papi kondalu
-
రాజమండ్రి చూసొద్దామా?
చారిత్రక నగరమైన రాజమండ్రి టూరిజం హబ్‌గా మారుతోంది. పవిత్ర గోదావరి తీరాన వెలసిన రాజమండ్రిలో రివర్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాజమండ్రి నగరంతోపాటు సమీపంలో గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుకలంక, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు, ఆకట్టుకునే మ్యూజియంలు, పురాతన కట్టడాలు, పాపికొండల టూరిజం వంటి సదుపాయలతో ఉన్న రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్ గా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో భాగమైన రాజమండ్రి, కాకినాడ, కోనసీమ, ఏజెన్సీలలో ఎన్నో అందమైన, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలచిన ప్రదేశాలు ఉన్నాయి. నదీతీరంలో వెలసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అద్భుతమైన అందాలకు చారిత్రక ఇతిహాసాలకు కొలువైన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పథకాలు సిద్దం చేసింది. రాజమండ్రి నగరం కేంద్రంగా రివర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా రాజమండ్రి నగరంలో గోదావరిపై 122 ఏళ్ల క్రితం నిర్మించిన హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేసి, టూరిజం స్పాట్ గా మార్చాలని భావిస్తోంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ వంతెనను వెడల్పు చేసి, వాకింగ్ ట్రాక్ తోపాటు, షాపింగ్ స్ట్రీట్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి నదిపై ఉన్న వంతెనను తీర్చిదిద్దితే దేశంలోనే పురాతనమైన గోదావరి వంతెన ప్రత్యేక గుర్తింపు పొందుతుంది రాష్ట్రంలో పాపికొండల టూరిజం ఇప్పటికే ఎంతో గుర్తింపు పొందింది. రాజమండ్రి నగరం కేంద్రంగానే పాపికొండల బోట్ల నిర్వహణ జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చే టూరిస్టులు రాజమండ్రికి వచ్చి,ఇక్కడినుంచి దేవీపట్నం వద్ద బోట్లు ఎక్కి పాపికొండల యాత్రకు వెళతారు. ఇపుడు యాత్రికులు బసచేయడానికి ఏర్పాట్లు చేయడం,అదే విధంగా స్థానికంగా రివర్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే హరిత, అర్ధర్ కాటన్ బోట్లుతోపాటు మరో పది ప్రైవేట్ బోట్లు పాపికొండలకు వెళ్లి వస్తున్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచి, మరికొన్ని బోట్లకు అనుమతివ్వడంతోపాటు పాపికొండల టూరిజాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరం వద్ద గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుక లంక పర్యాటకంగా అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తించారు. దాదాపు 57 ఎకరాలున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడానికి గతంలోనే ఎత్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో హోటల్ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఓబెరాయ్ గ్రూపు ఇక్కడ హోటల్స్, రిసార్టులు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలు ఏర్పడ్డాయి. రాజమండ్రి వచ్చే పర్యాటకులకు ఓవైపు ఆహ్లాదాన్నిచ్చే గోదావరిపై ఉన్న వంతెనలు, ఘాట్లు, వాటిలో ఉన్న పవిత్ర దేవాలయాలతోపాటు చారిత్రిక కట్టడాలు కూడా కనపడతాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి గోదావరి పై ధవళేశ్వరంలో కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట దానితోపాటు ఆయన పేరిట ఏర్పాటు చేసిన కాటన్ మ్యూజియం. రాజమండ్రికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండటంతో సుదూర ప్రాంతాలనుంచి సైతం పర్యాటకలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నగరంలోకి వచ్చే మార్గాన్ని సైతం ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దారు. రాజమండ్రికి సమీపంలోనే వాడపల్లి, ద్రాక్షారామ, అయినవిల్లి, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉండటం, రాజమండ్రి నగరంలో కూడా అనేక దేవాలయాలు, ఘాట్లు, ఉండటంతో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. -
లక్షల్లో డబ్బు పెట్టి అలుగులను కొంటున్న చైనా.. ఎందుకో తెలుసా?
బుట్టాయగూడెం: అడవికి రాజు సింహం... అది ఎంతటి జీవినైనా వేటాడి నమిలేస్తుందని నమ్ముతాం... కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి. అలుగు వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును కలిగి ఉంటాయి. ఇవి సింహం కూడా నమలలేనంత గట్టిగా ఉంటాయి. అటువంటి అరుదైన అడవి అలుగులు ఏలూరు జిల్లా పరిధిలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గల పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలిన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్ పాంగోలిన్ అని నాలుగు రకాల అలుగులు ఉంటాయి. వీటి మూతి ముంగిసను పోలి ఉంటుంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ అలుగు సుమారు 20 ఏళ్లు జీవిస్తుంది. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అడవి, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతోపాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి జీవనం సాగిస్తుంటాయి. తొలిసారిగా 1821లో ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకు సంచరిస్తున్నాయని వెల్లడించారు. అలికిడి అయితే బంతిలా ముడుచుకుపోతాయి.. అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలికిడి అయితే అవి బెదిరి కదలకుండా గట్టిగా బంతిలా ముడుచుకుని ఉండిపోతాయి. వీటికి ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుంది. ఇవి రెండేళ్లకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. కోతి మాదిరిగానే తన పిల్లలను వీపుపై ఎక్కించుకుని తిప్పుతూ పోషిస్తాయి. అలుగు పెంకులను చైనాలో మందుల తయారీకి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఒక్కో అలుగు రూ.20లక్షల వరకు ధర పలుకుతోందని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరైనా వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. పాపికొండల అభయారణ్య ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
మూలవిరాట్టు కన్నా ముందు మొక్కాల్సింది అక్కడే! నారేప ప్రత్యేకతే వేరు!
బుట్టాయగూడెం (పశ్చిమగోదావరి): దేవుడి దర్శనం కోసం భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి మొక్కుకున్నాకే గుడి లోపలకు వెళ్లి మూలవిరాట్టును దర్శించుకుంటారు. ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల తయారీకి ప్రకృతిలో ఎన్ని చెట్లు ఉన్నప్పటికీ అత్యధికంగా ఉపయోగిస్తున్నది మాత్రం నారేప చెట్టునే. ఈ చెట్టు బలంగా, ఎత్తుగా పెరగటమే కాకుండా కలప ఎన్నాళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడమే ఇందుకు కారణం. (చదవండి: నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలు షేర్ చేసినందుకు..) వీటి ప్రత్యేకతే వేరు.. దేవాలయాల ఎదుట ప్రతిష్టించే ధ్వజస్తంభం తయారీకి సోమి చెట్టు, టేకు, నారేప చెట్టుతో పాటు ఇంకొన్ని రకాల వృక్ష జాతులను కూడా వినియోగిస్తుంటారు. అయితే ఎక్కువగా వినియోగించేది మాత్రం నారేప చెట్లను, తర్వాత సోమి చెట్లనే. వృక్ష జాతుల్లో నారేపకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. నారేప చెట్ల కర్రలకు చెదలు పట్టవు. ఈ చెట్టు కర్రతో తయారుచేసిన ధ్వజస్తంభం దశాబ్దాల పాటు పటిష్టంగా ఉంటుంది. ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం నారేప సొంతం. నారేప వృక్షం 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చుట్టుకొలత 40 నుంచి 50 అంగుళాలు ఉంటుంది. ఈ చెట్లు దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. గోదావరి పరీవాహక అటవీ ప్రదేశాల్లో కూడా నారేప వృక్షాలు దర్శనమిస్తుంటాయి. పాపికొండల అభయారణ్యంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కనూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా నారేప చెట్లు ఉన్నాయి. అరుదైన నారేప వృక్షజాతిని కాపాడేందుకు పశ్చిమ మన్యంలోని ఏపీ అటవీ శాఖ అధికారులు నర్సరీల్లో నారేప మొక్కలను పెంచుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నారేప చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో నర్సరీల ద్వారా వీటి పెంపకాన్ని చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నర్సరీల్లో నారేప మొక్కల పెంపకం చదవండి 👉🏼ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! 👉🏼 జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’ -
కొండా.. కోనల్లో.. లోయల్లో..
‘అందని మిన్నే ఆనందం.. అందే మన్నే ఆనందం... అరె భూమిని చీల్చుకు పుట్టే పసిరిక ఆనందం.. మంచుకు ఎండే ఆనందం.. వాటికి వానే ఆనందం.. అరె ఎండకి వానకి రంగులు మార్చే ప్రకృతి ఆనందం..’ అని ఓ సినీకవి ప్రకృతి విశిష్టతను ఎంతో గొప్పగా వర్ణించారు. అలాంటి అందమైన అరకు ప్రాంతానికి ఏమాత్రం తక్కువ కాకుండా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి సొబగులతో కనువిందు చేస్తోంది. సాక్షి, బుట్టాయగూడెం: కొండా.. కోనా.. వాగు.. వంక.. ప్రకృతి రమణీయతతో కట్టిపడేస్తున్నాయి. తొలకరి జల్లుల తర్వాత కురిసే వర్షాలతో పచ్చని చీరను కప్పుకున్న అటవీ అందాలు మైమరపింపజేస్తున్నాయి. కొండవాగుల్లో జలపాతాలను తలపించే నీటి ప్రవాహాలు అబ్బురపరుస్తున్నాయి. బుట్టాయగూడెం మండలంలోని గోగుమిల్లి నుంచి గుబ్బల మంగమ్మ ఆలయం వరకు అటవీ ప్రాంతంలో ఎన్నెన్నో అందాలు. ప్రధానంగా పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వరకూ దట్టమైన అటవీ ప్రాంతంలో తారురోడ్డుపై ప్రయాణం వెన్నెల్లో హాయ్ హాయ్ అన్నట్టు సాగుతుంది. రోడ్డుకు రెండువైపులా పొడవైన చెట్లు, ఎతైన కొండల మధ్య ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. రెండు కొండల మధ్య నిర్మించిన జల్లేరు జలాశయం నిండు కుండలా కళకళలాడుతున్నప్పుడు చుట్టూ కొండలతో మరింత సుందరంగా కనిపిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండల నడుమ కోడెవాగు కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. జూలై తర్వాత కురిసే వర్షాలతో మోడు బారిన చెట్లు సైతం చిగురించి అడవి తల్లి సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఇలా పశ్చిమ ఏజెన్సీలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రయాణ సౌకర్యాలు బాగున్నాయి. ఈ ప్రాంతంలో పర్యాటకంపై అధికారులు దృష్టి సారిస్తే పశ్చిమ ఏజెన్సీలో అభివృద్ధి సవ్వడులు మార్మోగుతాయి. కొండల నడుమ కోడెవాగు కనువిందు పచ్చదనంతో నిండిన అటవీ ప్రాంతం పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వెళ్లే మార్గం బుట్టాయగూడెం మండలం ముంజులూరులో ఏనుగుల జలపాతం , గుబ్బల మంగమ్మతల్లి సన్నిధానంలో జలపాతం గుబ్బల మంగమ్మ గుడి వద్ద జలపాతం కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య నీటి సవ్వడి -
పాపికొండల సందర్శనకు బ్రేక్!
తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల సమయంలో అందమైన పాపికొండలను సందర్శించే అవకాశం దూరం కానుంది. పుష్కరాల సందర్భంగా పాపికొండల పర్యటనపై నిషేధం విధించి.. ప్రయాణానికి ఉపయోగించే బోట్లను 'ఫ్లోటింగ్ అంబులెన్సులు' గా మార్చనున్నట్టు బుధవారం జలవనరులశాఖ సూపరిండెంట్ ఇంజనీర్ సుగుణాకరరావు వెల్లడించారు. పుష్కరాల సమయంలో బోట్లకు అనుమతివ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 13 వరకూ పాపికొండల పర్యటనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. గోదావరిలో తిరిగే అన్ని బోట్లను ఘాట్లలో సిద్ధంగా ఉంచేందుకు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గోదావరిలో చేపల వేటను కూడా నిషేధించనున్నట్టు వివరించారు. వారు వేటకు ఉపయోగించే నాటు పడవలను ఘాట్లలో రక్షణకు ఉపయోగించనున్నట్టు చెప్పారు. ప్రత్యామ్నాయంగా వారి జీవనోపాధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, నిత్యావసరాలు పంపిణీ చేయనుందని వివరించారు. నాటు పడవల్లో గజ ఈతగాళ్లను నియమించి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. గోదావరి నదిలో నీటిమట్టం తగ్గకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.