ఒడిశాలో 20న రెండో విడత ఎన్నికలు
5 లోక్‌సభ, 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
బీజేడీ, బీజేపీ హోరాహోరీ
ఒడిశాలో రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుండగా నాలుగింటికి 13న పోలింగ్ ముగిసింది. ఈ నెల 20న రెండో విడతలో ఐదు లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఐదు లోక్‌సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం విశేషం. ఆ పారీ్టకి గట్టి మద్దతున్న ఈ స్థానాల్లో అధికార బీజేడీ నుంచి సవాలు ఎదురవుతోంది...
బోలంగీర్
రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న స్థానమిది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, రాజ వంశీకురాలు సంగీతా సింగ్‌దేవ్ బరిలో ఉన్నారు. బీజేడీ గత అభ్యర్థి కల్కేశ్ నారాయణ్ సింగ్‌దేవ్ స్థానంలో సురేంద్ర సింగ్ భోయ్‌ని పోటీకి దింపింది. కాంగ్రెస్ నుంచి మనోజ్ మిశ్రా పోటీలో ఉన్నారు.
ఇక్కడ సంగీత నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కనకవర్ధన్ సింగ్‌దేవ్ పాటా్నగఢ్–బోలంగీర్ మహరాజు రాజ్‌రాజ్ సింగ్‌దేవ్ కుమారుడు. ఒడిశా బీజేపీ చీఫ్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. కరువు బాధిత జిల్లా అయిన బోలంగీర్ నుంచి ఏటా 30 వేల మందికి పైగా ఉపాధి కోసం వలస పోతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేడీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి.
సుందర్‌గఢ్
ఒడిశాలో కీలక లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీదే హవా. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ జుయల్ ఓరం మళ్లీ బరిలో ఉన్నారు. 1998 నుంచి ఇక్కడ ఆయన ఐదుసార్లు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో మాత్రం ఓరంపై కాంగ్రెస్ నేత హేమానంద బిశ్వాస్ విజయం సాధించారు. అధికార బీజేడీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు! రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నెగ్గని ఏకైక స్థానమిది. గత మూడుసార్లుగా అభ్యర్థులను మారుస్తున్నా ఫలితం దక్కడం లేదు.
ఈసారి భారత హాకీ జట్టు మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీని బీజేడీ మరోసారి బరిలో దింపింది. 2014లో ఆయన 18 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈ గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు, టిర్కీ ఆదరణ కలిసొచ్చి ఈసారి గట్టెక్కుతామని బీజేడీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ దెహూరీ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి. రెండింట బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం చెరో చోట గెలిచాయి.
కందమాల్
ఈ స్థానం బీజేడీ కంచుకోట. కందమాల్, బౌద్ జిల్లాలు మొత్తం దీని పరిధిలోకే వస్తాయి. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త అచ్యుతానంద సామంత బరిలో ఉన్నారు. బీజేపీ ప్రతిసారీ కొత్త అభ్యరి్థని నిలుపుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారి సుకాంత కుమార్ పాణిగ్రాహికి టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అమీర్‌చంద్ నాయక్ పోటీలో ఉన్నా పోటీ బీజేపీ, బీజేడీ మధ్యే ఉంది. సామంతకు విద్యా, దాతృత్వ కార్యక్రమాలు గట్టి దన్ను. కాగా తాగు, సాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తదితర అంశాలను పాణిగ్రాహి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేశారు.
బార్‌గఢ్
2008 నియోజకవర్గాల పునర్‌విభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో విజయం పారీ్టల చేతులు మారుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నేత సంయజ్ భోయ్ గెలవగా, 2014లో బీజేడీకి చెందిన డాక్టర్ ప్రవాస్ కుమార్ సింగ్ విజయం సాధించారు. 2019లో బీజేపీని విజయం వరించింది. బీజేడీ సీనియర్ నేత ప్రసన్న ఆచార్యను బీజేపీ నేత సురేశ్ పూజారి ఓడించారు. ఈసారి ఆయనకు బదులు ప్రదీప్ పురోహిత్‌కు బీజేపీ టికెటిచి్చంది. పూజారిని అసెంబ్లీ ఎన్నికల్లో మోహరించింది. బీజేడీ కూడా పరిణీత మిశ్రాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గళం వినిపించే ప్రదీప్‌కు స్థానికంగా మంచి పేరుంది. మోదీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.
అస్కా
బీజేడీకి కంచుకోట. సీఎం నవీన్ పటా్నయక్‌కు ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానం. ఆయన పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉంది. తండ్రి బిజూ పటా్నయక్ మరణానంతరం 1997 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అస్కా నుంచే నవీన్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998, 1999 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ ఏ అభ్యర్థినీ రెండోసారి నవీన్ కొనసాగించకపోవడం గమనార్హం.
బీజేడీ నుంచి 2019లో ప్రమీలా బిసోయ్ గెలిచారు. ఈసారి ఆమెను కాదని 33 ఏళ్ల రంజితా సాహుకు బీజేడీ టికెట్ దక్కింది. ఆమె వలస కారి్మకుల కోసం ‘కొడాల యూత్ ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. సామాన్యుల్లో ఆమెకున్న గుర్తింపు చూసే సీఎం టికెటిచ్చారు. బీజేపీ నుంచి మరోసారి అనితా శుభదర్శిని పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రామకృష్ణ పటా్నయక్ మాజీ మంత్రి. బిజూ, నవీన్ పట్నాయక్‌లకు అత్యంత సన్నిహితుడు. గంజాం జిల్లాలో ఆయనకు మంచి పేరుంది.
ముగ్గురిలో ఒకరిపై కేసు
ఒడిశాలో రెండో విడతలో పోలింగ్ జరిగే ఐదు లోక్‌సభ స్థానాల్లో 40 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 13 మంది కోటీశ్వరులే. సంగీతా కుమారి రూ.67.3 కోట్లతో జాబితాలో టాప్‌లో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 8 మంది తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 21 మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యావంతులని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment