చిన్నారి శిఖరం | An adventure of mountaineering | Sakshi
Sakshi News home page

చిన్నారి శిఖరం

Published Mon, Feb 25 2019 1:52 AM | Last Updated on Mon, Feb 25 2019 9:35 AM

An adventure of mountaineering - Sakshi

పర్వతారోహణ ఒక సాహసం. సాహసం కన్నా కూడా ఒక దుస్సాహసం. ఇంకా చెప్పాలంటే అదొక జీవన్మరణ ప్రయత్నం. ‘ఆడపిల్ల ఇంత సాహసానికి ఒడిగట్టడం అవసరమా’ అని తన గ్రామంలో ఎవరైనా అంటే.. ‘‘ఆ సాహసమే చేయకపోతే అందరిలో ఒకమ్మాయిగా ఉండిపోయేదాన్ని. ఆ సాహసమే నన్నీ రోజు అరుదైన కొందరిలో ఒక అమ్మాయిగా నిలబెట్టింది. ఎందరో అమ్మాయిలకు నన్ను రోల్‌ మోడల్‌ని చేసింది’’ అంటుంది మలావత్‌ పూర్ణ.

‘అమ్మాయి అనే కారణంగా ఎవరూ తమకొచ్చిన అవకాశాలను, తమ ఆశయాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్యాన్ని చేరడానికి అమ్మాయిగా పుట్టడం అనేది అడ్డంకి కాబోదు’ అని నిరూపించింది పూర్ణ. ‘సంకల్పబలం ముందు పేదరికం పక్కకు తప్పుకుంటుంది’ అంటున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం శిఖర సమానం అనిపించింది. అందుకే పూర్ణ.. ఒక చిన్నారి శిఖరం.

మలావత్‌ పూర్ణది నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామం. ఎనిమిది వందల జనాభా కూడా లేని ఓ కుగ్రామం. ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివింది. ఆరవ తరగతి నుంచి సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో చదువుకుంటోంది. ఇప్పుడు కామారెడ్డిలోని సోషల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజీలో బీ.ఎ. రెండవ సంవత్సరం చదువుతోంది. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్‌కి ప్రిపేరవ్వాలనేది ఆమె కెరీర్‌ ప్లాన్‌. తానీరోజు నడుస్తున్న విజయమార్గానికి తొలి అడుగులు వేయించింది అమ్మానాన్నల ముందుచూపే అంది పూర్ణ. ‘‘మమ్మల్ని (పూర్ణ, ఆమె అన్న నరేశ్‌) చదివించాలని అనుకోక పోయి ఉంటే ఈ రోజు ఈ సక్సెస్‌ మా ఊహకు కూడా అందేది కాదు.

మా బంజారా తండాల్లో నా వయసు అమ్మాయిలు పెళ్లి చేసుకుని పిల్లల తల్లులయి ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. మా నాన్న కల మమ్మల్ని చదివించాలని. నాన్న కలను అమ్మ గౌరవించింది. ఆరవ తరగతిలో వాళ్లు మమ్మల్ని హాస్టల్‌కి పంపించడం వల్లనే నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. మా నాన్న ఆరేడు కిలోమీటర్ల దూరం సైకిల్‌ మీద వెళ్లి ఎలక్ట్రికల్‌ వర్క్‌ నేర్చుకున్నాడు. తనకు చదువు లేదు, మేము చదువుకుంటే చూడాలనుకున్నాడు’’ అంటూ తాను మౌంటనీర్‌ కావడానికి దారి తీసిన సంఘటనలను పంచుకుంది పూర్ణ.

అప్పుడు ఎయిత్‌ క్లాస్‌
‘‘నేను ఎయిత్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ సెక్రటరీగా ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్స్‌లో చదువుకునే పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపును తుడిచేయాలనుకున్నారాయన. ‘ఈ పిల్లలు దేనిలోనూ వెనుకబడరు, అవకాశాలు కల్పించి, ప్రోత్సహిస్తే దేన్నయినా సాధించి తీరుతారు, శిఖరాలను చేరుతారు’ అని సమాజానికి చెప్పాలనుకున్నారు. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్న స్టూడెంట్స్‌ కోసం రాష్ట్రంలోని అన్ని సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లకూ సర్క్యులర్‌ పంపించారు. నేను స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండేదాన్ని. ఆల్‌రౌండర్‌గా ఉండడంతో మా స్కూల్‌ నుంచి నా పేరు కూడా పంపించారు.

అలా సెలెక్ట్‌ చేసిన నూట పదిమంది స్టూడెంట్స్‌ని భువనగిరికి రాక్‌ క్లైంబింగ్‌కి తీసుకెళ్లారు. అందులో అర్హత సాధించిన   పదిమంది అమ్మాయిలు, పదిమంది అబ్బాయిలను పేరెంట్స్‌ నుంచి అంగీకారం తీసుకున్న తర్వాత స్పెషల్‌ కోచింగ్‌కి డార్జిలింగ్‌కి తీసుకెళ్లారు. కోచింగ్‌ తర్వాత పదిహేను వేల అడుగుల ఎత్తున్న రినాక్‌ పీక్‌కి చేరుకున్నాను. అది నా తొలి రికార్డు. గవర్నమెంట్‌ స్కూళ్లలో చదువుతున్న పిల్లల కేటగిరీలో ఆ రికార్డు వచ్చింది. అప్పటి వరకు ఎవరెస్టు ఆలోచన లేదు. ఆ రికార్డు తర్వాతనే ప్రవీణ్‌ సర్‌కి ఎవరెస్టు అధిరోహణలో కూడా వీళ్లు విజయవంతం అవుతారని ఎందుకు నిరూపించకూడదు అనిపించింది. ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్‌ కోసం లధాక్‌ (3,000 మీటర్లు), స్టోక్‌ కాంగ్రి (ఎత్తు 6,153 మీటర్లు) పర్వతాలలో ప్రాక్టీస్‌ చేశాం. 2013 ఇలా ప్రిపరేషన్‌లో గడిచింది. ఎవరెస్టు శిఖరాన్ని 2014లో ఎక్కాను. అప్పుడు నేను నైన్త్‌ క్లాస్‌.

నేపాల్‌కు దారి లేదు
ఆ ఏడాది వాతావరణం ఏ మాత్రం అనుకూలించలేదు. మంచు చరియలు విరిగిపడడంతో రూట్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన 17 మంది షెర్పాలు (పర్వతారోహణ సహాయకులు) ప్రాణాలు కోల్పోయారు. దాంతో నేపాల్‌ వైపు నుంచి దారి మూసేసి, ఆ ఏడాదికి నిషేధం విధించారు. మేము చైనా వైపు నుంచి వెళ్లాం. నా బరువు 45 కిలోలు. మేము మోసుకెళ్లే బ్యాగ్‌ బరువు 15 కిలోలు. అదేమీ ఇబ్బంది కాలేదు, కానీ ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ ఇబ్బంది పెడుతుంది. ఆక్సిజన్‌ అందక తలనొప్పి, వాంతులు వచ్చాయి.  రెస్ట్‌ కోసం రెండు రోజులు బేస్‌ క్యాంపుకి పంపేశారు. అడ్వాన్స్‌డ్‌ బేస్‌ క్యాంపునకు చేరిన తర్వాత మళ్లీ సిక్‌నెస్‌ వచ్చింది. ఆక్సిజన్‌ పెట్టుకున్న తర్వాత నార్మల్‌ అయ్యాను, తీసేస్తే వాంతులయ్యేవి. వాతావరణం సహకరించక పది రోజులు బేస్‌ క్యాంపులో ఉండాల్సి వచ్చింది. అయితే... అవేవీ భయపెట్టవు. మౌంటెనీరింగ్‌కి దేహం కంటే మైండ్‌ ఫిట్‌గా ఉండాలి. మానసిక స్థైర్యమే ముందుకు నడిపిస్తుంది. అయినప్పటికీ ఒక సంఘటన నాలో వణుకు పుట్టించింది.

డ్రస్‌ కాదది!
ఎవరెస్ట్‌ను చేరే క్రమంలో సంభవించే మరణాల్లో ఎక్కువ భాగం మూడవ క్యాంపు తర్వాతనే. నా జర్నీలో స్టెప్‌ త్రీ దాటిన తర్వాత మరో ఇరవై నిమిషాల్లో శిఖరాన్ని చేరుతాననగా, ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న డ్రస్‌ ఒకటి కనిపించింది. పక్కనే ఉన్న షెర్పాతో ‘ఎందుకిలా డ్రస్‌ని ఇక్కడ వదిలేశారు’ అని అడిగాను. ‘డ్రస్‌ కాదు, డెడ్‌ బాడీ’ అన్నారు షెర్పా. పరిశీలనగా చూస్తే... బోర్లా తిరిగి ముడుచుకుని పడుకున్నట్లుగా ఉంది బాడీ. అప్పుడు వణికి పోయాను. వెంటనే నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ‘అమ్మాయిలు గెలవగలరని సమాజానికి చెప్పాలని ఇంతదూరం వచ్చాను. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలనేది నా మెంటార్‌ ప్రవీణ్‌ సర్‌ కల. నేను గెలిచి రావాలని ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. నేను ఓడిపోకూడదు, వెనుకడుగు వేయకూడదు’ అని కౌన్సెలింగ్‌ ఇచ్చుకుని, అందరిలాగానే డెడ్‌బాడీకి దణ్ణం పెట్టుకుని ముందుకు అడుగేశాను. ఎవరెస్టు ఆరోహణలో చివరి రోజు రాత్రి కాళ్లకు శవాలు తగులుతూ, ఒళ్లు గగుర్పొడిచేది. మూడవ క్యాంపు కంటే ముందయితే షెర్పాలు పర్వతారోహకులను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. మూడవ క్యాంపు తర్వాత రక్షించడం సాధ్యమయ్యే పని కాదు. 

సంతోషంతో కన్నీళ్లు
ఎవరెస్టు శిఖరాన్ని చేరిన తరువాత ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లు ఉంది. ఓ పది నిమిషాల సేపు ఫొటోలు తీసుకుంటూ గడిపేశాం. ఎటు చూసినా మనుషులు కనిపించే వాతావరణం నుంచి ఎటు చూసినా మంచు పర్వతాలే కనిపించే శిఖరం మీద ఉన్నాం... అనే భావనను చెప్పడానికి పదాలు దొరకవు. నాకు తెలిసిన పదాల్లోనే ప్రతి జ్ఞాపకాన్నీ డైరీ రాశాను. ఏడు శిఖరాల ఆరోహణ పూర్తయిన తర్వాత పుస్తకం రాస్తాను. ఏడు శిఖరాల ఆలోచన మొదట్లో లేదు. ఎవరెస్టును సాధించిన తరువాత కలిగింది. ఎవరెస్టు తర్వాత మరో మూడు శిఖరాలను అధిరోహించాను. మొదటగా ఎల్తైన శిఖరాన్ని చేరడంతో కావచ్చు అదే తీపిగుర్తుగా ఉండిపోయింది. మిగిలినవి ప్రయాణంలో మైలురాళ్లుగా అనిపిస్తున్నాయి. నా విజయానికి బహుమతిగా ప్రభుత్వం పాతిక లక్షల డబ్బు, ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, చదువుకి అయ్యే ఖర్చు కూడా శాంక్షన్‌ చేసింది. 

స్పానిష్‌ నచ్చింది
ఎవరెస్టు అధిరోహణకు ప్రభుత్వమే స్పాన్సర్‌ చేసింది. మిగిలిన వాటికి ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ మౌంటెనీరింగ్, ట్రెక్కింగ్‌ సర్వీసెస్‌ వాళ్లు స్పాన్సర్‌ చేస్తున్నారు. మాతోపాటు ఎవరెస్టు ఆరోహణలో కోచ్‌ శేఖర్‌బాబు కూడా ఉన్నారు కాబట్టి భాష ఇబ్బంది కాలేదు. శిఖరాధిరోహణలో నాకు ఎదురైన మనుషుల్లో అర్జెంటీనా వాళ్లు బాగా నచ్చారు. స్పానిష్, నేపాలీ భాషలు నచ్చాయి. నాకిప్పుడు బంజారా, తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలు వచ్చు. స్పానిష్, నేపాలీ భాషలు కూడా నేర్చుకుంటాను’’ అంటూ పరిపూర్ణంగా నవ్వింది మలావత్‌ పూర్ణ.
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటోలు : శివ మల్లాల

