కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్‌లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్‌ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా.
నాసిక్‌కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్‌లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్‌పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్‌గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది.
ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది.
‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా.
Comments
Please login to add a commentAdd a comment