అయినా... వారు బతికారు
చావు’..ఇది అందరికీ సహజంగా రాదు. కొందరి వయోవృద్ధులై చనిపోతే..మరికొందరు ప్రమాదవశాత్తు చనిపోతుంటారు. మనిషే కాదు, ఏ జంతువైనా సరే పుట్టిన మరుసటి రోజే జీవించి ఉంటుందో లేదో అన్న గ్యారంటీ లేదు. కాని కొందరి జీవిత చరిత్రలు గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వెనక్కి వచ్చేస్తుంటారు.
కొన్ని అనుకోని పరిస్థితులు మనిషిని మృత్యువు ముంగటి వరకూ తీసుకెళ్తాయి. ఈ స్థితిలో బతికేందుకు ప్రయత్నించిన వారిలో కొందరే చావును జయిస్తారు. అలాంటివారి గాథలు ఎప్పుడూ ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలా పట్టువదలకుండా ప్రయత్నించి, మృత్యువును జయించిన వారి గురించి నేటి ‘బిలీవ్’ లో తెలుసుకుందాం..!
విమానం కూలినా..ఏం తినకున్నా.. 42 రోజులు
సాధారణంగా ఎవరైనా ఆహారం లేకుండా పది రోజులకు మించి ఉంటే..పూర్తిగా నీరసించి చావుకు దగ్గరవుతారు. ఒకవేళ అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారైతే చనిపోవడం ఖాయం. కాని కెనడాకు చెందిన హెలెన్ కెల్బెన్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆమె ఆహారం లేకుండా ఏకంగా 42 రోజులు జీవించింది. అమెరికాకు చెందిన కెలెన్ ఫెయిర్ బ్యాంక్స్ నగరం నుంచి సీటిల్‌కు వెళ్లాలనుకుంది. అప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. 1963 ఫిబ్రవరి 4న పైటట్ రాల్ఫ్ ఫ్లోర్స్‌తో కలిసి ప్రత్యేక విమానంలో సీటిల్‌కు బయలుదేరింది. అయితే మంచు తుపాను కారణంగా మధ్యలోనే కెనడా సమీపంలోని ఓ మంచు పర్వతం వద్ద వారి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వారికి కొన్ని చోట్ల ఎముకలు విరగడంతోపాటు, చిన్నచిన్న గాయాలు కూడా అయ్యాయి. వారి వద్ద అత్యవసర స్థితిలో రక్షణకు ఉపయోగపడే పూర్తిస్థాయి సామాగ్రి కూడా లేదు.
కానీ అగ్గిపెట్టెతోపాటు, వారం రోజులకు సరిపడా ఆహారం మాత్రం ఉంది. విమానం కూలిపోయిన ప్రాంతంలో మంచు ఉండడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తక్కువగా (–41 డిగ్రీలు) ఉన్నాయి. ఈ స్థితిలో వారు ప్రాణాలు నిలుపుకొనేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. విమానం క్యాబిన్‌లోంచి ఓ బ్లాంకెట్‌ను తయారు చేసుకుని, ఇంధనంతో మంట వెలిగించుకున్నారు. వారం తర్వాత ఆహారం అయిపోయింది. మంచుకరగసాగింది. ఈ సమయంలో వారికి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా మంచును కరిగించడం వల్ల లభించినవే. అలా నీటితోనే ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 42 రోజులపాటు జీవించారు. చివరకు ఓ విమానం వారి జాడను కనిపెట్టడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సాధారణంగా ఆహారం లేకుండా అన్ని రోజులు జీవించడం కష్టమే. కానీ వారిరువురూ చాలా లావుగా ఉండడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వే వారిని రక్షించిందని వైద్యుల విశ్వాసం.
ప్రాణం కోసం చేతినే..!
అమెరికాకు చెందిన ఆరన్ రాల్ స్టన్‌కు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త రికార్డు సృష్టించాలని తాపత్రయం పడేవాడు. ఎప్పటిలాగే 2003 ఏప్రిల్ నెలలో ఉత్తాహ్ ప్రాంతంలోని బ్లూజాన్ అనే పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లాడు. దాదాపు సగం పర్వతాన్ని ఎటువంటి సమస్యా లేకుండా అధిరోహించాడు. మంచు కురుస్తున్న సమయం కావడంతో అతనికి దారి సరిగా కనిపించలేదు. అయితే ఈ సమయంలోనే ఓ పెద్ద రాయి(దాదాపు 360 కేజీల బరువు) ఒక్కసారిగా పై నుంచి పడింది. దీంతో రాల్‌స్టన్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన రాయి అతని కుడి చేతిపై పడింది. రాల్‌స్టన్ ఎంత ప్రయత్నించినా చేతిని రాయి కింది నుంచి తీయలేకపోయాడు. రాయి కిందనే చేయి ఇరుక్కుపోయి పూర్తిగా నలిగిపోయింది.
ఆ రాయిని పక్కకు జరిపేందుకు అతడు ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు. ఒంటరిగా చిక్కుకుపోయిన అతడిని రక్షిచేవారెవరూ అక్కడలేరు. అలా ఆరు రోజులపాటు చేయి రాయికింద ఇరుక్కుపోయి అలాగే ఉంది. ఆ చేయి అలాగే రాయికింద ఉంటే, ఇంకా కొద్ది రోజులకు అతడి ప్రాణాలు పోవడం ఖాయమని అనుకున్నాడు. అప్పటికే అతని చేతి నరాలు పూర్తిగా నలిగిపోయినట్టు రాల్‌స్టన్ గమనించాడు. చేతికి స్పర్శ కూడా లేకుండా పోయింది. చివరకు ఈ సమస్య నుంచి బయపడేందుకు అతడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాతికింద ఇరుక్కున్న భాగాన్ని కోసేసుకోకుంటే కనీసం ప్రాణమైనా మిగులుతుందని అనుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న ఓ చిన్న కత్తి సాయంతో అక్కడివరకు చేయిని కోసేసి, ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథతో ‘127 అవర్స్’ అనే మూవీ కూడా రూపొందింది. –సాక్షి, స్కూల్ ఎడిషన్