అందరి బడి
ప్రవీణ్‌ సర్‌ నా రోల్‌ మోడల్‌. ఆయనలాగే సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్‌లు చేయాలని కోరిక. ప్రభుత్వం పేద ప్రజల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకునేటట్లు చూడాలి. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ పాఠశాలలకంటే మెరుగ్గా తయారుచేస్తాను. గవర్నమెంట్‌ స్కూల్‌ పేదవాళ్ల బడి అనే దురభిప్రాయాన్ని పోగొట్టి, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేటట్లు మెరుగుపరుస్తాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే మాట... ‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. ఎవరెస్టు మీదకే కాదు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. ఒకరి ఆసరా కోసం ఎదురు చూడవద్దు. మీ శక్తిని మీరు తెలుసుకోండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చదువుని నిర్లక్ష్యం చేయవద్దు’.
– మలావత్‌ పూర్ణ, మౌంటనీర్‌

ఈ రికార్డు చెరిగిపోదు
పూర్ణ మలావత్‌.. ఎవరెస్టును అధిరోహించిన భారతీయుల్లో అత్యంత చిన్న వయస్కురాలు. ఎవరెస్టు శిఖరం మీద అడుగుపెట్టే నాటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాల పదకొండు నెలలు. ఈ రికార్డు కొంతకాలం డిక్కీ దోల్మాకు ఉండేది. డోల్మా 1974లో పుట్టారు, 1993లో ఎవరెస్టును అధిరోహించారు. అప్పటికి ఆమె వయసు 19. అప్పటి నుంచి 2003 వరకు పదేళ్ల పాటు ఆమెదే రికార్డు. 2003లో 15 ఏళ్ల మింగ్‌ కిపా ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. కిపా పేరుతో ఆ రికార్డు 2010 వరకు కొనసాగింది. ఆ ఏడాది అమెరికాకు చెందిన పదమూడేళ్ల పది నెలల కుర్రాడు జోర్డాన్‌ రోమెరో సొంతం చేసుకోగా 2014, మే నెల 25వ తేదీన పూర్ణ కొత్త రికార్డును రాసుకుంది. ‘యంగెస్ట్‌ ఇండియన్, యంగెస్ట్‌ గర్ల్‌ ఇన్‌ ద వరల్డ్‌ స్కేల్‌ మౌంట్‌ ఎవరెస్ట్‌’ రికార్డులు పూర్ణ సొంతం చేసుకుంది. పూర్ణకు కలిసి వచ్చిన మరో అంశం ఏమిటంటే... ఎవరెస్టును అధిరోహించడానికి కనీస వయసును నేపాల్‌ 16 ఏళ్లకు, చైనా 18 ఏళ్లకు పెంచేశాయి. ఈ నిబంధన ప్రకారం ఇక ఇంకా చిన్న వయసు వాళ్లెవరూ ఎవరెస్టును అధిరోహించడానికి వీలుకాదు. కాబట్టి పూర్ణకు ఈ రికార్డు ఎప్పటికీ అలాగే ఉంటుంది.  

పూర్ణ చేరిన శిఖరాలు
2014 : ఆసియాలో ఎవరెస్టు 
(29 వేల అడుగుల ఎత్తు)
2016 : ఆఫ్రికాలో కిలిమంజారో 
(19 వేలకు పైగా అడుగులు)
2017 : యూరప్‌లో ఎల్‌బ్రస్‌ 
(18 వేల ఐదొందల అడుగులు)
2019 : సౌత్‌ అమెరికాలో అకాంకగువా (దాదాపు 23 వేల అడుగులు)
(పూర్ణ ఈ నెల 14వ తేదీన అకాంకగువా శిఖరారోహణ పూర్తి చేసి, 21వ తేదీన ఇండియాకి తిరిగొచ్చింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement