
‘కల ఉంటే చాలు అదే వయసును తగ్గిస్తుంది. లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుంది’ అనడానికి నాగరత్నమ్మ అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నారు. బెంగుళూరులో ఉంటున్న నాగరత్నమ్మ వయసు 62. గృహిణిగా బాధ్యతలు తీరి, విశ్రాంతి తీసుకుంటున్న వయసు. కానీ, పశ్చిమ కనుమల్లో ఎత్తైన, అత్యంత కష్టతరమైన పర్వతాన్ని.. అదీ చీరకట్టుతో అధిరోహించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారామె. సంకల్పం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని చాటుతున్నారు.
ఇంటి గడప దాటి ఎన్నడూ పర్యటనలు కూడా చేయలేదనే నాగరత్నమ్మను ‘ఈ వయసులో టీవీ చూస్తూ, మనవలు– మనవరాండ్రతో కాలక్షేపం చేయకుండా ఏంటీ సాహసం’ అని తెలిసినవాళ్లు, తెలియనివాళ్లూ అడుగుతుంటే హాయిగా నవ్వేస్తుంది. ఆ తర్వాత తాను ఎందుకు ఈ సాహసానికి పూనుకున్నదో వివరిస్తుంది.
ఏళ్ల నాటి తపన
పర్వతాలను అధిరోహించాలని తనకు ఇరవై ఏళ్ల వయసున్నప్పుడే కలగన్నదట నాగరత్నమ్మ. కానీ, పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల నడుమ ఆ కల కళ్ల వెనకే దాగిపోయిందని చెబుతుంది. ‘‘కాలప్రవాహంలో నాలుగు దశాబ్దాలు దాటిపోయాయి. పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. బాధ్యతలేవీ లేకపోవడంతో నా కల ముందుకు వచ్చింది. మా అబ్బాయితో చెప్పాను. ముందు సంశయించాడు. ‘ఈ వయసులో పర్వతారోహణ.. అంటే మోకాళ్ల నొప్పులు వస్తాయి, భరించలేవు’ అన్నాడు. ‘నా కల నాలో ఉత్సాహాన్ని, శక్తిని పెంచుతుంది. నేనిలా పర్వతారోహణ చేయడం నా వయసు వాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, కాదనకు’ అని చెప్పాను.
అలా 40 ఏళ్ల తర్వాత నా కల నెరవేర్చుకోవడానికి మా అబ్బాయి, అతని మిత్రులతో కలిసి పశ్చిమ కనుమలకు చేరుకున్నాను. ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అంటారు నాగరత్నమ్మ. ఆమె చేసిన ట్రెక్కింగ్‌కి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
సాహసం నాగరత్నమ్మ వయసును తగ్గించింది. ఇప్పుడీ పర్వతారోహణ ఆమెలో మరింత శక్తిని నింపింది. దీంతో ‘మరిన్ని పర్వతారోహణలు చేసి, నా కలను సుసంపన్నం చేసుకుంటాను’ అంటూ తన లక్ష్యాన్ని వివరించే నాగరత్నమ్మను తప్పక అభినందించాల్సిందే!
ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
– నాగరత్నమ్మ