సాక్షి, భూపాలపల్లి : ప్రశాంతంగా ఉన్న అడవుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పెద్దంపేట అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అటవీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే అంబట్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇక ఎదురుకాల్పుల ఘటనలో 12 నుంచి 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరు ముఖ్యనేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తప్పించుకున్న ముఖ్య నాయకులు!
కొంతకాలంగా జిల్లాలో మావోల కదలికలు పెరిగాయని రెండ్రోజుల క్రితం ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు పలిమెల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈక్రమంలోనే మావోలు తప్పించుకుని పారి పోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నా రు.
ప్రస్తుతం తప్పించుకున్న మావోలు మహాముత్తారం మీదుగా ములుగు అటవీప్రాంతంలోకి లేకపోతే గోదావరి తీరం దాటి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి తప్పించుకున్న వారిలో జయశంకర్–మహబూబాబాద్–వరంగల్–పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డితో పాటు ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరి యా సెక్రటరీ రీనా, ఇల్లందు–నర్సంపేట ఏరి యా సెక్రటరీ భద్రు, జమున, భూపాలపల్లి జిల్లాకు చెందిన భిక్షపతి తదితరులున్నారని గుర్తించినట్లు సమాచారం.
తప్పించుకుపోయిన వీరి కోసం మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల, భూపాలపల్లి అటవీ ప్రాం తాలతో పాటు ములుగు జిల్లా అటవీ ప్రాం తాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 13 పోలీసు బృందాలతో పాటు రెండు గ్రేహౌండ్స్ బృందాలూ రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి, ఇంద్రావతి నదుల సరిహద్దుల్లో నిఘా పెంచారు. అటవీ ప్రాంతా న్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment