ఈ చర్మవ్యాధిని గృహిణులకు వచ్చే సమస్యగా ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇంటి గచ్చును శుభ్రం చేస్తుండటం, బట్టలు ఉతికే సమయంలో సబ్బు (డిటెర్జెంట్) వీళ్ల చేతుల్ని ప్రభావితం చేస్తుండటం, ఇంటిపనుల్లో ఇంకవైనా రసాయనాలు తగిలి చేతులు ఇరిటేషన్‌కు లోనవ్వడం వంటివి జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ‘హౌజ్ వైఫ్ డర్మౖటెటిస్’ అంటారు. దాంతోపాటు చెయ్యిపై దుష్ప్రభావాలు పడతాయి కాబట్టి దీన్ని ‘హ్యాండ్ ఎక్సిమా’, ‘హ్యాండ్ డర్మటైటిస్’ అని కూడా అంటారు. నిజానికి ఇది కేవలం గృహిణులనే కాకుండా పలు రకాల రసాయనాలు వాడే వృత్తుల్లో ఉండే వారందరికీ వస్తుంది.
ముఖ్యంగా శుభ్రం చేసే వృత్తుల్లో ఉన్నవారూ, కేటరింగ్, బ్యూటీ కేర్ సెలూన్‌లలో హెయిర్ డ్రస్సింగ్ చేసేవారూ, హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఉన్నవారు... వీళ్లంతా ఏదో ఒక డిటర్జెంట్ లేదా రసాయనం చేతుల్లోకి తీసుకొని పనిచేస్తుంటారు కాబట్టి వీళ్లందరినీ ఈ ఎగ్జిమా లేదా డర్మటైటిస్ ప్రభావం చూపుతుంది. పైగా చలి పెరిగే ఈ సీజన్‌లో ఇది మరింత బాధిస్తుంటుంది. మహిళలను ఎక్కువగా బాధించే ఈ సమస్య గురించి తెలుసుకుందాం.
ఈ వింటర్ సీజన్‌లో మామూలుగానే చర్మం పొడిబారడం ఎక్కువ. దీనికి తోడు రసాయనాలూ చేతులపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య మరింతగా అరచేతులూ, చేతివేళ్లూ, గోళ్ల చుట్టూ ఉండే చర్మం (పెరీ ఉంగ్యువల్) ప్రభావితమయ్యే భాగాల్లో ఈ సమస్య తీవ్రంగా మారినప్పుడు అక్కడ నీటిపొక్కుల్లా రావడాన్ని పామ్‌ఫాలిక్స్’ అని అంటారు.
ఒక్కోసారి కొందరిలో ఈ సమస్య అనువంశీకంగానూ కనిపిస్తుంది. తమ సొంత వ్యాధి నిరోధక శక్తే తమ చర్మాన్ని దెబ్బతీయడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని అలర్జిక్ రియాక్షన్స్, ఆహారం వల్ల కలిగే అలర్జీలు, చాలాసేపు నీళ్లలో ఉండటం వంటి అంశాలూ దీన్ని మరింత పెచ్చరిల్లేలా చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఇన్ఫెక్షన్‌లా కూడా మారి మరింత ఇబ్బంది కలిగించే అవకాశముంది.
నివారణ / మేనేజ్‌మెంట్ / చికిత్స...
ఇంటి పనులు అయిన వెంటనే ఘాటైన సువాసనలు లేని మంచి క్లెన్సర్‌ను గోరు వెచ్చని నీటిలో వేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఇందుకు వేడి నీళ్లు ఉపయోగించకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్లే వాడాలి). ఇక క్లెన్సర్‌ను ఎంపిక చేసే విషయంలో వాటిల్లో ఘాటైన లేదా చేతికి హానిచేసే తీవ్రమైన రసాయన సాల్వెంట్స్ లేకుండా జాగ్రత్తపడాలి.
∙చేతులకు ఈ సమస్యను తెచ్చిపెట్టే డిటర్జెంట్లు / రసాయనాలు కలిపిన నీళ్లు... వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం లేదా తప్పనప్పుడు ఈ ఎక్స్‌పోజర్ వ్యవధిని వీలైనంతగా తగ్గించడం.
చేతులను శుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్‌ను పాటించడం). ఇందుకోసం ఘాటైన సబ్బులను కాకుండా గ్లిజరిన్, ఆల్కహాల్ బేస్‌డ్ మైల్డ్ శానిటైజర్లు వాడటం. (కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)
ఇల్లు శుభ్రం చేసే సమయంలో లేదా ఇంటి పనులప్పుడు శుభ్రమైన కాటన్ గ్లౌజ్ వాడటం. ఇంటికి సంబంధించిన కాస్తంత మురికి పనులు (డ్రైయిన్లు శుభ్రం చేయడం వంటివి) చేసేటప్పుడూ గ్లౌజ్ ధరించడం.
చర్మ సంరక్షణ కోసం వాడే వాసన లేని ఎమోలియెంట్స్ (చేతులకు హాయిగొలిపే లేపనాల వంటివి) వాడటం.
అరచేతులు, చేతివేళ్లు తేమ కోల్పోకుండా ఉండేందుకు చేతికి కొబ్బరి నూనె లేదా చేతులు తేమ కోల్పోకుండా చేసే ఆయింట్‌మెంట్స్ / క్రీమ్స్ వాడటం.
చేతులకు తగిలే చిన్న చిన్న దెబ్బలు, గీరుకుపోవడం వంటి వాటినీ నిర్లక్ష్యం చేయకుండా వాటికి తగిన బ్యాండ్‌ఎయిడ్ వంటివి వేయడం.
ఈ జాగ్రత్తలు పాటించాక కూడా ఇంకా చేతులు పొడిబారిబోయి, చర్మం లేస్తుండటం, పొట్టురాలుతుండటం, పగుళ్లు వస్తుండటం జరుగుతుంటే డర్మటాలజిస్టుకు చూపించాలి. వారు తగిన పూతమందులు, ఇతరత్రా చికిత్సలతో సమస్యను తగ్గిస్తారు.
లక్షణాలు...
చేతులపై చర్మం బాగా పొడిగా మారడం, ఇంతగా పొడిబారడంతో పొట్టు లేస్తుండటం
చేతివేళ్లపై పగుళ్లు, ఈ పగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న పుండ్లలా మారడం (బ్లిస్టర్స్)
చర్మం ఊడిపోతూ ఉండటం , చర్మం ఎర్రబారడం
ఒక రకమైన నొప్పితో కూడిన ఇబ్బంది.
-డా. స్వప్నప్రియ
సీనియర్ డర్మటాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment