Mahadevpur
-
Kaleshwaram : మూడో సీజన్లో ముందస్తుగానే...
కాళేశ్వరం: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మూడో సీజన్లో నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీరింగ్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లోని 17 మోటార్లకు గాను నాలుగింటిని ప్రారంభించారు. తొలుత 1, ఆపై 2, 5, 7 నంబర్ మోటార్లు ప్రారంభించగా, ఎనిమిది పంపుల ద్వారా నీరు గ్రావిటీ కాల్వలో ఎత్తిపోస్తున్నారు. ఈ నీరు అన్నారం బ్యారేజీకి తరలుతోంది. 5 రోజులుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుతోంది. బుధవారం ఇక్కడ గోదావరిలో 5.54 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. మరో రెండు రోజుల్లో వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో లక్ష్మీ పంపుహౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూన్ నుంచే ఖరీఫ్ అవసరాలకు నీటిని తలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. -
కరోనా తెచ్చిన కష్టం; ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక
సాక్షి, మహదేవ్పూర్: కరోనా మహమ్మారి ఆ గ్రామాన్ని వణికిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలో 21 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ఈనెల 22న కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది. మరునాడు గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు అనుమానంతో పీహెచ్‌సీకి వచ్చి పరీక్షలు చేయించుకోగా వారికి కూడా పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్య సిబ్బంది ఈనెల 25న గ్రామానికి వెళ్లి 38 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, శనివారం 65 మందికి పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా, ఇటీవల గ్రామంలో ‘రామాయణ కథ’ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన చూసేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితోనే వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సాలె గూడకు చెందిన ఓ గిరిజన బాలికకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామ శివారులో ప్రత్యేకంగా ఓ గుడిసెను ఏర్పాటు చేసి బాలికకు అక్కడ ఆశ్రయం కల్పించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
కాళేశ్వరంలో మళ్లీ ఎత్తిపోతలు
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం పథకం ద్వారా మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్లో ఆదివారం ఇంజనీరింగ్ అధికారులు రెండు మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. లక్ష్మీపంపుహౌస్ నుంచి ఇప్పటికే 11 మోటార్లతో 22 పంపుల ద్వారా గడిచిన రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో భారీ వర్షా లతో ఇంజనీర్లు మోటార్లను నిలిపివేశారు. అప్పటి నుంచి పంపుహౌస్‌లో ఎత్తిపోతలు జరగలేదు. లక్ష్మీబ్యారేజీకి జలకళ: ఈ నెల 1 నుంచి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలోని 85 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల వరకు నిల్వ ఉంది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు బ్యాక్ వాటర్ 20 కిలోమీటర్ల మేరకు పెరగడంతో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తాజాగా ఎత్తిపోతలు ప్రారంభించారు. 10.5 టీఎంసీల లక్ష్యం: లక్ష్మీపంపుహౌస్ మోటార్ల ద్వారా డెలివరీ సిస్టర్న్‌లో ఎత్తిపోసే నీరు.. అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా 13.5 కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి చేరుతుంది. అక్కడి నుం చి ఎగువన ఉన్న లోయర్ మానేరుకు 8 టీఎంసీలు, ఎల్లం పల్లికి 2.5 టీఎంసీలు.. మొత్తం కలిపి 10.5 టీఎంసీల నీటిని తరలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మొత్తం పది మోటార్లు రన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక చోటనుంచి మరో చోటుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎల్ఎండీకి తరలించనున్నారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు బోయినపల్లి(చొప్పదండి): కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రారంభం కావడంతో దానికి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నీటి ని విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు 12, 13 గేట్లను ఎత్తడంతో ఒక్కో గేటు ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పు న 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి వెళ్తోంది. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరద కాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.57 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. దేవాదుల పంపింగ్ షురూ కన్నాయిగూడెం(ములుగు): దాదాపు ఐదు నెలల తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ మళ్లీ ప్రారంభమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల పథకంలోని ఫేజ్–1, ఫేజ్–2లో ఒక్కో మోటారు చొప్పున శనివారం రాత్రి ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. ‘కాళేశ్వరం’ సందర్శనకు పర్యాటకులకు అనుమతి కాళేశ్వరం: దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద పర్యాటకుల ప్రవేశానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి పర్యాటకులకు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూన్ 8న ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతులిచ్చినా.. ఇక్కడి పంప్‌హౌస్, బ్యారేజీల్లోకి మాత్రం బ్యారేజీ ఏజెన్సీ సంస్థలు అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం నుంచి పంప్‌హౌస్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. -
దారుణం : చిన్నారులను గుంజలకు కట్టేసి
కాళేశ్వరం : కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారంటూ నలుగురు చిన్నారులను దుకాణం యజమాని గుంజలకు కట్టేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లికి చెందిన నలుగురు చిన్నారులు తన దుకాణంలో నగదు చోరీ చేస్తున్నట్లు గుర్తించిన యజమాని మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం తన దుకాణం ముందు పందిరి గుంజలకు చిన్నారులను తాడుతో కట్టేసి, కొద్దిసేపయ్యాక పిల్లల తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి అప్పగించాడు. దీనిని కొందరు స్థానికులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!) -
హల్చల్ చేసిన భారీ మొసలి
సాక్షి, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఓ భారీ మొసలి హల్చల్ చేసింది. వ్యవసాయపనులకు వెళుతున్న రైతులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలివి.. మహాదేవపూర్ మండలం పల్గుల అటవీ ప్రాంతంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. మొసలి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అతి కష్టం మీద మొసలిని బంధించి.. శివ్వారం మొసళ్ళ సంరక్షణ కేంద్రంలో వదిలారు. ఇటీవలి వర్షాలకు అన్నారం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో మొసలి కొట్టుకువచ్చినట్టు భావిస్తున్నారు. భారీగా ఉన్న మొసలిని చూసి స్థానికులు, రైతులు భయోందోళనకు గురయ్యారు. -
హల్చల్ చేసిన భారీ మొసలి
-
గుంతను తప్పించబోయి..
సాక్షి, కాళేశ్వరం(వరంగల్) : గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులోని ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్, కండక్టర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జల్లా మహదేవపూర్ మండలం అన్నారం డేంజర్ క్రాసు వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సాయంత్రం హన్మకొండ నుంచి కాళేశ్వరం వస్తుంది. మహదేవపూర్ మండలం అన్నారం డేంజర్ క్రాసు వద్ద బస్సు డ్రైవర్ గుంతను తప్పించబోయాడు. కాళేశ్వరం నుంచి వస్తున్న లారీ డ్రైవర్ బస్సు అతివేగంగా రావడాన్ని గమనించి వేగాన్ని అదుపు చేసుకుని రోడ్డు దిగాడు. ఆర్టీసీ బస్సు స్పీడుతో వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీటులో కూర్చున్న గణపురం మండలం చెల్పూర్‌కు చెందిన పానగంటి సమ్మయ్య (50) మృతిచెందాడు. క్షతగాత్రులు వీరే.. బస్సు డ్రైవర్ మామిడిశెట్టి సతీష్‌కుమార్, కండక్టర్ శోభారాణి, కాటారం మండలం గూడూరుకు చెందిన వెన్నపురెడ్డి వసంత, కాళేశ్వరంకు చెందిన ఇషాక్, ఇస్మాయిల్, మహదేవపూర్‌కు చెందిన కేదారి ప్రవీణ్‌కుమార్, రేగొండకు చెందిన సాంబశివరావు, నర్సంపేటకు చెందిన గడ్డం సమ్మయ్య, చెల్పూర్‌కు చెందిన కౌసల్య, జీ సమ్మిరెడ్డి, సుద్దాల కొమురయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు మరో 20 మంది వరకు బస్సులో ఉన్నారు. వారిని మహదేవపూర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన డీఎం, ఎస్సై మహదేవపూర్ ఎస్సై సత్యనారాయణ, భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీధర్మా పరిస్థితిని సమీక్షించారు. దీంతో అన్నారం క్రాసురోడ్డు వద్ద మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. రెండు గంటల పాటు ఇరువైపులా వాహనాలు వెళ్లలేదు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రమాదానికి గురైన వాహనాలను ప్రొక్లైయిన్ల సహాయంతో తొలగించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. దైవ దర్శనానికి వెళ్తూ.. గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పానగంటి సమ్మయ్య (50), కొమురమ్మ దంపతులు కాళేశ్వరం దైవ దర్శనానికి వెళ్తున్నారు. బస్సు ముందు సీటులో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు అద్దం పగిలి అందులో సమ్మయ్య ఇరుక్కున్నాడు. గంట పాటు విలవిల కొట్టుకున్నాడు. ఆతరువాత పోలీసులు వచ్చి బయటికి తీసి ఆసుపత్రికి తరలించే లోపే సమ్మయ్య మృతిచెందాడు. -
‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’
కాళేశ్వరం(మంథని) : సహజీవనం చేస్తున్న ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో బుధవారం జరిగింది. వారిలో పురుషుడు మృతిచెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన జంగా హరినాథ్(48) మొదటి భార్య మృతిచెందడంతో మల్హర్ మండలం కొయ్యూర్‌కు చెందిన శ్యామలతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే వారిద్దరు కలిసి ఉండడం ఇష్టం లేని శ్యామల చిన్న సోదరుడు పండ్ల రాము పలుమార్లు వారిపై దాడి చేశాడు. కలిసి ఉండొద్దని బెదిరించాడు. అయినా వారు కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అతడి వేధింపులు భరించలేక ఇద్దరు బుధవారం ఉదయం 7.30 గంటలకు కాళేశ్వరంలోని గోదావరి నదిలో వీఐపీ ఘాట్ వద్ద క్రిమిసంహారక మందు తాగారు. హరినాథ్ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితికి చేరింది. స్థానికులు గమనించి 108లో మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’ అని రాజు బెదిరించడంతో తాము మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హరినాథ్ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ సంఘటన స్థలంలో ఓ చేతి సంచిలో వారిద్దరి ఫొటోలతో కలిపి లభించింది. కాగా హరినాథ్ మొదటి భార్య కుమారుడు ప్రసన్నకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామ్‌సింగ్ తెలిపారు. మృతుడు స్థానికంగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పలిమెల ఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్లో ఇలా.. శ్యామల చిన్న తమ్ముడు పండ్ల రాజు తరచు మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేశాడు. ఇద్దరిని కొట్టి దూరం చేశాడు. అయినా మేమిద్దరం ఒక్కటయ్యాం. చంపుతానని బెదిరించాడు. మీరే చావండి లేదా నేనే చంపుతా అని వేధించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
ప్రాణం పోయినా పంట భూములు ఇవ్వం
మహదేవపూర్: మేడిగడ్డ బ్యారేజీకి అవసరమైన సామగ్రి, యంత్ర పరికరాలను తరలించేందుకు చేపట్టిన రోడ్డు నిర్మాణానికి ప్రాణాలు పోయినా పంట భూములను ఇచ్చే ది లేదని బెగులూరు, సూరారం రైతులు తేగేసి చెప్పారు. బ్యారేజీ వల్ల ముంపునకు గురవుతున్న పంట భూముల ను ఇవ్వాలని గతంలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ప్రాజెక్టు సీఈ, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అడిగిన సమయంలో గోదావరిలో కోతకు గురైన తమ పట్టా భూములకు కూడా ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయగా అంగీకరించారని, ఇప్పుడు మాట మార్చి ఎకరానికి రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారని రైతులు ఆరోపించారు. రైతులను మభ్యపెట్టి మాయ చేసి ఎంజాయ్మెంట్ సర్వే చేశారని, కొంత మేర దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం పనులను చేపట్టారని రైతులు మండిపడ్డారు. బెగులూరు గ్రామ శివారులో 78 ఎకరాలు, సూరారం శివారులో 48 ఎకరాలు కోతకు గురై గోదావరిలో కలిసింది. ఇప్పటికే బినామీ పేర్లతో పంట భూములు కొనుగోలు చేసి భూసేకరణలో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో గోదావరి ముంపు భూముల సమస్య తెరపైకి రావడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. పంట భూములు ఇచ్చేది లేదు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో గోదావరిలో కలిసిపోయిన పట్టా భూములకు కూడా పరిహారం చెల్లిస్తామని మాట ఇచ్చిన అధికారులు రైతులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే పంట భూములు ఇచ్చేది లేదు. –బుర్రి శివరాజు, రైతు ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించాలి మేడిగడ్డ బ్యారేజీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి వ్యవసాయ యోగ్యమైన భూమికి చెల్లిస్తున్న విధంగా గో దావరిలో కలిసిపోయిన భూమికి కూడా రూ.10.50 లక్షలు చెల్లిస్తేనే భూములు ఇస్తాం. లేకపోతే అధికారులను పంట భూముల్లో కాలుపెట్టనివ్వం. –పంతంగి రాజయ్య,సింగిల్ విండో డైరెక్టర్ దౌర్జన్యం చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం రూ.82 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బీద రైతులకు ఎకరానికి రూ.10.50 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ప్రాణాలు పోయినా సరే పంట భూములను ఇవ్వంగాక ఇవ్వం. దౌర్జన్యంగా పంట భూములను లాక్కుంటే కోర్టుకెళ్తాం. –పంతంగి తిరుపతి, రైతు -
రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి
మహదేవ్పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ టిప్పర్ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళుతున్న బాబు, ప్రమీల అక్కడికక్కడే మృతి చెందారు. వీరు సర్వాయిపేట వాసులని సమాచారం. -
గోదావరిలో అన్నదమ్ముల గల్లంతు
మహదేవ్పూర్ (కరీంనగర్) : బైక్ పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు అదుపుతప్పి గోదావరిలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కుంట్లం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్ర చోటుచేసుకుంది. కాళేశ్వరంకు చెందిన అల్తాఫ్, సల్మాన్ అనే ఇద్దరు యువకులు బైక్‌పై గోదావరి దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్‌తో సహా గోదావరిలో పడి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మాంసం పంచుకోవడంలో వివాదం: వ్యక్తి హత్య
మహదేవ్పూర్ (కరీంనగర్) : వేటకు వెళ్లి కొట్టుకొచ్చిన వన్యప్రాణుల మాంసం పంచుకోవడంలో చెలరేగిన వివాదం ముదిరి పాకానపడి ఒకరి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం దమ్మూరు గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పెద్దిగడ్డ బాబు(40), చిన్నబాపు(35) వేటకు వెళ్లి వన్య ప్రాణుల మాంసాన్ని తెచ్చుకున్నారు. దాన్ని పంచుకునే క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో చిన్నబాపు కర్రతో బాబుపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగ గాయపడిన బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్, ఆటో ఢీ : ఐదుగురికి గాయాలు
మహదేవ్పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ - కాళేశ్వరం రహదారిలో ఎడపల్లి స్టేజ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. కాళేశ్వరం వైపు వెళుతున్న ఆటో- ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా, బైక్‌పై వస్తున్న కోటి చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగిలిన వారికి మహదేవ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.