లక్షల్లో డబ్బు పెట్టి అలుగులను కొంటున్న చైనా.. ఎందుకో తెలుసా? | Huge Demand For Pangolins In China Because Of Medical Use | Sakshi
Sakshi News home page

అడవి అలుగులకు చైనాలో భారీ డిమాండ్‌.. ఎందుకో తెలుసా?

Published Sat, Sep 24 2022 8:27 AM | Last Updated on Sat, Sep 24 2022 8:29 AM

Huge Demand For Pangolins In China Because Of Medical Use - Sakshi

బుట్టాయగూడెం: అడవికి రాజు సింహం... అది ఎంతటి జీవినైనా వేటాడి నమిలేస్తుందని నమ్ముతాం... కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి. అలుగు వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును కలిగి ఉంటాయి. ఇవి సింహం కూడా నమలలేనంత గట్టిగా ఉంటాయి. అటువంటి అరుదైన అడవి అలుగులు ఏలూరు జిల్లా పరిధిలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గల పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలిన్‌ అని కూడా పిలుస్తారు.

చైనీస్‌ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్‌ పాంగోలిన్‌ అని నాలుగు రకాల అలుగులు ఉంటాయి. వీటి మూతి ముంగిసను పోలి ఉంటుంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ అలుగు సుమారు 20 ఏళ్లు జీవిస్తుంది. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అడవి, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతోపాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి జీవనం సాగిస్తుంటాయి. తొలిసారిగా 1821లో ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్‌ లైఫ్‌ అధికారులు తెలిపారు. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకు సంచరిస్తున్నాయని వెల్లడించారు. 

అలికిడి అయితే బంతిలా ముడుచుకుపోతాయి..
అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలికిడి అయితే అవి బెదిరి కదలకుండా గట్టిగా బంతిలా ముడుచుకుని ఉండిపోతాయి. వీటికి ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుంది. ఇవి రెండేళ్లకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. కోతి మాదిరిగానే తన పిల్లలను వీపుపై ఎక్కించుకుని తిప్పుతూ పోషిస్తాయి. అలుగు పెంకులను చైనాలో మందుల తయారీకి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, ఒక్కో అలుగు రూ.20లక్షల వరకు ధర పలుకుతోందని చెప్పారు.   

వన్యప్రాణులను వేటాడితే  కఠిన శిక్షలు తప్పవు 
వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరైనా వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. పాపికొండల అభయారణ్య ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు.  
– జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement