bhupalapally
-
కొనసాగుతున్న గాలింపు చర్యలు.. మరో మహిళ మృతదేహం లభ్యం
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో నాలుగు రోజుల క్రితం వరద ఉధృతిలో కొట్టుకుపోయిన వారిలో ఇప్పటివరకు ముగ్గురి ఆచూకీ లభించింది. కాగా, మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. మొత్తం నలుగురికి గాను రెండు మృతదేహాలు శనివారం లభించగా...మరో మహిళ మృతదేహం ఆదివారం రాత్రి భూపాలపల్లి మండలం నేరేడుపల్లి సమీప చిర్రవంట చెరువువద్ద కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాంనర్సింహారెడ్డి అక్కడికి చేరుకుని ఆయా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా ఆమెను గొర్రె వజ్రమ్మగా గుర్తించారు. కాగా, వజ్రమ్మతోపాటు కొట్టుకుపోయిన గడ్డం మహాలక్ష్మి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె కోసం జిల్లాలోని మోరంచవాగు, మానేరువాగు పరీవాహక ప్రాంతాలతోపాటు భూపాలపల్లి, చిట్యాల, మల్హర్ మండలాల పోలీసులు డ్రోన్ల ద్వారా సమీప గ్రామాల్లోని ప్రజలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
'నాటు నాటు' పాట అలా పుట్టింది... వెల్లడించిన చంద్రబోస్
చిట్యాల: చల్లగరిగలో చిన్నప్పుడు నేర్చుకున్న పదాలతోనే ‘నాటు నాటు’పాట పుట్టింది.. దీంతో ఊరికే ఆస్కార్ అవార్డు దక్కిందని.. సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాసిన ‘నాటు నాటు’పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు స్వీకరించిన అనంతరం సొంత ఊరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు ఆదివారం వచ్చిన చంద్రబోస్ దంపతులు.. స్థానిక శివాలయంలో పూజలు చేశారు. ఇంటినుంచి పాఠశాల వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. చంద్రబోస్ చదివిన పాఠశాల 1969–2022 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ గ్రంథాలయం నుంచే తనకు అక్షర బీజం పడిందని.. ఇప్పడు శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పారు. గ్రామస్తులతో చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
పొలిటికల్ కారిడర్ 17January 2022
-
బలిదానాలు మీ కోసమేనా?
భూపాలపల్లి: ‘‘కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి.. కేటీఆర్, హరీశ్‌రావు మంత్రులు, ఎంపీగా ఓడిపోయిన కవిత ఎమ్మెల్సీ, సంతోష్ రాజ్యసభ సభ్యుడి పదవి అనుభవిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసింది మీ కుటుంబం కోసమేనా..? అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు నేటికీ దుఃఖిస్తూనే ఉన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో మీరు చేసిందేముంది?’’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏఐఎఫ్బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. నక్సల్స్ ఎజెండాయే తమ ఎజెండా అని చెప్పిన సీఎం కేసీఆర్.. ఎన్నో ఎన్కౌంటర్లు చేయించి విప్లవకారుల రక్తం నేలచిందించాడని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారందరూ పదవులు అనుభవించాలని నక్సల్స్ ఎజెండాలో ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని, ఎందరో అమరుల త్యాగం ప్రత్యేక రాష్ట్రమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఉన్న అప్పటి ఎంపీ విజయశాంతి సైతం ఇప్పుడు కేసీఆర్ వెంట లేదని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని, జాతీయస్థాయిలో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా.. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేర్చడానికి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిని నిర్బంధిస్తున్నారని, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లడం ఖాయమని రేవంత్ పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు సింగరేణి కార్మికులు దసరా, దీపావళి పండుగలను పక్కనపెట్టి మరీ సకల జనుల సమ్మెలో పాల్గొంటే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ వారి హక్కులను కాలరాస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓపెన్‌కాస్టుల పేరిట ఈ ప్రాంత భూములను బొందలగడ్డలుగా మారుస్తున్నారని.. ఇక్కడి భూమి, నీరు, జీవితాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు గులాబీ పార్టీని బొందపెట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ సభలో మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సీతక్క, శాసనమండలి ప్రతిపక్ష నేత జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీగౌడ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
మన్యంలో అలజడి!
సాక్షి, భూపాలపల్లి : ప్రశాంతంగా ఉన్న అడవుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పెద్దంపేట అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అటవీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే అంబట్పల్లి పోలీస్‌స్టేషన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇక ఎదురుకాల్పుల ఘటనలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరు ముఖ్యనేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తప్పించుకున్న ముఖ్య నాయకులు! కొంతకాలంగా జిల్లాలో మావోల కదలికలు పెరిగాయని రెండ్రోజుల క్రితం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు పలిమెల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈక్రమంలోనే మావోలు తప్పించుకుని పారి పోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం తప్పించుకున్న మావోలు మహాముత్తారం మీదుగా ములుగు అటవీప్రాంతంలోకి లేకపోతే గోదావరి తీరం దాటి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తప్పించుకున్న వారిలో జయశంకర్–మహబూబాబాద్–వరంగల్–పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డితో పాటు ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరి యా సెక్రటరీ రీనా, ఇల్లందు–నర్సంపేట ఏరి యా సెక్రటరీ భద్రు, జమున, భూపాలపల్లి జిల్లాకు చెందిన భిక్షపతి తదితరులున్నారని గుర్తించినట్లు సమాచారం. తప్పించుకుపోయిన వీరి కోసం మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల, భూపాలపల్లి అటవీ ప్రాం తాలతో పాటు ములుగు జిల్లా అటవీ ప్రాం తాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 13 పోలీసు బృందాలతో పాటు రెండు గ్రేహౌండ్స్ బృందాలూ రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి, ఇంద్రావతి నదుల సరిహద్దుల్లో నిఘా పెంచారు. అటవీ ప్రాంతా న్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. -
ఇళ్లపై పడుతున్న ఓసీపీ బండరాళ్లు
సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీలో బాంబుల మోతలకు కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు–2లో జరుగుతున్న బొగ్గు, మట్టి వెలికితీత పనుల్లో భాగంగా చేపడుతున్న బాంబు బ్లాస్టింగ్లతో మంగళవారం బండరాళ్లు వచ్చి సమీప కాలనీల్లోని ఇళ్లపై పడినాయి. ఓసీపీ–2 సమీపంలోని గాంధీనగర్ కాలనీలోని చిక్కుల దేవేందర్ ఇంటిపై సుమారు 5 కిలోల బరువు గల బండరాయి పడడంతో పై కప్పు రేకులు పగిలిపోయాయి. అయితే ఆ సమయంలో దేవేందర్ భార్య ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ బండరాయి ఆమె మీద పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిబంధనలు గాలికి కాలనీలకు 500 మీటర్ల దూరంలో ఓసీపీలో బాంబు బ్లాస్టింగ్ పనులు చేపట్టాలని నేషనల్ గ్రీన్ట్రిబ్యూనల్ సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కేవలం వంద మీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్లు చేపట్టడం వలన ఇలా బండరాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పేలుళ్ల శబ్దంతో గోడలు పగుళ్లు బారుతున్నాయని వాపోయారు. బ్లాస్టింగ్ చప్పుళ్లతో బెంబేలెత్తుతున్న జనం ప్రతి రోజు రెండు సార్లు బాంబుబ్లాస్టింగ్ చేయడం వలన ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని జంగేడు, పక్కీరుగడ్డ, ఆకుదారివాడ, సుభాష్‌కాలనీ, గాంధినగర్, శాంతినగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక సామర్థ్యం గల బాంబులను వినియోగించడం వలన ఇళ్లు కదులుతున్నాయని బాధితులు గోడును వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఓసీపీ–1లో చేపట్టిన బ్లాస్టింగ్ వలన గడ్డిగానిపల్లి గ్రామంలోని ఇళ్లపైన బండరాళ్లు పడిన సందర్భాలు ఉన్నాయి. అయిన్నప్పటికీ ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
రైతు కూలీగా మారిన జిల్లా కలెక్టర్
సాక్షి, భూపాలపల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడు బిజీగా ఉండే అధికారి రైతు కూలీగా మారి పొలంలో వరినాట్లు వేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఆ అధికారి పేరు వాసం వెంకటేశ్వర్లు. ఈయన భూపాలపల్లి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల సమస్యలే ఎజెండాగా తీసుకొని వాటిని పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. భూ పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపించారు. తాజాగా జిల్లాలోని ఘనపురం మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం వెళుతున్న క్రమంలో దారి మధ్యలో రైతు కూలీగా మారి పొలంలో నాట్లు వేశారు. ఒక జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఎలాంటి బేషజాలకు పోకుండా మాతో కలిసి వరినాట్లు వేయడం తమకెంతో ఆనందం కలిగించదని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
గుంతను తప్పించబోయి..
సాక్షి, కాళేశ్వరం(వరంగల్) : గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులోని ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్, కండక్టర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జల్లా మహదేవపూర్ మండలం అన్నారం డేంజర్ క్రాసు వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సాయంత్రం హన్మకొండ నుంచి కాళేశ్వరం వస్తుంది. మహదేవపూర్ మండలం అన్నారం డేంజర్ క్రాసు వద్ద బస్సు డ్రైవర్ గుంతను తప్పించబోయాడు. కాళేశ్వరం నుంచి వస్తున్న లారీ డ్రైవర్ బస్సు అతివేగంగా రావడాన్ని గమనించి వేగాన్ని అదుపు చేసుకుని రోడ్డు దిగాడు. ఆర్టీసీ బస్సు స్పీడుతో వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీటులో కూర్చున్న గణపురం మండలం చెల్పూర్‌కు చెందిన పానగంటి సమ్మయ్య (50) మృతిచెందాడు. క్షతగాత్రులు వీరే.. బస్సు డ్రైవర్ మామిడిశెట్టి సతీష్‌కుమార్, కండక్టర్ శోభారాణి, కాటారం మండలం గూడూరుకు చెందిన వెన్నపురెడ్డి వసంత, కాళేశ్వరంకు చెందిన ఇషాక్, ఇస్మాయిల్, మహదేవపూర్‌కు చెందిన కేదారి ప్రవీణ్‌కుమార్, రేగొండకు చెందిన సాంబశివరావు, నర్సంపేటకు చెందిన గడ్డం సమ్మయ్య, చెల్పూర్‌కు చెందిన కౌసల్య, జీ సమ్మిరెడ్డి, సుద్దాల కొమురయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు మరో 20 మంది వరకు బస్సులో ఉన్నారు. వారిని మహదేవపూర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన డీఎం, ఎస్సై మహదేవపూర్ ఎస్సై సత్యనారాయణ, భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీధర్మా పరిస్థితిని సమీక్షించారు. దీంతో అన్నారం క్రాసురోడ్డు వద్ద మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. రెండు గంటల పాటు ఇరువైపులా వాహనాలు వెళ్లలేదు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రమాదానికి గురైన వాహనాలను ప్రొక్లైయిన్ల సహాయంతో తొలగించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. దైవ దర్శనానికి వెళ్తూ.. గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పానగంటి సమ్మయ్య (50), కొమురమ్మ దంపతులు కాళేశ్వరం దైవ దర్శనానికి వెళ్తున్నారు. బస్సు ముందు సీటులో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు అద్దం పగిలి అందులో సమ్మయ్య ఇరుక్కున్నాడు. గంట పాటు విలవిల కొట్టుకున్నాడు. ఆతరువాత పోలీసులు వచ్చి బయటికి తీసి ఆసుపత్రికి తరలించే లోపే సమ్మయ్య మృతిచెందాడు. -
టెన్షన్.. టెన్షన్
సాక్షి, భూపాలపల్లి : మరో నాలుగు రోజుల్లో పరిషత్ అభ్యర్థుల భవితవ్యం బాహ్య ప్రంచానికికి తెలియనుంది. జూన్ 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించనున్నారు. దీంతో అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల కాస్త గుబులుగానే ఉన్నారు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే పరిస్థితేంటి అనే రందిలో ఉన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగడం కూడా అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణానికి మరో కారణంగా చెప్పవచ్చు. స్థానికంగా ప్రాధాన్యం ఉన్న ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా స్థానికు వైపే మొగ్గు చూపారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీల కంటే లోకల్‌గా మంచి పేరున్న వ్యక్తికే ఓట్లు వేశారు. ప్రస్తుతం ఈ పరిణామాలే ప్రాధాన పార్టీల అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. బయటకు ధీమాగా.. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పరిషత్ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోప ఒకింత గుబులుగా ఉన్నారు. కార్యకర్తలు గెలుపు మనదే అని అంటున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం ఫలితాలు వెలువడే వరకు టెన్షన్ వాతావరణంలో కాలం గడపనున్నారు. కొన్ని ముఖ్యమైన స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ బ్యాలెట్ తెరిస్తే తప్ప వారి భవితవ్యాన్ని అంచనా వేయలేకపోతున్నారు. మరికొన్ని ప్రాదేశిక స్థానాల్లో స్వతంత్రులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలే టికెట్ రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ముఖ్యంగా ఎంపీటీసీ స్థానాల్లో తీవ్ర పోటీ ఉంది. ఎక్కువ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. పార్టీలను చూసి జెడ్పీటీసీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలు ఎంపీటీసీకి వచ్చే వరకు స్థానికంగా అందుబాటుతో ఉండే అభ్యర్థి వైపు సానుకూలంగా వ్యవహరించారు. పోటీ అధికంగా ఉన్న స్థానాల్లో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ స్థానాల్లో గెలుపోటములపై ఇటు అభ్యర్థులు, అటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. లెక్కలేసుకుంటున్న ఆశావహులు మండల అధ్యక్ష పదవి చేపట్టేందుకు ప్రతీ పార్టీలో ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పలు పార్టీలు జెడ్పీ చైర్మన్ ఎంపికకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనే స్పష్టత ఉన్నప్పటికీ ఎంపీపీల విషయంలో ఆ క్లారిటీ ఏ పార్టీలో కూడా లేదు. దీంతో కౌంటింగ్‌కు ముందే ఆశావహులు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంత మంది తమకు మద్దతు పలికే అవకాశం ఉంది. వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలా మెప్పించాలనే వ్యూహాల్లో ఎంపీపీ ఆశావహలు ఉన్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో ఆ మెత్తాన్ని ఇస్తాం.. మాకే మద్దతు ఇవ్వాలనే విధంగా ప్రలోభాలు చేసేందుకు ఆశావహులు వెనుకాడడం లేదు. అయితే కౌంటింగ్ అనంతరమే అసలు కథ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు ఎంపీపీ ఎన్నికకు మధ్య రెండు రోజులు సమయం ఉంది. ఈ సమయంలోనే ఆశావహులు ఎంపీటీసీల మద్దతు సంపాదించేందుకు కసరత్తు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో పరిషత్ స్థానాల వివరాలు ఎంపీటీసీ స్థానాలు – 106 పోటీలో ఉన్న అభ్యర్థులు – 325 మంది జెడ్పీటీసీ స్థానాలు – 11 పోటీచేసిన అభ్యర్థులు – 52 మంది -
ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
సాక్షి, భూపాలపల్లి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నిలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో ఎన్నికల నిర్వహణపై వివరించారు. అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి వివరించామని చెప్పారు. జిల్లాలోని ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులు నవంబర్ 12 నుంచి నామినేషన్ల దాఖలు, 19 నాటికి చివరి తేదీ, 20 నామినేషన్ల పరిశీలన, 22 ఉపసంహరణ గడువు, డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాల వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్థనా నియమావళికి లోబడే రాజకీయ పార్టీలు వ్యవహరించాలని కోరారు. పలు టీంల ఏర్పాటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ములుగు నియోజకవర్గ పరిధి 9 మండలాలు, భూపాలపల్లి పరిధి 7 మండలాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 3 స్టాటిక్ సర్వే టీంలు ఉంటాయని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని, స్టాటిక్ సర్వే టీంలు వాహన తనిఖీలు చేస్తూ మద్య, డబ్బు సరఫరాను అరికట్టేందుకు పనిచేస్తాయన్నారు. ఈ బృందాల్లో పోలీస్ అధికారులతోపాటు, ఎక్సైజ్, అటవీ అధికారులు ఉంటారని తెలిపారు. సభలు, సమావేశాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడకుండా కట్టడి చేయడానికి వీడియో సర్వే లైన్స్ టీం ద్వారా సంబంధిత క్లిపింగులు తెప్పించుకుని పరిశీలిస్తామన్నారు. 48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలి రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయాలనుకుంటే 48 గంటల ముందుగానే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఆఫ్లై చేసుకోవచ్చని, ఇందుకు సువిధ యాప్‌ను వినియోగించుకోవచ్చని, అలాగే మాన్యువల్‌గానూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలులేదని, ఖర్చు చేసే ప్రతి పైసకు లెక్కచెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. నవంబర్ 12వ తేదీకి ముందే అభ్యర్థులు బ్యాంకుల్లో ఎకౌంట్ తీసి దానినుంచే ఎన్నికలకు సంబంధించిన ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల ప్రచారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుం దని, 10 తర్వాత ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలో 70 సమస్యత్మాక, 26 అతి సమస్యాత్మక, 151 నక్సల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో 130 పోలింగ్ కేంద్రాలు, అతి సమస్యత్మాక ప్రాంతాల్లో 66 పోలింగ్ స్టేషన్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 174 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. నవంబర్ 10 వరకు ఓటు నమోదు.. తుది ఓటరు జాబితాలో ఓటు రాని వారుంటే నవంబర్ 10వ తేదీ వరకు నమోదు చేసుకునే వీలుందని కలెక్టర్ తెలిపారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు వస్తాయని, ఈ సారి యువ ఓటర్ల సంఖ్య పెరిగిందని చెప్పారు. సమావేశంలో జేసీ కె.స్వర్ణలత, భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చల్లూరి సమ్మయ్య, రఘుపతిరావు, సాంబమూర్తి, చాడ రఘునాథరెడ్డి, వెన్నంపెల్లి పాపయ్య, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల విధులకు గైర్హాజర్ కావొద్దు ఎన్నికల నిబంధనల అమలుకోసమే వివిధ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల నిర్వహణకు చేసిన ఫ్లైయింగ్స్క్వాడ్, మోడల్‌కోడ్ ఆఫ్ కండర్డ్ స్టాటిక్ సర్వెలెన్స్ టీం, వీడియో వీటింగ్, వీడియో సర్వినిలెన్స్ టీం, అసిస్టెంట్ అకౌంటింగ్ టీంలతో సింగరేణి క్లబ్‌హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను పార్టీలు, అభ్యర్థులు ఉల్లంఘించకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో కేటాయించిన ఉద్యోగులు నిబంధనల మేరకు నోడల్ అధికారి, రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలను పాటించాలని, విధులకు గైర్హాజరైతే చర్చలు తప్పవని హెచ్చరించారు. -
కారడవిలో కార్చిచ్చు..
భూపాలపల్లి : కాళేశ్వరం–మహదేవపూర్ ప్రధాన రహదారిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు ఆరడం లేదు. గురువారం కుదరుపల్లి అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. విలువైన వన సంపద, అడవిలోని జీవరాశులు అగ్నికి ఆహుతవుతున్నాయి. -
పురుగులమందు తాగిన ప్రేమికులు
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం రాత్రి ప్రేమజంట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హన్మకొండ హంటర్ రోడ్డుకు చెందిన మేరుగు హరిప్రియ, పెండ్యాల సాయికుమార్ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వీరు ఆత్మహత్యాయత్నం చేయగా.. హరిప్రియ మృతి చెందింది. సాయికుమార్‌ను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలా ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
బ్రిడ్జిపై నుంచి కిందపడిన టిప్పర్... క్లీనర్ మృతి
సాక్షి, భూపాలపల్లి: ప్రమాదవశాత్తూ బొగ్గు టిప్పర్ బ్రిడ్జిపై నుంచి కింద పడడంతో క్లీనర్ మృతిచెందాడు. భూపాలపల్లి- కాళేశ్వరం ప్రధాన రహదారిలో బొగ్గులవాగుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి టిప్పర్ బోల్తా కొట్టింది. దీంతో టిప్పర్ క్లీనర్ ధనం గోపీ(24) అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుప్పుల వేట కేసులో మరో ఇద్దరు అరెస్టు
భూపాలపల్లి(ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవపూర్ దుప్పుల వేట ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పరిసరాల్లో అజ్ఞాతంలో ఉన్న ఏ4 నిందితుడు అక్బర్‌ఖాన్, హంటర్ మున్నాలను సీఐ చంద్రభాను నేతృత్వంలో పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మార్చి 19వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనలో పాల్గొన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు కాళేశ్వరం చాకిగుంట వద్ద ఉండగా పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. -
కోల్‌బెల్ట్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి పర్యటించారు. కార్మికుల సమస్యలపై కెటికె 5 ఇంక్లైన్లో ఆయన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో భారతీయ జనత పార్టీ ముందుంటుందని చెప్పారు. కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని, వారసత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ విధానం లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు పార్టీ నేతలు కూడా ఉన్నారు. -
కేటీకే 2వ గనిని సందర్శించిన మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ
కోల్‌బెల్ట్ : భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2వ గనిని గురువారం మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ సందర్శించింది. కమిటీ కన్వీనర్, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, కమిటీ సభ్యులను గని అధికారులు, కార్మికులు సాదరంగా ఆహ్వానం పలికారు. గని ఆవరణలో జరిగిన కార్యక్రమానికి గని మేనేజర్ వెంకటేశ్వర్రావు అధ్యక్షత వహించారు. కమిటీ సభ్యులు సయ్యద్ హబీబీŠ హుస్సేన్, కిశోర్‌గంగా, ఎం.అప్పారావు, కేవీ కిషన్‌రావు, రేవు సీతారాం, బి.రవీందర్, యూటీ.రావు రక్షణతో కూడిన ఉత్పత్తి –ఉత్పాదకత, యంత్రాల వినియోగం, నాణ్య త, రక్షణ, ఉత్పత్తి ఖర్చు, లాభనష్టాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంస్థ లక్ష్య సాధన తదితర అం శాలపై స్లైడ్ల ద్వారా కార్మికులకు అవగాహన కల్పించారు. కాగా, సింగరేణి సంస్థ నిరే్ధశించిన లక్ష్యా న్ని అధిగమించటం ద్వారా సంస్థ మనుగడ సాధిస్తుందని, బొగ్గు మార్కెట్లో నెలకొన్న పోటీతత్వాన్ని అధిగమించేందుకు నాణ్యత కలిగిన బొగ్గు సరఫరా చేయాల్సి ఉందని కన్వీనర్ పాలకుర్తి సత్తయ్య అన్నారు. సింగరేణిలోని 26 భూగర్భగనుల్లో భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2వ గని మాత్రమే లాభాల్లో పయనిస్తుందని, అదే స్ఫూర్తి కొనసాగించాలని కార్మికులను ఆయన కోరారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవటంతోపాటు అన్ని విధాలా పొ దుపు చర్యలు చేపట్టాలని సూచించారు. సంస్థలను కాపాడుకోవాలంటే రానున్న రోజుల్లో లక్ష్యాన్ని అధిగమించటం ఒక్కటే మార్గమని అన్నారు. గని వెల్ఫేర్ ఆఫీసర్ మహ్మద్ మదార్ సాహెబ్ పాల్గొన్నారు.