ఏఎస్పీ రాధికకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: జీరో డిగ్రీ ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే అంటార్కిటికా ప్రాంతానికి వెళ్లాలని ఉందని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జి.ఆర్.రాధిక అన్నారు. ఆర్థిక సహకారం అందింతే భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేస్తానన్నారు. ఎవరెస్ట్ అధిరోహణ క్రమంలో కొన్ని కష్టాలు ఎదురైనా అందరి ప్రోత్సాహంతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆదిలాబాద్ అదనపు ఎస్పీ రాధికను డీజీపీ అనురాగ్‌శర్మ అభినందించారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి తిరిగి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు కుటుంబసభ్యులు, పోలీసు క్రీడావిభాగం అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఏప్రిల్ 6న బయలుదేరిన రాధిక కఠ్మాండు మీదుగా తొలి బేస్ క్యాంప్‌ను ఏప్రిల్ 19న చేరుకున్నారు. అనంతరం వివిధ పర్వత అంచులను చేరుకుంటూ ఈ నెల 20న ఎవరెస్ట్‌ను అధిరోహించారు.