పులిహోర ప్రసాదం మరింత ప్రియం
అరసవల్లి : ఆదిత్యుని పులిహోర ప్రసాదం మరింత ప్రియం కానుంది. పేరుకు ధర పెంచకపోయినా పరిమాణం తగ్గించడం ద్వారా అధికారులు పరోక్షంగా భక్తులపై భారం మోపారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో విక్రయిస్తున్న ప్రసాదాల్లో పులిహోర ముఖ్యమైనది. భక్తులు ఎక్కువగా దీన్నే కొనుగోలు చేసి ప్రీతిపాత్రంగా స్వీకరిస్తుంటారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పులిహోర ప్యాకెట్ పరిమాణం కాస్త తగ్గించినట్లు ఆ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్‌చార్జి ఈవో ఆర్.పుష్పనాథం ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు 200 గ్రాముల ప్యాకెట్‌ను రూ.5కు విక్రయిస్తున్నారు. ఇక నుంచి అదే ధరకు 150 గ్రాముల పులిహోర మాత్రమే ఇస్తారు. సోమవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. ప్రసాదాల తయారీ, విక్రయాల్లో నష్టం వస్తుండటంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని పుష్పనాథం పేర్కొన్నారు.