‘శిఖర’ సమానం | Mountaineering Bhagirath-2 mountain by Handicaped | Sakshi
Sakshi News home page

‘శిఖర’ సమానం

Published Wed, Sep 4 2019 3:11 AM | Last Updated on Wed, Sep 4 2019 3:11 AM

Mountaineering Bhagirath-2 mountain by Handicaped  - Sakshi

భాగీరథి–2 శిఖరంపై ఆర్య వర్థన్,అర్షద్‌..

రాంగోపాల్‌పేట్‌: కొండ అద్దమందు కొంచమై ఉండదా.. అన్నాడు వేమన. కానీ, వీరి ఆత్మబలమందు శిఖరమే కొంచమైంది! మంచు కొండలు కరిగిపోతున్నా.. ఇంచు కూడా వెనుకడుగు వేయలేదు. ఎత్తువెళ్లే కొద్దీ ఆక్సిజన్‌ దొరక్క ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్‌ ఉన్నా ఆత్మవిశ్వాసమే శ్వాసగా.. హిమశిఖరం అధిరోహించారు. భాగీరథ–2 పర్వతాన్ని 18,000 అడుగుల మేర ఎక్కి ‘దివ్య’ మైన చరిత్ర సృష్టించారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని నిరూ పించారు. సాహసంలోనూ వారిది సహవాసమే. పర్వతారోహణను పూర్తిచేసుకుని మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకు న్నారు. వారికి గోపాలపురం పోలీసులు ఘనస్వాగతం పలికారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన తెలుగుతేజాలైన షేక్‌ అర్షద్‌(26), ఆర్యవర్ధన్‌(17)లపై ప్రత్యేక కథనం...

కాలు లేదని కుంగి పోలేదు..
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇస్మాయిల్, మోసిమ్‌ల కుమారుడు షేక్‌ అర్షద్‌(26). 2004 సంవ త్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు మోకాలి పైవరకు పోయింది. అయినా కుంగిపోకుండా డిగ్రీ చేశాడు. ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ ప్యారా హ్యాండ్‌ సైక్లింగ్‌ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాడు. సరూర్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల ఆర్య వర్ధన్‌ డిగ్రీ చదువుకున్నాడు. నాలుగేళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. ఆటోలో వస్తుండగా కింద పడ్డాడు. కుడికాలు నుజ్జు్జకావడంతో మోకాలి పైవరకు తీసేశారు. తండ్రి లేడు. తల్లి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది.

ఆ ఆరుగురిలో ఇద్దరు మనవాళ్లే..
ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ సహకారంతో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వెంచర్స్‌ అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో అర్షద్, ఆర్యవర్ధన్‌ నాలుగేళ్లు కలిసే శిక్షణ తీసుకున్నారు. వీరి కోసం ఖరీదైన కృత్రిమ కాలును తయారు చేయించారు. బీఎస్‌ఎఫ్‌ శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆరుగురు ప్యారాఅథ్లెట్స్‌ను పర్వతారోహణకు ఎంపిక చేయగా వారిలో వీరిద్దరు ఉన్నారు. ఈ ఆరుగురు ఆగస్టు 10న ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి పర్వతారోహణ ప్రారంభించారు. వీరిలో నలుగురు అథ్లెట్స్‌ 21,365 అడుగుల ఎత్తుండే భాగీరథ శిఖరాన్ని అదిరోహించారు. కానీ ఆర్యన్, అర్షద్‌లకు తీవ్రమైన ప్రతికూల వాతారణ పరిస్థితులు ఎదురుకావడంతో ఆగస్టు 27వ తేదీనాటికి భాగీరథ పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేర అధిరోహించారు. పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేరకు ఎక్కిన తెలుగు దివ్యాంగులుగా చరిత్ర సృష్టించారు.

16కి.మీ. ఒకేరోజు నడిచాం: అర్షద్‌
గతంలో నేను ఎప్పుడూ 3 కి.మీ.ల కంటే ఎక్కు వగా నడవలేదు. పర్వతారోహణలో ఒకేరోజు 16 కి.మీ. ఏకధాటిగా నడిచా. ప్రొస్తటిక్‌ లింబ్‌తో దీన్ని పూర్తి చేయగలిగాను. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయి. ఒక మృతదేహం కనిపించినా భయపడలేదు. పైకి వెళ్తుంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించేది.

13కేజీల బరువుతో: ఆర్యవర్ధన్‌
జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హిమపాతాలు, బండరాళ్లు, నదులు, మంచుపగుళ్లు, వడగళ్లు, భారీ వర్షాలు ఎన్నెన్నో అనుభవాలు ఎదుర య్యాయి. 12 నుంచి 13 కిలోల బరువున్న బ్యాగులు భుజానికి తగిలించుకుని ముందుకు సాగాం. ఇప్పుడు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అది రోహించడానికి మానసికంగా సిద్ధమయ్యాను. 

2020లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తాం
2020 సంవత్సరంలో 12 మంది ప్యారా అథ్లెట్స్‌కు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేదికు సిద్ధం చేస్తాం. దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారనేది నిరూపిస్తాం. 
– ఆదిత్య మెహతా, ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement