మార్గళి ప్రసాదం
మార్గశిర మాసాన్ని మనం ధనుర్మాసం అంటాం. తమిళులు మార్గళి అంటారు. వైష్ణవాలయాల్లో ఉదయపు పూజల్తో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెత్తుతుంది. తిరుప్పావై మార్మోగుతుంది. ప్రసాదాల గుబాళింపు భగవంతునికే కాక భక్తులకూ ప్రీతికరమౌతుంది.
విష్ణుమూర్తి అలంకార ప్రియుడు... వైష్ణవ ఆలయాలకు వెళితే చక్కెర పొంగలి, దద్ధ్యోదనం, పులిహోర, పరమాన్నం ప్రసాదంగా దక్కుతుంది. ధనుర్మాసం ఇంటింటా ప్రసాదాల పంట.ఉదయాన్నే చలిలో ఈ ప్రసాదాలు తయారుచేసి, భగవంతునికి నివేదన చేసి, స్వీకరించండి. పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతాయి.
కోయల్ పులిహోర
కావలసినవి: బియ్యం – పావు కేజీ; చింతపండు – నిమ్మకాయంత; పసుపు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను.
పొడి కోసం: నూనె – ఒక టీ స్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 6; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; మెంతులు – అర టీ స్పూను; మిరియాలు – ఒక టీ స్పూను, నువ్వులు – 2 టీ స్పూన్లు.
పోపు కోసం: నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు.
తయారీ:
►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి అన్నం ఉడికించి, పక్కన ఉంచాలి
►ఒక కప్పు నీటిలో చింత పండు నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, పొడి కోసం తీసుకున్న వస్తువులన్నీ (నువ్వులు మినహా) ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►చివరగా నువ్వులు జత చేసి మరోమారు వేయించి, దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాక, పచ్చి సెనగ పప్పు, పల్లీలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు జత చేసి కొద్దిసేపు వేయించాలి
►చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, ఇంగువ జత చేసి సుమారు ఐదు నిమిషాల సేపు ఉడికించాలి
►చిక్కబడ్డాక బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి
►పెద్ద పళ్లెంలో అన్నం వేసి చల్లారబెట్టాలి
►వేయించిన పోపు, పొడి మిశ్రమాన్ని అన్నానికి జత చేసి బాగా కలియబెట్టి, కొద్దిగా నువ్వుల నూనె వేసి మరోమారు కలపాలి
►దేవునికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి.
కోయల్ పొంగల్
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెసర పప్పు – అర కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు ; జీడిపప్పులు – 15; మిరియాలు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు.
తయారీ:
►స్టౌ మీద బాణలి వేడయ్యాక, పెసర పప్పు వేసి దోరగా వేయించి దింపేయాలి
►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి ∙ కుకర్లో పెసరపప్పు, బియ్యం, ఐదు కప్పుల నీళ్లు జత చేసి, మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చాక దింపి, మూత తీశాక, మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదపాలి. ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పులు వేసి వేయించాలి
►మిరియాలు జత చేయాలి
►ఇంగువ, కరివేపాకు, అల్లం తురుము వేసి బాగా వేయించాలి
►ఉడికించిన బియ్యం, పెసరపప్పు మిశ్రమం జత చేసి, తగినంత ఉప్పు వేసి కలిపి దించేయాలి కోయల్ పొంగల్ సిద్ధమైనట్లే.
అప్పాలు
కావలసినవి: బియ్యప్పిండి – ముప్పావు కప్పు; గోధుమ పిండి – పావు కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; నూనె – పావు కప్పు + డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ:
►ఒక పాత్రలో బియ్యప్పిండి, గోధుమ పిండి వేసి కలపాలి
►స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు కలుపుతూండాలి
►బియ్యప్పిండి గోధుమ పిండి మిశ్రమం జత చేస్తూ కలియబెట్టాలి
►ఉడుకుపడుతుండగా స్టౌ కట్టేయాలి
►పావు కప్పు నూనె జత చేసి గరిటెతో బాగా కలియబెట్టి, చల్లారబెట్టాలి
►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి
►పిండిని కొద్దిగా తీసుకుని, ఉండలా చేసి, నూనె పూసిన ప్లాస్టిక్ కవర్ మీద అప్పం మాదిరిగా ఒత్తాలి
►కాగిన నూనెలో వేసి రంగు మారేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి
►చల్లారాక దేవునికి నైవేద్యం పెట్టి తినాలి.
కోయల్ పాయసం
కావలసినవి: బియ్యం – ముప్పావు కప్పు; నెయ్యి – అర కప్పు + ఒక టేబుల్ స్పూను; నీళ్లు – 5 కప్పులు; ముదురు రంగులో ఉండే బెల్లం – రెండున్నర కప్పులు; పటిక బెల్లం – పావు కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – పావు టీ స్పూను.
తయారీ:
►బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేయాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక బియ్యాన్ని అందులో వేసి కొద్దిసేపు వేయించి దింపేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి (ఉడకటానికి సుమారు అరగంట సమయం పడుతుంది)
►స్టౌ మీద మరొక బాణలిలో నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించి, ఉడికించాలి
►అన్నానికి జత చేసి, స్టౌ మీద ఉంచి కొద్దిసేపు ఉడికించాలి
►బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి, శొంఠి పొడి జత చేసి కలియబెట్టాలి
►నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి
►వేయించిన కొబ్బరి ముక్కలు, పటికబెల్లం ముక్కలు జత చేసి కలియబెట్టి, నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి.
కోయల్ దద్ధ్యోదనం
కావలసినవి: సన్నని ముడి బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – తగినంత; పాలు – 4 కప్పులు; పెరుగు – ఒక టేబుల్ స్పూను.
పోపు కోసం: జీడిపప్పులు – గుప్పెడు; పచ్చి సెనగ పప్పు+మినప్పప్పు – 2 టీ స్పూన్లు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూను; మిరియాలు – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నువ్వుల నూనె – తగినంత; అలంకరించడానికి: పచ్చి మామిడి ముక్కలు – కొద్దిగా; కొత్తిమీర – కొద్దిగా.
తయారీ:
►బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు, ఉప్పు, నూనె జత చేసి ఉడికించి, దింపి, వేడిగా ఉండగానే గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి
►స్టౌ మీద పాలు ఉంచి, మరిగించి, కొద్దిగా చల్లారాక, అన్నంలో పోసి బాగా కలియబెట్టాలి
►కొద్దిగా పెరుగు జత చేసి మూత పెట్టి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాన్లను ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, దింపి, అన్నం మీద వేసి కలియబెట్టాలి
►మామిడి ముక్కలు, కొత్తిమీరతో అలంకరించాలి.