మేనమామ బాటలో..
‘స్టాక్ కాంగ్రి’ పర్వతాన్ని అధిరోహించిన మల్లి మస్తాన్‌బాబు మేనల్లుడు వెంకటరమణ
సంగం: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మార్గంలో ఆయన మేనల్లుడు ఆమాస వెంకటరమణ కూడా పయనిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయ ప్రాంతాల్లో ఎత్తై శిఖరం ‘స్టాక్ కాంగ్రి’ని ఇటీవల ఆయన అధిరోహించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని జనసంఘానికి చెందిన వెంకటరమణ పర్వతారోహణ వివరాలను గురువారం విలేకరులకు వివరించారు. లడక్‌లోని మౌంటనీరింగ్ ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లగా, ఫౌండేషన్ సభ్యులు ఆలోచించారన్నారు. తన మారథాన్ యాత్రతోపాటు ఇతర రికార్డులు ఉన్నాయని తెలుసుకుని ఫౌండేషన్ సభ్యులు పర్వతారోహణకు అనుమతిచ్చారని చెప్పారు.
ఈ నెల 14న పర్వతారోహణ ప్రారంభించానని తెలిపారు. 6,153 మీటర్ల ఎత్తున్న స్టాక్ కాంగ్రి పర్వతాన్ని ఈ నెల 14 అర్ధరాత్రి ప్రారంభించి 15 మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరు వేల మీటర్ల ఎత్తుకు చేరానన్నారు. కానీ శరీర దారుఢ్యం, సరైన భోజనం లేనందున తిరిగి బేస్‌క్యాంపునకు చేరుకున్నానన్నారు. తర్వాత 15 అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి 16 మధ్యాహ్నం ఒంటి గంటకు పర్వతాన్ని చేరుకున్నాన ని పేర్కొన్నారు. అక్కడ తన గురువు, మేనమామ మల్లి మస్తాన్‌బాబు చిత్రపటాన్ని, జాతీయపతాకాన్ని ఎగురవేశానన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.