శిఖరాగ్రాన నిలిచే భవితకు.. ట్రెక్కింగ్ ట్రైనర్ | will complete Basic Mountaineering course, become a Trekking Trainer Career | Sakshi
Sakshi News home page

శిఖరాగ్రాన నిలిచే భవితకు.. ట్రెక్కింగ్ ట్రైనర్

Published Sun, Sep 14 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

శిఖరాగ్రాన నిలిచే భవితకు.. ట్రెక్కింగ్ ట్రైనర్

శిఖరాగ్రాన నిలిచే భవితకు.. ట్రెక్కింగ్ ట్రైనర్

పర్వతారోహణ.. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది. ఇది సాహసోపేతమైన ప్రయాణం. మహా పర్వతాలను, శిఖరాలను అధిరోహించేవారికి పేరు ప్రఖ్యాతలు దక్కుతున్నాయి. రికార్డుల్లో పేర్లు నమోదవుతున్నాయి. అందుకే దీనిపై ఆసక్తి చూపేవారి సంఖ్య అధికమవుతోంది. నగరాలు, పట్టణాల్లో ట్రెక్కింగ్ క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. సాహసాలను, సవాళ్లను ఇష్టపడే చిన్నారులు, యువతీయువకులు ఈ క్లబ్‌ల్లో చేరి, నడుముకు తాడు కట్టుకొని కొండలు, గుట్టలను చకచకా ఎక్కేస్తున్నారు. పర్వతాలను, కొండలను సురక్షితంగా అధిరోహించాలంటే తగిన శిక్షణ అవసరం. అలాంటి శిక్షణ ఇచ్చే నిపుణులే.. ట్రెక్కింగ్ ట్రైనర్లు. ట్రెక్కింగ్‌కు ఆదరణ లభిస్తుండడంతో శిక్షకులకు గిరాకీ పెరుగుతోంది. వీరికి విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రెక్కింగ్ ట్రైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేవారి సంఖ్య అధికమవుతోంది.  
 
 సొంత క్లబ్‌తో అధిక ఆదాయం: పర్వతారోహణ శిక్షకులకు ట్రెక్కింగ్ క్లబ్‌ల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు వీరిని నియమిస్తున్నారు. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారు ఒక బృందంగా ఏర్పడి సొంతంగా ట్రైనర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్రైనర్లు వృత్తిలో అనుభవం సంపాదించిన తర్వాత స్వయంగా క్లబ్‌ను ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం పొందొచ్చు. కార్పొరేట్ పాఠశాలల్లోనూ ట్రైనర్లకు అవకాశాలున్నాయి. విద్యార్థులకు వారాంతాల్లో నగర శివార్లలోని కొండల్లో శిక్షణ ఇస్తున్నారు. ట్రెక్కింగ్ ట్రైనర్లు పర్వతారోహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆహారం, నీరు, క్యాంపింగ్ ఎక్విప్‌మెంట్, భద్రతా పరికరాలను, ఔషధాలను సమకూర్చాలి. ట్రెక్లర్లకు అవసరమైన సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందించాలి.
 
 కావాల్సిన నైపుణ్యాలు: ట్రెక్ టైనర్లకు పర్వతాలు, కొండలు గుట్టలు, వాటి పరిసరాలు, ప్రయాణ మార్గాలు, భౌగోళిక స్థితిగతులు, అక్కడి వాతావరణ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండాలి.  వీరికి బృందాన్ని ముందుకు నడిపించే నాయకత్వ లక్షణాలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు, వేగంగా నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యాలు అవసరం. ట్రెక్కర్లు గాయపడే అవకాశాలుంటాయి. కాబట్టి ట్రైనర్‌కు ప్రథమ చికిత్సపై పరిజ్ఞానం ఉండడం చాలా ముఖ్యం. ట్రెక్కింగ్  కెరీర్‌లో సవాళ్లు అధికంగా ఉంటాయి.  వారం నుంచి పది రోజులపాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. తరచుగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలగాలి. వీటన్నింటికీ సిద్ధపడేవారు ఈ రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టొచ్చు.
 
 అర్హతలు: ట్రెక్కింగ్ శిక్షకులుగా కెరీర్‌ను ప్రారంభించాలంటే బేసిక్ మౌంటెయినీరింగ్ కోర్సు పూర్తిచేయాలి. ఇందులో ఐదు దశలు ఉంటాయి. అవి.. బేసిక్, అడ్వాన్స్‌డ్, మెథడ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్, సెర్చ్, రెస్క్యూ. ఒక్కో దశ కాల వ్యవధి నెల రోజులు. కోర్సులో భాగంగా పర్వతాలపై థియరీ నేర్పిస్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ కోర్సుల్లో చేరడానికి సాధారణ విద్యార్హతలు ఉంటే చాలు. అంతేకాకుండా నిర్దేశిత వయోపరిమితి, ఫిజికల్ ఫిట్‌నెస్ తప్పనిసరిగా ఉండాలి.
 
 వేతనాలు: క్వాలిఫైడ్ ట్రెక్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం అందుతుంది. సీనియర్  ట్రైనర్ నెలకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పొందొచ్చు. తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ.80 వేలకు పైగానే సంపాదించుకోవచ్చు.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్. వెబ్‌సైట్: www.ghac.in
     నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్
     వెబ్‌సైట్: www.nimindia.net
     హిమాలయన్ మౌంటెయినీరింగ్ ఇన్‌స్టిట్యూట్
     వెబ్‌సైట్: www.hmi-darjeeling.com
     అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్
     వెబ్‌సైట్: http://adventurehimalaya.org/
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కైయింగ్ అండ్ మౌంటెయినీరింగ్. వెబ్‌సైట్: http://iismgulmarg.com/
 
 ట్రెక్కింగ్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్
 ‘‘మనదేశంలో యువతకు పర్వతారోహణ, అడవుల్లో సాహస కృత్యాలు చేయడం అభిరుచిగా మారింది. వారికి శిక్షణ ఇవ్వడానికి నిపుణుల అవసరం పెరిగింది. డిమాండ్‌కు తగినట్లుగా ట్రెక్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ట్రెక్కింగ్ ట్రైనర్లకు నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా వేతనం లభిస్తుంది. గైడ్స్, అసిస్టెంట్స్, ట్రెక్కింగ్ మేనేజర్లుగా పలు విభాగాల్లో పనిచేయవచ్చు’’
 - దియానత్ అలీ, డెరైక్టర్,
 గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్
 
 విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు
 బెంగళూర్‌లోని విజయా బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
  ప్రొబేషనరీ సెక్యూరిటీ ఆఫీసర్ (స్కేల్ - 2)
 పోస్టుల సంఖ్య: 15
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్ కమిషన్డ్ సర్వీస్/ పోలీస్ ఆఫీసర్ (ఏఎస్పీ/ డీఎస్పీ)గా ఐదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబరు 3
 వెబ్‌సైట్: http://ibpsregistration.nic.in/ibps_vijaya/
 
 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  డీలర్ (గ్రేడ్-4 )
 అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. నాలుగేళ్ల అనుభవం అవసరం.
  డీలర్(గ్రేడ్ - 3)
 అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి.  
 వయసు: 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
  ఈక్విటీ రీసెర్చ్ ఎనలిస్ట్
 అర్హతలు:  ఎకనామిక్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం అవసరం.
 వయసు: 25 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 23
 వెబ్‌సైట్: www.unionbankofindia.co.in
 
 డీఎన్బీ సెట్ - 2015
 నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ‘డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (డీఎన్బీ సెట్)- 2015’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన వారికి పీజీ మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
  డిప్లొమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్
 
  టెస్ట్ - జనవరి 2015
 విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో థెరపీ, రేడియో డయాగ్నసిస్, అనెస్థీషియాలజీ, డెర్మటాలజీ అండ్ వెనీరియాలజీ, రెసిపిరేటరీ డిసీజెస్, న్యూక్లియర్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యామిలీ మెడిసిన్, రూరల్ సర్జరీ, ఇమ్యునో హెమటాలజీ అండ్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, మెటర్నల్ చైల్డ్ హెల్త్, ఫీల్డ్ ఎపిడిమియాలజీ
 అర్హతలు: ఎంబీబీఎస్ ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబరు 18
 వెబ్‌సైట్: http://cet.natboard.edu.in/
 
 ఎడ్యూ న్యూస్: ఈఎస్‌సీఐలో నేటి నుంచి ‘ఐఈ-ఫెస్ట్’
 పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను సొంతం చేసుకున్నప్పుడే ఇంజనీరింగ్ విద్యార్థికి పరిపూర్ణత వస్తుంది అంటున్నారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డెరైక్టర్ యు.చంద్రశేఖర్. ఈ వాస్తవాన్ని ప్రాక్టికల్‌గా చెప్పే ప్రయత్నంలో భాగంగా ‘ఐఈ (ఇన్‌స్పైరింగ్ ఇంజనీరింగ్)-ఫెస్ట్ 2014’ నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 14, 15న గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగే ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపకరించే పలు అంశాలున్నాయి. ఆయా రంగాల నిపుణులు ప్రసంగించనున్నారు.  
 వివరాలకు: www.escihyd.org/iefest2014
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఇంగ్లిష్ నుంచి  ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? ఎలా చదవాలో తెలపండి.
     - జి.సందీప్‌కృష్ణ, శివరాంపల్లి
 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా ఇవి పదో తరగతి స్థాయిలో ఉంటాయి. ప్రధానంగా అయిదారు రకాల వ్యాకరణాంశాలపై ప్రశ్నలు అడుగుతారు. వీటిలో కింద పేర్కొన్న అంశాలు ముఖ్యమైనవి.
 1. Synonyms 2. Antonyms 3. Fill in the blanks (Prepositions, Tense, suitable  verb forms, vocabulary etc.,) 4. Reading passage 5. Spellings 6. Correction of sentences 7. Jumbled words
 ఈ అంశాలపై పట్టు సాధిస్తే పరీక్షలో మంచి మార్కులు పొందొచ్చు. పదో తరగతి ఇంగ్లిష్ పాఠ్య పుస్తకం చివరన ఇచ్చిన వ్యాకరణాంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. లేదా ఏదైనా ప్రామాణిక గ్రామర్ పుస్తకాన్ని ఎంచుకోవచ్చు. మిగతా సబ్జెక్టులతో పోలిస్తే.. విద్యార్థులు ఇంగ్లిష్ విభాగంలో తక్కువ శ్రమతోనే అధిక మార్కులు సంపాదించే అవకాశం ఉంది.
 ఇన్‌పుట్స్: జీఎస్‌ఆర్‌కే బాబూరావు,
 సీనియర్ ఫ్యాకల్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement