క్లైంబింగ్‌.. సాహసోపేతం | National Mountain Climbing Day 2024 | Sakshi
Sakshi News home page

క్లైంబింగ్‌.. సాహసోపేతం

Published Thu, Aug 1 2024 11:13 AM | Last Updated on Thu, Aug 1 2024 11:17 AM

National Mountain Climbing Day 2024

పర్వతారోహణకు పెరిగిన ఆదరణ, ఆసక్తి  

ఇందుకు శారీరక, మానసిక శిక్షణ అవసరం 

ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ అనర్థమే.. 

క్లైంబింగ్‌ డే నేపథ్యంలో.. 

ఎవరెస్ట్‌ ఎత్తు ఎంతో ఊహించడమే చాలా కష్టం.. అలాంటిది ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తూ మనిíÙకి అసాధ్యమంటూ ఏమీ లేదని నిరూపిస్తుంటారు కొందరు పర్వతారోహకులు. ఈ పర్వతారోహణం అనేది గొప్ప ప్రయత్నంగా కీర్తించబడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని అందిస్తుంది. ఈ పర్వతారోహణలో భారతీయులు కూడా సత్తాచాటిన సందర్భాలు ఎన్నో.. హిమాలయాలు మొదలు వివిధ ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించి భారత పతాకాన్ని సగర్వంగా నిలిపిన సందర్భాలు సైతం ఎన్నో ఉన్నాయి. అయితే ఈ పర్వతారోహణం అంత సులువు కాదు, విపత్కర పరిస్థితులకు క్లైంబింగ్‌ ప్రధానమైన ప్రయత్నమని పలువురు పర్వతారోహకులు చెబుతున్నారు. దీనికంటూ ప్రత్యేక శిక్షణ, అనుభవం అవసరమని హెచ్చరిస్తున్నారు. నేడు నేషనల్‌ మౌంటేన్‌ క్లైంబింగ్‌ డే నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలు.  

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుండటంతో పలువురు ఔత్సాహికులు క్లైంబింగ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని పలు ప్రైవేటు సంస్థలు సైతం పర్వతారోహణకు సంబంధించి శిక్షణ అందిస్తున్నారు. కానీ క్లైంబింగ్‌ అనేది అత్యంత సాహసోపేతమైన ప్రయత్నమని, దీని కోసం జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న కేంద్రాల్లోనే శిక్షణ పొందడం అవసరమని నిపుణులు, అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఈ శిక్షణకు నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటేనిరింగ్‌ (ఉత్తర్‌ కాశీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటేనిరింగ్‌ అండ్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్, అటల్‌బీహార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటేనిరింగ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), హిమాలయన్‌ మౌంటేనిరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డార్జిలింగ్‌) వంటి కేంద్రాలు ప్రధానమైనవని పర్వతారోహకులు వెల్లడిస్తున్నారు. ఈ శిఖరాలను చేరడం అంత సులువు కాదు, సరైన శిక్షణ లేకుండా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిస్తున్నారు. ట్రెక్కింగ్, క్లైంబింగ్‌ ఒకటి కాదు.. వీటి మధ్య ఎంతో వ్యత్యాసముందని నిపుణుల సూచన.

ప్రాణాలతో చెలగాటం.. 
పర్వతారోహణం అంటే ప్రకృతితో మమేకమైతూ.. అక్కడి విపత్కర పరిస్థితులకు మన దేహాన్ని అనువుగా మార్చుకుంటూ లక్ష్యాన్ని 
చేరడం. దీనికి అత్యంత కఠినమైన శిక్షణ అవసరం. నేను ఎన్‌సీసీ నుంచి క్లైంబింగ్‌కు ఎంపికై ఉత్తర కాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటేనింగ్‌లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ వల్లే ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో ఐదింటిని అధిరోహించాను. పర్వతారోహణం అంత సులువు కాదు.. ప్రాణాలతో చెలగాటం. ఎంతో మానసిక ధృఢత్వం అవసరం. 2019లో నేను క్లైంబింగ్‌ చేస్తున్న సమయంలో ఐదుగురితో ఉన్న బృందంలో ఇద్దరు చనిపోవడం చూశాను. ఏడాది ఆలస్యమైనా పర్వాలేదు.. కానీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే శిక్షణ తీసుకోవాలి. క్లైంబింగ్‌లో ఏ దిశలో, ఎంత కోణంలో, అనువైన ఫిట్‌నెస్‌తో ప్రయాణించాలి తదితర అంశాల్లో ప్రామాణికమైన శిక్షణ అవసరం. అంతేగాకుండా ఇదో ప్యాషన్‌గా మారి క్లైంబింగ్‌ కోసం వచ్చి హిమాలయాల వంటి ప్రదేశాలను ప్లాస్టిక్‌తో నింపేస్తున్నారు. అనవసర చెత్తతో ప్రకృతిని కాలుష్యం చేస్తున్నారు. విశిష్టమైన కేంద్రాల్లో ఆర్మీ అధికారులు వీటన్నింటిపైన బేసిక్, అడ్వాన్స్‌డ్, అడ్వెంచరస్‌ తదితర విభాగాల్లో శిక్షణ అందిస్తారు. 

 – అంగోత్‌ తుకారాం. (దక్షిణాది నుంచి మౌంట్‌ ఎవరెస్టు అధిరోహించిన మొదటి పిన్న వయసు్కడు.)

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement