
పాంగోలిన్ (ఆలువ)
అద్భుతమైన వృక్ష సంపద.. అరుదైన జంతువులకు మన అడవులు కేంద్రాలుగా మారుతున్నాయి. జిల్లాలోని నల్లమల, శేషాచలం, లంకమల, పెనుశిల అభయారణ్యాల్లో సుమారు 1000కి పైగా వివిధ రకాల జంతు జాతులు నివసిస్తున్నాయి. అధికారులు కూడా వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. దేశంలో గుర్తింపు పొందిన పాంగోలిన్ (ఆలువ), హానిబడ్గర్ లాంటి అరుదైన జంతువులు కూడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాలకు ఇటీవల దొరికాయి.
సాక్షి కడప : ప్రపంచంలోనే అరుదైన అటవీ ప్రాంతం కడప సొంతం. ఎక్కడా లభించని ఎర్రచందనం కూ డా మన అడవుల్లోనే దొరుకుతుంది. ఇంతటి ప్రత్యేకత గల జిల్లా అడవు ల్లో పెద్ద పులులతోపాటు చిరుతలు, ఇతర అరుదైన జంతువులు కూడా కనిపిస్తున్నాయి. వీటితోపాటు పాంగోలిన్, హానీబడ్గర్ లాంటి జంతువులు కెమెరాకు చిక్కాయి. జిల్లాలో ఫారెస్టుకు సంబంధించి మూడు డివిజన్లు ఉండగా.. సుమారు 50కి పైగా కెమెరాలను అమర్చారు. అడవిలోని చెట్లకు, ఇతర నీటి కొలనులు ఉన్న ప్రాంతాల్లో వీటినిబిగించారు. అడవి జంతువులు అటువైపుగా వచ్చినపుడు కెమెరాల్లో దొరుకుతున్నాయి.
అడవిలో పిల్లలతో ఎలుగుబంటి
1000 రకాలకు పైగా జంతువులు
జిల్లాలో సుమారు 4.31 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఇందులో అనేక రకాలైనటువంటి జంతువులు నివసిస్తున్నాయి. పులి, చిరుతలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, దుప్పిలు, కుందేళ్లు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, కోతులు, జింకలు, కొండగొర్రెలు, రొచ్చు కుక్కలు, నక్కలు, తోడేలు, అడవి దున్నలు, కుందేళ్లు, నెమళ్లు, కంతులు లాంటి జంతువులు నిత్యం అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. సుమారు 1000రకాలకు పైగా జంతువులు నివసిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జంతువుల గణనలో భాగంగా జిల్లాలో 2018 జనవరి 22వ తేదీనుంచి 28వ తేదీవరకు చేపట్టారు. అధికారులు అడవినంతా కలియతిరిగి లెక్కలు కట్టగా వేలాది రకాల జంతవులు ఉన్నట్లు గుర్తించారు. అరుదైన జంతువులకు మన అడవులు వేదిక అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నీటి కొలను వద్ద రొచ్చు కుక్కలు
వన్య ప్రాణులను వేటాడొద్దు – డీఎఫ్‌ఓ
జాతీయ సంపదగా భావించే అడవులు, అక్కడ నివసించే జంతువులను కాపాడుకోవాలని..అలా కాకుండా వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్ హెచ్చరించారు. అడవి జంతువులు, జింకలు, ఇతర వన్యప్రాణులు రైతుల పొలాల్లోకి వచ్చి నష్టపరుస్తున్నాయని...కరెంటు, ఇతర ఆయుధాల ద్వారా చంపడం నేరమన్నారు. ఎక్కడైనా రైతులకు జంతువుల ద్వారా నష్టం జరిగినట్లు తమ సిబ్బంది దృష్టికి తీసుకు వస్తే పొలాన్ని పరిశీలించి వ్యవసాయాధికారుల ద్వారా పంట నష్టానికి సంబంధించిన పరిహారం వచ్చేలా కృషి చేస్తామని వివరించారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని....వన్య ప్రాణులను స్వేచ్ఛగా అడవిలో సంచరించేలా సహకరించాలే తప్ప ప్రాణహాని కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment