ఎంబీబీఎస్‌ టు ఐపీఎస్‌ | IPS Officer Tharun Joshi Mountaineering Special Story | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌.. టార్గెట్‌ ఎవరెస్ట్‌

Published Fri, Jan 31 2020 8:23 AM | Last Updated on Fri, Jan 31 2020 8:23 AM

IPS Officer Tharun Joshi Mountaineering Special Story - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆయన పేరు తరుణ్‌ జోషి... డాక్టర్‌ చదివినా 2004లో సివిల్‌ సర్వీస్‌ ఉత్తీర్ణులై ఐపీఎస్‌ అధికారి అయ్యారు. ప్రస్తుతం నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌కు సంయుక్త పోలీసు కమిషనర్‌ హోదాలో నేతృత్వం వహిస్తున్నారు. అదిలాబాద్‌ ఎస్పీగా పని చేస్తుండగా పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నారు... రెండేళ్ళ కాలంలో ఐదు పర్వతాలను అధిరోహించారు... గత నెలలోనే అంటార్కిటికా, ఆస్ట్రేలియాల్లో ఉన్న రెండింటిపై పాద మోపారు... ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్న ఆయన విజయాలపై ప్రత్యేక కథనం..

ఎంబీబీఎస్‌ టు ఐపీఎస్‌
పంజాబ్‌కు చెందిన తరుణ్‌ జోషి పటియాలాలోని గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ నుంచి బీడీఎస్‌ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్‌ సర్వీసెస్‌ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో ఐపీఎస్‌ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఓపక్క తన విధుల్ని సమర్థవంతంగా నిర్వరిస్తూనే... మరోపక్క ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం ఓయూ నుంచి పోలీస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆపై ఎల్‌ఎల్‌బీలో చేరిన ఆయన గత ఏడాది జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... ఓయూలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. 

రాచకొండ నుంచే నాంది
అదిలాబాద్‌ ఎస్పీగా పని చేసినన్నాళ్లూ పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్‌ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచ్చిన తరుణ్‌ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు. 2017లో హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్‌ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఐదింటిపై తన కాలు మోపారు. అనునిత్యం ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈయన పర్వతారోహణ కోసం అదనపు కసరత్తు చేస్తుంటారు. సమయం చూసుకుని ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే తన లక్ష్యమని తరుణ్‌ జోషి చెప్తున్నారు.

అనుకోకుండా ఆసక్తి..
తరుణ్‌ జోషి 2014 నుంచి 2016 వరకు అదిలాబాద్‌ జిల్లా ఎస్పీగా పని చేశారు. అప్పట్లో అదనపు ఎస్పీ జి.రాధిక ఆ జిల్లాలోనే పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఈమె అప్పట్లోనే కొన్నింటిని అధిరోహిస్తూ ఉండే వారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్‌ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు. ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడిని కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుణ్యాలకు ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు. 

అదో చిత్రమైన అనుభూతి
ఓ బృందంతో ఈ నెలలో అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌ను  అధిరోహించా. దక్షిణ ధృవంలో ఉన్న అంటార్కిటికాలో ప్రస్తుతం 24 గంటలూ పగలే ఉంటుంది. దీంతో రెండు రోజుల పాటు నిద్రపోవడానికి, సమయం గుర్తించడానికి చాలా ఇబ్బంది పడ్డా. వాచీ చూసుకుంటే 11, 12 గంటలు చూపించేది. అది పగలో, రాత్రో తెలియక తికమక పడాల్సి వచ్చింది. ఆపై ఫోన్‌లో టైమ్‌ను 24 గంటల ఫార్మాట్‌కు మార్చుకుని.. రాత్రి అయిందని తెలుసుకుని నిద్రపోయే వాళ్ళం. సూర్యరస్మి కారణంగా గరిష్టంగా 3 గంటలకు మించి నిద్ర పట్టేదికాదు. అది పర్వతారోహణ పూర్తయిన వారంలోనే ఆస్ట్రేలియాలోని మరో పర్వతాన్ని అధిరోహించాం. తదుపరి టార్గెట్‌... మౌంట్‌ ఎవరెస్ట్‌.– డాక్టర్‌ తరుణ్‌ జోషి, సంయుక్త సీపీ, సిటీ ఎస్బీ  

తరుణ్‌ జోషి అధిరోహించిన పర్వతాలు...
2018 మేలో సదరన్‌ రష్యాలోని భారీ అగ్నిపర్వతమైన మౌంట్‌ ఎల్బ్రస్‌ను  చేరుకున్నారు.  సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం యూరప్‌లోనే పెద్దది.  
2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్‌ ఎకనగ్వాపై అడుగుపెట్టారు. మెండౌజా ప్రావెన్సీలో ఉన్న దీని ఎత్తు 6962 మీటర్లు. దక్షిణ అమెరికాలోనే ఎత్తైనది.   
అదే ఏడాది ఆగస్టులో ఇండోనేషియాలో ఉన్న మౌంట్‌ కార్‌స్టెంజ్స్‌ ఎక్కారు. ఇది ప్రపంచంలోని మైదాన ప్రాంతంలో ఉన్న శిఖరాల్లో అతి పెద్దది. దీని ఎత్తు 4,884 మీటర్లు.
ఈ నెల 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎల్తైన మౌంట్‌ విన్సన్‌ను అధిరోహించారు. దీని ఎత్తు 4897 మీటర్లే అయినప్పటికీ.. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉంటుంది.
విన్సన్‌ అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్‌ కోస్యూస్కోపై కాలు పెట్టారు. ఇది సముద్ర మట్టానికి 2280 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement