NCC Cadet
-
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్‌లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
పర్వతాలు పిలిచాయి
‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్ మ్యూర్. ఒకానొక సమయంలో శాలిని సింగ్‌కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్‌లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్.... లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్ పీజీ కాలేజీలో శాలిని సింగ్ బీఏ స్టూడెంట్. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని. 19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు. ఎన్సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్‌లో శాలిని సింగ్ సీనియర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జమ్ములోని పహల్గామ్లో గత సంవత్సరం బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్డ్ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని. ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్ పునీత్ శ్రీవాస్తవ. ‘శాలిని విజయం ఎన్సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని. ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది శాలిని సింగ్ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని! -
రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఒక భాగమై, దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సహనం, సంయమనం, పరిణతి చూపిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రధాని ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్ కీ బాత్’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కార్ప్స్) కేడెట్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘రాజకీయాల్లోకి ప్రవేశించాలని కానీ, రాజకీయాల గురించి కానీ ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు రాజకీయ నేతగా మారా. దేశ సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నా. దేశ సేవకే పూర్తిగా అంకితమైపోయా’అని ప్రధాని తెలిపారు. ‘చదవడం నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతా. అప్పుడప్పుడు సినిమాలు, చాలా తక్కువగా టీవీ చూస్తుంటా. కానీ, గూగుల్ ప్రభావం పుస్తక పఠనంపై పడింది. ఏ విషయం గురించి అయినా గూగుల్‌లో వెంటనే తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకాలు చదవడం తగ్గిపోయింది’ అని అన్నారు. ‘పాఠశాల రోజుల్లో ఎన్సీసీ కేడెట్‌గా చాలా క్రమశిక్షణతో ఉండేవాడిని. అందుకే ఎన్నడూ శిక్షకు గురికాలేదు. ఓసారి చెట్టు కొమ్మపై గాలిపటం దారంలో ఇరుక్కున్న పావురాన్ని రక్షించేందుకు చెట్టెక్కా. పై అధికారి నన్ను శిక్షిస్తారని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు’అని చిన్ననాటి ఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ఐకమత్యం, శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. విశాఖ స్కూబా డైవర్లకు ప్రధాని ప్రత్యేక ప్రశంసలు పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణకు విశాఖకు చెందిన ‘ప్లాటిపస్ ఎస్కేప్’అనే సంస్థకు చెందిన స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ వీరిని మన్ కీ బాత్‌లో ప్రశంసిం చారు. వీరు తీరానికి 100 మీటర్ల దూరంలో సుముద్ర గర్భం లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగిస్తున్నారని, రెండు వారాల్లో 4 వేల కేజీల ప్లాస్టిక్‌ను తొలగించినట్లు తనకు తెలిసిందని ప్రధాని వివరించారు. ఈ ప్రక్రియలో స్కూబా డైవర్లకు స్థానికులు సహకరిస్తున్నారని, వీరి చిరు ప్రయత్నం ఇప్పుడు ఉద్యమంగా మారుతోందన్నారు. -
గురితప్పని షూటర్ కొండపల్లి శ్రియారెడ్డి ..
సాక్షి, ఖమ్మం: కృషి.. పట్టుదల.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మెరుగైన శిక్షణ.. ఉంటే చాలు ఎంతటి ఉన్నత శిఖరాలైన ఆధిరోహించవచ్చని నిరూపిస్తోందీ బాలిక. పాఠశాలలో నేర్చుకున్న ఎన్సీసీ శిక్షణ ద్వారానే సత్తా చాటుతోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తోంది. నగరంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న కె.శ్రియారెడ్డి షూటింగ్లో ప్రతిభ చూపుతోంది. గతేడాది నుంచి ఎన్సీసీలో శిక్షణ పొందిన బాలిక ఎన్సీసీ కేడెట్లకు గౌరవప్రదమైన రిపబ్లిక్ పరేడ్‌కు ఎంపికైంది. 45 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ పొందింది. ప్రతిభ చాటి 2019 జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రంనుంచి ఎంపికైంది. శ్రియారెడ్డి ప్రతిభను గమనించిన ఎన్సీసీ అధికారులు షూటింగ్లో శిక్షణ పొందితే బాగుంటుందని సూచించారు. దీంతో శ్రియా తల్లిదండ్రులు కొండపల్లి రవీందర్‌రెడ్డి, చైతన్యరెడ్డిలు హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో గల షూటింగ్ రేంజ్లో దాదాపు నాలుగు నెలలపాటు కె.శ్యామ్‌సుందర్ వద్ద శిక్షణ ఇప్పించారు. 30–50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌పొజిషన్‌లో శిక్షణ పొందిన శ్రియా అనతికాలంలోనే 50 మీటర్ల విభాగంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ మహిళల కేటగిరీ రైఫిల్ ప్రోన్‌పొజిషన్‌లో 518 పాయింట్లతో తృతీయస్థానం సాధించింది. రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం దక్కించుకుంది. దక్షిణ భారత రైఫిల్ షూటింగ్ పోటీలకు అర్హత సాధించింది. గత ఆగస్టు 23 నుంచి 30వ తేదీ వరకు జరిగిన 11వ సౌత్ జోన్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించింది. మెరుగైన ప్రతిభ చాటి ఐదో స్థానం దక్కించుకుంది. 50 రైఫిల్ ప్రోన్‌పొజిషన్‌లో మొదటిస్థానంలో నిలిచిన బాలిక 570 పాయింట్లు సాధించగా కొండపల్లి శ్రియారెడ్డి 563 పాయింట్లు కైవసం చేసుకుని ఐదో స్థానంలో నిలవడం విశేషం. శ్రియారెడ్డి సోదరుడు కూడా.. చెల్లి రైఫిల్ షూటింగ్లో సత్తా చాటుతుంటే అన్న కొండపల్లి నీరజ్‌రెడ్డి రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందేందుకు నిరంతరం సాధన చేస్తున్నాడు. ఓపెన్ జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 16నుంచి 23వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్‌లో జరిగే జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. నీరజ్‌రెడ్డి 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటా జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్లో సత్తా చాటి అంతర్జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. రాష్ట్రానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు కృషి చేస్తా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే జాతీయస్థాయిలో రాణిస్తున్నా. –కొండపల్లి శ్రియారెడ్డి -
అవగాహన లేకే రోడ్డు ప్రమాదాలు
పాత శ్రీకాకుళం : సరైన అవగాహన లేకుండా వాహనాలు నడపడం వల్లే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని శ్రీకాకుళం ఆర్టీఓ వి.శివరామకృష్ణ అన్నారు. మునసబుపేటలోని గురజాడ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఎన్సీసీ కేడెట్ల శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా గురువారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారి ప్రమాదాల్లో 40 శాతం పాదచారులు, 28 శాతం ద్విచక్ర వాహనచోదకులు చనిపోతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఎన్సీసీ కేడెట్లు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో శిబిరం కమాండెంట్ పి.రాజేంద్ర, ఎన్సీసీ అధికారులు, డిప్యూటీ కమాండెంట్ చంద్రుడు, కెప్టెన్లు మహేష్, మధు, సుబేదా తదితరులు పాల్గొన్నారు.