దసరా వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఆగమేఘాల మీద సొంతూర్లకు చేరిపోతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుంటారు. ఏమూలన ఉన్నా భారతీయులు అత్యంత ఉత్సాహంగా చేసుకునే ప్రముఖమైన పండుగ దసరా.
మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాల్లో జగన్మాతను ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
దసరా ఉత్సవాలు అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బెజవాడ, వరంగల్‌తో పాటు కోల్‌కతా, మైసూరు, ఢిల్లీ, కులు ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల సందడి ఉండనే ఉంటుంది. అందుకే కోరిన కోర్కెలను నెరవేర్చే జగన్మాతను దర్శనంతో తరించే పుణ్యక్షేత్రాలను చూద్దాం.
ఇంద్రకీలాద్రి
విజయవాడలోని ఇంద్ర కీలాద్రిఫై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. వివిధ రూపాల్లో అత్యంత మనోహరంగా అలంకరించే అమ్మవారిని దర్శించుకునేందుకు జనం క్యూ కడతారు. చివరి రోజు నిర్వహించే సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇంకా శ్రీశైలం, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు దసరా పదిరోజులూ ప్రత్యేక సందడి ఉంటుంది.
బతుకమ్మ
తెలంగాణాలో పూల పండగు బతుకమ్మ సంబరాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు గౌరీమాతను ఆరాధిస్తారు. బతుకమ్మ ఆటపాటలతో ఊరూ వాడా మార్మోగిపోతాయి. గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా ముస్తాబైన ఆడబిడ్డలు ఆడిపాడతారు. రోజొక్క తీరు తొమ్మిదిరోజుల పాటు గౌరమ్మకుమొక్కి చివరి రోజు గంగలో నిమజ్జనం చేస్తారు.
కోల్‌కతా దుర్గాపూజ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకలతో శరన్నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. . అమ్మవారు స్వయంగా ఇలకు దిగివస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పుట్టింటికి వచ్చి ఆడబిడ్డలా అపురూపంగా భావిస్తారు.సిలిగురి, జల్పైగురి, బీర్భూమ్ , బంకురా వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు చూడాలంటే రెండు కళ్లూ చాలవు.
మైసూర్ దసరా ఊరేగింపు
కర్ణాటక రాష్ట్రంలో నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. ముఖ్యంగా 500 ఏళ్ల చరిత్ర గల మైసూరు దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపా వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలు మాత్రమే కాదు, నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.
అహ్మదాబాద్
దుర్గాపూజతో పాటు రాముడు, రావణుడిపై సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని వైభవంగా దసరా నిర్వహిస్తారు. ప్రధానంగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , నవ్లాఖీ మైదానంలో వేడుకులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాండియా నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలు ఘనంగా ఉంటాయి ముగింపు రోజు భారీ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఇక్కడి ప్రత్యేకత.
ఢిల్లీ, వారణాసి
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్, ఎర్రకోట , సుభాష్ మైదాన్ వంటి ప్రదేశాల్లో దసరా వేడుకలు కన్నులపండువగా ఉంటాయి. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీ, వారణాసి నగరాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. రాంలీలా మైదానంలో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. వారణాసి నగరంలో చిన్నారులంతా పౌరాణిక పాత్రల వేషధారణలో అలరిస్తారు.
వైష్ణో దేవి ఆలయ ఉత్సవాలు
జమ్మూ కశ్మీర్ కత్రాలో ఉన్న వైష్ణో దేవి ఆలయంలో శరన్నవరాత్రులను చూసి తరించాల్సిందే. విద్యుద్దీప కాంతులతో సంబరాలు అంబరాన్నంటు తాయి. ఇక్కడ తొమ్మిదిరోజుల పాటు జగన్మాత ఆరాధనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.
హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ కులు పట్టణంలో అట్టహాసంగా జరుగుతాయి దసరా వేడుకలు. అయితే ఇక్కడ వేడుస దసరా రోజు మొదలై ఏడు రోజుల పాటూ సాగుతుంది.
రాజస్తాన్ : రాజస్థాన్‌లో రాజభవనంలో మొదలై, రాజకుటుంబ సభ్యులు జాతరగా మైదానానికి ఊరేగింపుగా తరలివస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలు దహనం చేసి బాణసంచా పేల్చుతారు.
బస్తర్ దసరా: ఛత్తీస్ గఢ్ లో నిర్వహించే దసరానే ఉత్సవాలనే బస్తర్ దసరాగా ప్రసిద్ధి చెందింది. బస్తర్‌లోని గిరిజన ప్రాంత రక్షణ దేవత దంతేశ్వరి దేవిని ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో రథాల ఉరేగింపు చూసి తీరాల్సిందే.
దేవభూమి, రఘునాధుని రథయాత్ర
హిమాచల్ ప్రదేశ్‌లో కులు దసరా వేడుకల గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం,అంతర్జాతీయ కులు దసరా అక్టోబర్ 13 నుండి 19 వరకుజరుగుతుంది. 7 రోజుల పండుగలో రథయాత్ర ప్రత్యేకం. మహాకుంభ్ పేరుతో నిర్వహించే రఘునాథుని రథయాత్ర వేలాది మంది భక్తులు తరలివస్తారు స్థానిక జానపద నృత్యాలతో పాటు వివిధ దేశాల సంస్కృతిని కూడా ప్రదర్శించేలా కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే అంతర్జాతీయ నృత్యోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 365 స్థానిక దేవతలు, దేవతలు కులులో నివసిస్తున్నారని భూమిని దేవభూమి అని పిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment