తెలుగువారికి పులిహోర లేనిదే ఏ పండుగ, వేడుక అయినా నిండుగా ఉండదు. అందులోనూ చింతపండుతో చేసి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఆహా అద్భుతం అంటూ ఆరగిస్తారు. ఇక దసరా నవరాత్రులలో అమ్మవారికి పులిహోర ఎంత ముఖ్యమైందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడిలో ప్రసాదమంత పవిత్రంగా, రుచికరంగా అద్భుతమైన పులిహోర తయారీ ఎలానో తెలుకుందాం పదండి!
కావాల్సిన పదార్థాలు :
బియ్యం పావుకేజీ, 100 గ్రా. చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,తాజాగా కరివేపాకు రెబ్బలు మూడు, నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు, అల్లం- చిన్నముక్క నాలుగు ఎండుమిర్చి , చిటికెడు ఇంగువ, కొద్దిగా బెల్లంపొడి, తాలింపు గింజలు, పల్లీలు లేదా జీడిపప్పు
తయారీ
ముందుగా బియ్యాన్ని(పాత బియ్యం అయితే బావుంటుంది) కడిగి, కాస్త పదునుగా అన్నాన్ని వండుకోవాలి. ఉడికేటపుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదు.
చింతపండు శుభ్రం చేసుకొని నీళ్లలో నానబెట్టుకోవాలి.
అన్నం ఉడికిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నపుడే రెండురెబ్బల కరివేపాకులు, పసుపు, ముందుగా నూరిపెట్టుకున్న ఆవాల ముద్ద కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపుకోవాలి. మెతుకు నలిగి పోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి.
నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు ఉడిరకించుకోవాలి. ఇందులోనే చిటికెడు, పసుపు, ఉప్పు, నాలుగు పచ్చిమిరపాయలు చీల్చి వేసుకోవాలి. పులుసులో ఉడికి కారం లేకుండా తినడానికి బావుంటాయి. ఇందులోనే రవ్వంత బెల్లం కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ పులుసును చల్లారిన అన్నంలో అన్నీ బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి.
ఇక చివరిగా కడాయిలో ఆయిల్ పోసి, ఆవాలు, ఎండు మిర్చి వేసి, తరువాత వేరు సెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించాలి. ఆ తరువాత కాస్తంత ఇంగువ వేయాలి. పోపు వేగి కమ్మటి వాసన వస్తున్నపుడు స్టవ్ మీదినుంచి దింపేయాలి.
దీన్ని పులుసు కలిపి ఉంచుకున్న అన్నంలో కలిపితే.. ఘుమ ఘుమలాడే పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టినంక , ఇంట్లోని వారందరూ తింటే ఆ రుచే వేరు!
Comments
Please login to add a commentAdd a comment