గిరి పుత్రిక.. గ్రేట్‌ జర్నీ | Tribal woman from Telangana to contest World Rappelling Tournament | Sakshi
Sakshi News home page

గిరి పుత్రిక.. గ్రేట్‌ జర్నీ

Published Tue, May 4 2021 12:48 AM | Last Updated on Tue, May 4 2021 12:48 AM

Tribal woman from Telangana to contest World Rappelling Tournament - Sakshi

రాపెల్లింగ్‌ సాహస క్రీడాపోటీలో కన్నిబాయి

కన్నిబాయి... అచ్చమైన ఆదివాసీ అమ్మాయి. ప్రకృతి ఒడిలో పుట్టింది. ప్రకృతితో కలిసిపోయి పెరిగింది. చెట్లెక్కడం, కొమ్మలను చేత్తో గట్టిగా పట్టుకుని ఊయలూగడం, ఒక్క పరుగులో కొండ శిఖరాన్ని చేరడమే ఆమెకు తెలిసిన ఆటలు. అవి ఒట్టి ఆటలు కాదు, సాహస క్రీడలు అని తెలిసి ఆశ్చర్యపోయింది. వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిసినప్పుడు కలిగిన అబ్బురం అంతా ఇంతా కాదు. పోటీలో పాల్గొనాలని సరదా పడింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది... వచ్చిన వాళ్లంతా అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన వాళ్లని. వాళ్ల భాష నాగరకం గా ఉంది.

తానందుకున్న జ్ఞాపికలు... అవార్డులు... పతకాలతో కన్నిబాయి
వాళ్లు ఉపయోగించే పదాలు కొత్తగా ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లనిపించింది. పోటీలు మొదలయ్యాయి. అత్యంత సులువుగా, అలవోకగా లక్ష్యాలను సాధించింది. ‘మీ కోచ్‌ ఎవరు? ఎంత కాలం నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్నారు’ అని అడిగినప్పుడు ఆమె ఒక్క మాటలో ‘‘ఈ పోటీలు ఉంటాయని పేపర్‌లో చూసి తెలుసుకున్నాను. శిక్షణ ఇస్తారని ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు. మమ్మల్ని కడుపులో పెట్టుకుని బతికించుకునే అడవి తల్లే నాకు శిక్షణ ఇచ్చింది’’ అని సమాధానం చెప్పింది. ఇంతకీ కన్నిబాయి ఎవరు? ఆమె ఆడిన ఆటలేంటి? ఆ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆమె గెలుచుకున్న పతకాలెన్ని? ఆమె అధిరోహించిన విజయ శిఖరాలేవి?
∙∙
కన్నిబాయిది కుమ్రుం భీము ఆసిఫాబాద్‌ జిల్లా, కెరమెరి మండలం, భీమన్‌ గొంది గ్రామం. కోలామ్‌ ఆదివాసీ కుటుంబంలో చిన్నమ్మాయి. తండ్రి పోడు వ్యవసాయం చేసేవాడు. తల్లి ఆదివాసీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో వంట చేసేది. తల్లితోపాటు స్కూలుకు వెళ్లడంతో ఆ ఇంట్లో తొలి విద్యావంతురాలు పుట్టింది. అలా కన్నిబాయి పదవ తరగతి వరకు ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్‌ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌లో చదివింది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది.

కన్నిబాయి అప్పుడు పేపర్‌లో తెలంగాణ అడ్వెంచర్‌ క్లబ్, నెహ్రూ యువజన కేంద్రం ఇచ్చిన ప్రకటనను చూసింది. పోటీలకు దరఖాస్తు చేసింది. ఆ పోటీలో మొత్తం పదహారు కేటగిరీలున్నాయి, అన్నీ సాహసక్రీడలే. ఎనిమిదింటిలో తొలిస్థానంలో నిలిచింది. ఆ ఆటలేవీ నేల మీద ఆడేవి కాదు. కొండ కోనల నుంచి లోయలోకి దిగాలి, లోయలో నుంచి కొండ మీదకు ఎక్కాలి. రాపెల్లింగ్‌ రెండు రకాలు, క్లైంబింగ్, జంపింగ్, బోటింగ్, జుమ్మరింగ్, బ్లైండ్‌ఫోల్, పారాషూటింగ్‌... అన్నింటిలోనూ పాల్గొన్నది. ఎనిమిదింటిలో తొలి స్థానంలో నిలిచిన జిల్లాస్థాయి పోటీలవి. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ తొలిస్థానమే ఆమెది. ఇది ఐదేళ్లనాటి మాట.

పతకాల పంట
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్, రాష్ట్ర అడ్వెంచర్‌ క్లబ్‌ సంయుక్తంగా 2019లో నిర్వహించిన పోటీల్లో పద్దెనిమిది దేశాల నుంచి వందకు పైగా సుశిక్షితులైన క్రీడాకారులు పాల్గొన్నారు. అరకులోయ దగ్గరున్న 350 అడుగుల కటికి జలపాతం రాపెల్లింగ్‌ పోటీల్లో వరల్డ్‌ కప్‌లో కన్నిబాయికి కాంస్య పతకం వచ్చింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకుని అదే ఉత్సాహంతో 2020లో జరిగిన సెకండ్‌ వరల్డ్‌ వాటర్‌ఫాట్‌ రాపెల్లింగ్‌ వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఒక బంగారు, వెండి, రెండు కాంస్యం... మొత్తం నాలుగు పతకాలను సాధించింది. ఆ పోటీలకు తెలంగాణ రాష్ట్రానికి ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా. ఈ యంగ్‌ అచీవర్‌... అదే ఏడాది ఆగస్టు లో వాటర్‌ఫాల్‌ రాపెల్లింగ్‌ వరల్డ్‌ కప్‌ ఆర్గనైజింగ్‌ కమిటీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితమైంది.

భగీరథ ప్రయత్నం
ఇంటర్‌ తర్వాత చదువులో కొంత విరామం తీసుకున్న కన్నిబాయి ఇప్పుడు ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదువుతోంది. ఆమె ఆటలపోటీలతోపాటు పర్వతారోహణలో కూడా ఓ మైలురాయిని చేరుకుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో  6,512 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్‌ భగీరథ శిఖరాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పద్దెనిమిది రోజులపాటు సాగిన ఆ సాహసయాత్ర అనుభవాలను ఆమె గుర్తు చేసుకుంటూ పోరాడే మొండితనమే తనను గెలిపించిందని చెప్పింది కన్నిబాయి. సాహస యాత్ర కూడా పోరాటం వంటిదే. ఈ పోరాటం లో లక్ష్యం తప్ప మరేమీ గుర్తుండ కూడదు, ఇతరత్రా ఏం గుర్తుకు వచ్చినా పోరాటాన్ని మధ్యలోనే ఆపేస్తాం. అందుకే మరేమీ గుర్తు తెచ్చుకోకూడదు అని సందేశాత్మక జీవిత సత్యాన్ని కూడా చెప్పిందీ పాతికేళ్ల అమ్మాయి. భవిష్యత్తులో ఎవరెస్టును అధిరోహించాలనేది తన కల అని చెప్పిన కన్నిబాయి ప్రస్తుతం పాంచులీ పర్వతారోహణకు సిద్ధమైంది. ఈ నెల తొమ్మిదో తేదీన మొదలయ్యే ఆమె గ్రేట్‌ జర్నీకి ఆల్‌ ది బెస్ట్‌.

పోరుబిడ్డ
ఆదివాసీ బిడ్డను, ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని చెప్పే కన్నిబాయి పోరాట యోధ కూడా, నాయ క్‌పోడు తెగకు చెందిన అమ్మాయిలు ట్రాఫికింగ్‌కు గురయినప్పుడు కన్నెర్ర చేసింది. పోలీసులు ఆ అమ్మాయిలను వెతికి తీసుకువచ్చే డెబ్బయ్‌ మంది ఆదివాసీలతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేసింది. ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని మరణించినప్పుడు ‘ఆమె మరణానికి అనారోగ్యమే కారణం’ అని కేసు ముగించడానికి సిద్ధమవుతున్న అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకుని పార్థివ దేహాన్ని కదలనివ్వకుండా అడ్డుపడి, దర్యాప్తుకోసం పట్టుపట్టింది. కుమ్రుం భీము మొదలుపెట్టిన ఆదివాసీల భూమి హక్కు పోరాటాన్ని ఈ తరంలో కన్నిబాయి కొనసాగిస్తోంది. కొంతమందికి పట్టాలిప్పించింది. కరెంటు లేని ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సోలార్‌ లైట్లు శాంక్షన్‌ చేయించి స్వయంగా మోసుకెళ్లి లైట్లు వేయించిన ధీర కన్నిబాయి.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement