గుంతను తప్పించబోయి.. | RTC Bus Hit The Lorry In Mahadevpur, Bhupalpally | Sakshi
Sakshi News home page

గుంతను తప్పించబోయి..

Published Sat, Jul 27 2019 11:19 AM | Last Updated on Sat, Jul 27 2019 11:19 AM

RTC Bus Hit The Lorry In Mahadevpur, Bhupalpally - Sakshi

సాక్షి, కాళేశ్వరం(వరంగల్‌) : గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులోని ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్, కండక్టర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జల్లా మహదేవపూర్‌ మండలం అన్నారం డేంజర్‌ క్రాసు వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుది. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం 

భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సాయంత్రం హన్మకొండ నుంచి కాళేశ్వరం వస్తుంది. మహదేవపూర్‌ మండలం అన్నారం డేంజర్‌ క్రాసు వద్ద బస్సు డ్రైవర్‌ గుంతను తప్పించబోయాడు. కాళేశ్వరం నుంచి వస్తున్న లారీ డ్రైవర్‌ బస్సు అతివేగంగా రావడాన్ని గమనించి వేగాన్ని అదుపు చేసుకుని రోడ్డు దిగాడు. ఆర్టీసీ బస్సు స్పీడుతో వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీటులో కూర్చున్న గణపురం మండలం చెల్పూర్‌కు చెందిన పానగంటి సమ్మయ్య (50) మృతిచెందాడు. 

క్షతగాత్రులు వీరే..
బస్సు డ్రైవర్‌ మామిడిశెట్టి సతీష్‌కుమార్, కండక్టర్‌ శోభారాణి, కాటారం మండలం గూడూరుకు చెందిన వెన్నపురెడ్డి వసంత, కాళేశ్వరంకు చెందిన ఇషాక్, ఇస్మాయిల్, మహదేవపూర్‌కు చెందిన కేదారి ప్రవీణ్‌కుమార్, రేగొండకు చెందిన సాంబశివరావు, నర్సంపేటకు చెందిన గడ్డం సమ్మయ్య, చెల్పూర్‌కు చెందిన కౌసల్య, జీ సమ్మిరెడ్డి, సుద్దాల కొమురయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు మరో 20 మంది వరకు బస్సులో ఉన్నారు. వారిని మహదేవపూర్‌ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. 

పరిస్థితిని సమీక్షించిన డీఎం, ఎస్సై
మహదేవపూర్‌ ఎస్సై సత్యనారాయణ, భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మా పరిస్థితిని సమీక్షించారు. దీంతో అన్నారం క్రాసురోడ్డు వద్ద మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం అయింది. రెండు గంటల పాటు ఇరువైపులా వాహనాలు వెళ్లలేదు. పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి ప్రమాదానికి గురైన వాహనాలను ప్రొక్‌లైయిన్ల సహాయంతో తొలగించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

దైవ దర్శనానికి వెళ్తూ..
గణపురం మండలం చెల్పూర్‌ గ్రామానికి చెందిన పానగంటి సమ్మయ్య (50), కొమురమ్మ దంపతులు కాళేశ్వరం దైవ దర్శనానికి వెళ్తున్నారు. బస్సు ముందు సీటులో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు అద్దం పగిలి అందులో సమ్మయ్య ఇరుక్కున్నాడు. గంట పాటు విలవిల కొట్టుకున్నాడు. ఆతరువాత పోలీసులు వచ్చి బయటికి తీసి ఆసుపత్రికి తరలించే లోపే సమ్మయ్య మృతిచెందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement