వివిధ పార్టీల నాయకులతో సమావేశమైన కలెక్టర్ వెంకటేశ్వర్లు
సాక్షి, భూపాలపల్లి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నిలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో ఎన్నికల నిర్వహణపై వివరించారు.
అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి వివరించామని చెప్పారు. జిల్లాలోని ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులు నవంబర్ 12 నుంచి నామినేషన్ల దాఖలు, 19 నాటికి చివరి తేదీ, 20 నామినేషన్ల పరిశీలన, 22 ఉపసంహరణ గడువు, డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాల వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్థనా నియమావళికి లోబడే రాజకీయ పార్టీలు వ్యవహరించాలని కోరారు.
పలు టీంల ఏర్పాటు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ములుగు నియోజకవర్గ పరిధి 9 మండలాలు, భూపాలపల్లి పరిధి 7 మండలాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 3 స్టాటిక్ సర్వే టీంలు ఉంటాయని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని, స్టాటిక్ సర్వే టీంలు వాహన తనిఖీలు చేస్తూ మద్య, డబ్బు సరఫరాను అరికట్టేందుకు పనిచేస్తాయన్నారు. ఈ బృందాల్లో పోలీస్ అధికారులతోపాటు, ఎక్సైజ్, అటవీ అధికారులు ఉంటారని తెలిపారు. సభలు, సమావేశాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడకుండా కట్టడి చేయడానికి వీడియో సర్వే లైన్స్ టీం ద్వారా సంబంధిత క్లిపింగులు తెప్పించుకుని పరిశీలిస్తామన్నారు.
48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలి
రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయాలనుకుంటే 48 గంటల ముందుగానే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఆఫ్లై చేసుకోవచ్చని, ఇందుకు సువిధ యాప్‌ను వినియోగించుకోవచ్చని, అలాగే మాన్యువల్‌గానూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలులేదని, ఖర్చు చేసే ప్రతి పైసకు లెక్కచెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. నవంబర్ 12వ తేదీకి ముందే అభ్యర్థులు బ్యాంకుల్లో ఎకౌంట్ తీసి దానినుంచే ఎన్నికలకు సంబంధించిన ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల ప్రచారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుం దని, 10 తర్వాత ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు.
సమస్యాత్మక ప్రాంతాలు
ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలో 70 సమస్యత్మాక, 26 అతి సమస్యాత్మక, 151 నక్సల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో 130 పోలింగ్ కేంద్రాలు, అతి సమస్యత్మాక ప్రాంతాల్లో 66 పోలింగ్ స్టేషన్‌లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 174 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు.
నవంబర్ 10 వరకు ఓటు నమోదు..
తుది ఓటరు జాబితాలో ఓటు రాని వారుంటే నవంబర్ 10వ తేదీ వరకు నమోదు చేసుకునే వీలుందని కలెక్టర్ తెలిపారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు వస్తాయని, ఈ సారి యువ ఓటర్ల సంఖ్య పెరిగిందని చెప్పారు. సమావేశంలో జేసీ కె.స్వర్ణలత, భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చల్లూరి సమ్మయ్య, రఘుపతిరావు, సాంబమూర్తి, చాడ రఘునాథరెడ్డి, వెన్నంపెల్లి పాపయ్య, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల విధులకు గైర్హాజర్ కావొద్దు
ఎన్నికల నిబంధనల అమలుకోసమే వివిధ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల నిర్వహణకు చేసిన ఫ్లైయింగ్‌స్క్వాడ్, మోడల్‌కోడ్ ఆఫ్ కండర్డ్ స్టాటిక్ సర్వెలెన్స్ టీం, వీడియో వీటింగ్, వీడియో సర్వినిలెన్స్ టీం, అసిస్టెంట్ అకౌంటింగ్ టీంలతో సింగరేణి క్లబ్‌హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను పార్టీలు, అభ్యర్థులు ఉల్లంఘించకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో కేటాయించిన ఉద్యోగులు నిబంధనల మేరకు నోడల్ అధికారి, రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలను పాటించాలని, విధులకు గైర్హాజరైతే చర్చలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment