ఎవరెస్టు ఎక్కేసిన నీలిమ
ఎట్టకేలకు పూదోట నీలిమ తన పంతం నెగ్గించుకున్నారు. తన చిరకాల వాంఛ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరంపై పాదం మోపారు. విజయవంతంగా.. ఎవరెస్టు అధిరోహణం పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ లోని మెహదీపట్నం వాసి పూదోట నీలిమ ఎవరెస్టు శిఖరం పై మువ్వన్నెల పతాకను ఎగుర వేశారు. మగళవారం ఉదయం ఎవరెస్టు పై నీలిమ కాలుమోపినట్లు ఆమెకుటుంబ సభ్యులు తెలిపారు.
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తుకపాలెం గ్రామానికి చెందిన నీలిమ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఆమె తండ్రి శౌరయ్య జర్నలిస్టు. బీటెక్ పూర్తి చేసిన నీలిమ బెంగళూరు లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే మక్కువ ఉన్న నీలిమ గత ఏడాది ఏప్రిల్ లో తొలిసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. అప్పట్లో నేపాల్ లో సంభవించిన పెను భూకంపం కారణంగా.. తన ప్రయత్నం విఫలమైంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బేస్ క్యాంప్ నుంచే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అయితే ఈ సారి విజయ వంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు నీలిమ కుటుంబ సభులు తెలిపారు.నీలిమ సాహసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎవరెస్టును అధిరోహించిన తొలి నవ్యాంధ్ర మహిళగా ఆమె అందరికీ గర్వకారణమని కొనియాడారు. నీలిమ చిరకాల కోరిక తీరడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నీలిమ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.