
మస్తాన్‌బాబుకు గ్యాలంటరీ అవార్డు ఇవ్వాలి
లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ మేకపాటి
న్యూఢిల్లీ: ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహణలో పేరు గడించిన మస్తాన్‌బాబుకు జాతీయ అవార్డు ప్రకటించాలి. తగిన గ్యాలంటరీ అవార్డుతో సత్కరించాలి. ఈ సూచనతో ఈ సభ ఏకీభవిస్తుందని ఆశిస్తున్నా’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. అలాగే గిన్నిస్ రికార్డులు సాధించిన ఆయనను ఏప్రభుత్వమూ గుర్తించలేదన్నారు.
మస్తాన్ భౌతికకాయాన్ని స్వస్థలానికి చేర్చినందుకు కృతజ్ఞతలనీ, అయితే ఆయన కుటుంబ సభ్యులకు పక్కా ఇల్లు లేదనీ వారికి ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ సానుకూలత వ్యక్తం చేశారు. కాగా, మేకపాటి మరికొందరు ఎంపీలు పోలీస్‌స్టేషన్‌లో మౌలిక వసతులపై అడిగిన ప్రశ్నకు త్వరలో ఎంపీఎఫ్ కింద నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతీభాయ్ చౌదరి తెలిపారు.