తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల సమయంలో అందమైన పాపికొండలను సందర్శించే అవకాశం దూరం కానుంది. పుష్కరాల సందర్భంగా పాపికొండల పర్యటనపై నిషేధం విధించి.. ప్రయాణానికి ఉపయోగించే బోట్లను 'ఫ్లోటింగ్ అంబులెన్సులు' గా మార్చనున్నట్టు బుధవారం జలవనరులశాఖ సూపరిండెంట్ ఇంజనీర్ సుగుణాకరరావు వెల్లడించారు. పుష్కరాల సమయంలో బోట్లకు అనుమతివ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 13 వరకూ పాపికొండల పర్యటనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు.
గోదావరిలో తిరిగే అన్ని బోట్లను ఘాట్‌లలో సిద్ధంగా ఉంచేందుకు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గోదావరిలో చేపల వేటను కూడా నిషేధించనున్నట్టు వివరించారు. వారు వేటకు ఉపయోగించే నాటు పడవలను ఘాట్‌లలో రక్షణకు ఉపయోగించనున్నట్టు చెప్పారు. ప్రత్యామ్నాయంగా వారి జీవనోపాధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, నిత్యావసరాలు పంపిణీ చేయనుందని వివరించారు. నాటు పడవల్లో గజ ఈతగాళ్లను నియమించి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. గోదావరి నదిలో నీటిమట్టం తగ్గకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.