![CID Radhika mountaineering in Nepal too - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/5/04VWB803-606220.jpg.webp?itok=py-6RS81)
సాక్షి, అమరావతి: పర్వతారోహణలో పట్టు సాధించిన ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ జీఆర్ రాధిక నేపాల్‌లోని హిమాలయ శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. నేపాల్‌లోని సుమిత్ శిఖరం కింద మంచు కరగడం, భారీగా రాతి పతనం, పట్టుకునేందుకు తాడు లేకపోవడం వంటి కారణాలతో ఈ సమయం (సీజన్)లో పర్వతారోహకులు ఆ శిఖరాన్ని చేరుకోలేరు. అయినా పట్టుదలతో రాధిక పర్వతారోహణ చేపట్టారు. లోతైన పగుళ్లు, భారీ ఈదురు గాలులకు ఎదురొడ్డి మొత్తం 6,189 మీటర్ల ఎత్తున్న శిఖరంలో 6,080 మీటర్లు చేరుకోగలిగారు.
నేపాల్‌లో ఆమె చేసిన మొదటి హిమాలయ పర్వతారోహణ ఇది. కాగా, తొలి నుంచి పర్వతారోహణపై మక్కువ ఉన్న రాధిక ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుని సాధించారు. ఒకవైపు గృహిణిగా, మరోవైపు సీఐడీ అధికారిణిగా, ఇంకోవైపు పర్వతారోహకురాలిగా మూడు పాత్రలు పోషించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరెస్ట్, కిలిమంజారో, కోసియోస్కో, ఎల్‌బ్రస్, అకాంకాగువా, దేనాలి, విన్‌సన్ పర్వతాలను అధిరోహించి ఆమె రికార్డు నెలకొల్పారు. తాజాగా నేపాల్‌లో పర్వతారోహణ చేసిన ఆమె తనను ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ, సీఐడీ, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment