GR Radhika
-
సీఐడీ అదనపు డీజీ సునీల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును, ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికకు సైబర్ స్టార్ అవార్డులను ప్రకటించాయి. ఐఎస్ఈఏ, సీపీఎఫ్, ఐజీఎం, ఫ్రో డిస్కవర్, పీఎస్ఎం సంస్థలతో కలసి సీఆర్‌సీఐడీఎఫ్ ‘ఉత్తమ సైబర్ విధానాలు’ అనే అంశంపై మూడో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. వర్చువల్ విధానంలో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. సైబర్ పోలీసింగ్, సైబర్ నేరాల పరిష్కారంలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టినందుకు 2021కు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు సీఆర్‌సీఐడీఎఫ్ తెలిపింది. సైబర్ నేరాల కట్టడి కోసం తగిన రీతిలో వ్యవస్థను బలోపేతం చేసినందుకు సీఐడీ విభాగం ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికను ‘సైబర్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలను ఈ జాతీయ సదస్సులో వక్తలు ప్రశంసించారు. దేశంలో అత్యధికంగా సైబర్ సేఫ్ లాగిన్స్‌ను తయారు చేసిన ఘనత ఏపీ సీఐడీ విభాగానిదేనని పేర్కొన్నారు. సైబర్ బుల్లీషీట్స్, 4ఎస్4యు పోర్టల్, ఫ్యాక్ట్ చెక్, యూట్యూబ్ వెబినార్స్ మొదలైన వినూత్న విధానాలను పీవీ సునీల్‌కుమార్ ప్రవేశపెట్టారు. వాటిని సైబర్ క్రైమ్స్ విభాగం సమర్థంగా నిర్వహిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తోంది. రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలు, వ్యూహాలను సీఆర్‌సీఐడీఎఫ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. -
నేపాల్లోనూ సీఐడీ రాధిక పర్వతారోహణ
సాక్షి, అమరావతి: పర్వతారోహణలో పట్టు సాధించిన ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ జీఆర్ రాధిక నేపాల్‌లోని హిమాలయ శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. నేపాల్‌లోని సుమిత్ శిఖరం కింద మంచు కరగడం, భారీగా రాతి పతనం, పట్టుకునేందుకు తాడు లేకపోవడం వంటి కారణాలతో ఈ సమయం (సీజన్)లో పర్వతారోహకులు ఆ శిఖరాన్ని చేరుకోలేరు. అయినా పట్టుదలతో రాధిక పర్వతారోహణ చేపట్టారు. లోతైన పగుళ్లు, భారీ ఈదురు గాలులకు ఎదురొడ్డి మొత్తం 6,189 మీటర్ల ఎత్తున్న శిఖరంలో 6,080 మీటర్లు చేరుకోగలిగారు. నేపాల్‌లో ఆమె చేసిన మొదటి హిమాలయ పర్వతారోహణ ఇది. కాగా, తొలి నుంచి పర్వతారోహణపై మక్కువ ఉన్న రాధిక ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుని సాధించారు. ఒకవైపు గృహిణిగా, మరోవైపు సీఐడీ అధికారిణిగా, ఇంకోవైపు పర్వతారోహకురాలిగా మూడు పాత్రలు పోషించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరెస్ట్, కిలిమంజారో, కోసియోస్కో, ఎల్బ్రస్, అకాంకాగువా, దేనాలి, విన్సన్ పర్వతాలను అధిరోహించి ఆమె రికార్డు నెలకొల్పారు. తాజాగా నేపాల్‌లో పర్వతారోహణ చేసిన ఆమె తనను ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ, సీఐడీ, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏఎస్పీ రాధికకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: జీరో డిగ్రీ ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే అంటార్కిటికా ప్రాంతానికి వెళ్లాలని ఉందని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జి.ఆర్.రాధిక అన్నారు. ఆర్థిక సహకారం అందింతే భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేస్తానన్నారు. ఎవరెస్ట్ అధిరోహణ క్రమంలో కొన్ని కష్టాలు ఎదురైనా అందరి ప్రోత్సాహంతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆదిలాబాద్ అదనపు ఎస్పీ రాధికను డీజీపీ అనురాగ్‌శర్మ అభినందించారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి తిరిగి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు కుటుంబసభ్యులు, పోలీసు క్రీడావిభాగం అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఏప్రిల్ 6న బయలుదేరిన రాధిక కఠ్మాండు మీదుగా తొలి బేస్ క్యాంప్‌ను ఏప్రిల్ 19న చేరుకున్నారు. అనంతరం వివిధ పర్వత అంచులను చేరుకుంటూ ఈ నెల 20న ఎవరెస్ట్‌ను అధిరోహించారు.