగా ఉండడం. అదే సమయంలో ఆశావాదాన్ని కోల్పోకుండా ఉండడం.
– ప్రియల్‌ బర్గీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement