మూడు జోన్లు.. మూడు ‘వానలు’ | Heavy Rains And Floods Inflected In North Telangana | Sakshi
Sakshi News home page

మూడు జోన్లు.. మూడు ‘వానలు’

Published Tue, Jul 19 2022 12:59 AM | Last Updated on Tue, Jul 19 2022 11:21 AM

Heavy Rains And Floods Inflected In North Telangana - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలోని మూడు వాతావరణ జోన్లలో ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో మూడు రకాలుగా వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ (ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలు)లో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండగా మధ్య తెలంగాణలో (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్‌ జిల్లాలు) ఓ మోస్తరుగా, దక్షిణ తెలంగాణ (ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలు)లో సాధారణ వర్షాలే కురుస్తున్నాయి. 

అప్పుడే లక్ష్యానికి చేరువై... 
నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో నాలుగు మాసాల్లో కురవాల్సిన వర్షం 72.04 సెంటీమీటర్లుకాగా జూన్‌ 1 నుంచి జూలై 18 వరకు 56.41 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. అంటే 120 రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం 48 రోజుల్లోనే 78 శాతం మేరకు కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతమే నమోదైనా (14.26 సెంటీమీటర్లు), జూలై 18 వరకు 11.7 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఏకంగా 42.03 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసింది.

నిజామాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 85.5 సెంటీమీటర్ల వర్షం (253 శాతం) కురవగా జగిత్యాల (230 శాతం), కరీంనగర్‌ (211 శాతం), నిర్మల్‌ (205 శాతం), భూపాలపల్లి (190 శాతం) అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు అన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 125 శాతం నుంచి 253 శాతం వరకు అధిక వర్షాలు కురిశాయి. కొన్ని గంటలపాటు క్లౌడ్‌బరస్ట్‌ వల్లే ఉత్తర తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

సెంట్రల్‌లో మధ్యస్థం.. 
సెంట్రల్‌ తెలంగాణ జోన్‌లోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాలు కురిశాయి. అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఇంకా కురువలేదు. ఒక్క ములుగు జిల్లాలో మాత్రం అతిభారీ వర్షాలతో 158 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 

దక్షిణాన వెనకబడ్డ గద్వాల.. 
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం రంగారెడ్డి జిల్లాలో 91 శాతం అధికంగా నమోదైతే, అత్యల్పంగా జోగులాంబ గద్వాలో 35 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. ఉత్తర, మధ్య తెలంగాణలతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నా అన్ని జిల్లాలు ఇప్పటికే సాధారణ సగటు వర్షపాతాన్ని మించిపోవడం విశేషం. 

వర్షాల రికార్డులు ఇవీ... 
ఈ సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లా నవీపేట సాధారణం కంటే 365 శాతం అధిక వర్షపాతంతో రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షం కురిసిన ప్రాంతంగా రికార్డు సృష్టించగా కుమురం భీం జిల్లా లింగాపూర్‌ 344 శాతంతో రెండో స్థానంలో 308 శాతం అధిక వర్షంతో జైనూర్‌ మూడవ ప్లేస్‌లో నిలిచింది. 

గత 50 ఏళ్లలో అత్యధిక వర్షపాతం రికార్డు ములుగు జిల్లా వాజేడులో నమోదైంది. 2013 జూలై 19న వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం జిల్లా దహేగాన్‌లో 2013 జూలై 23న 50.36 సెంటీమీటర్లు, 2005 సెప్టెంబర్‌ 20న భద్రాద్రి జిల్లా ములకపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షం పడింది. 

24 గంటల్లో 0.25 సెంటీమీటర్ల మేర వర్షం కురిస్తే దాన్ని ఒక్క రెయినీ డేగా గుర్తిస్తారు.గత 30 ఏళ్ల సగటు వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే సంవత్సరంలో అత్యధికంగా భద్రాద్రి జిల్లా 80 రెయినీ డేస్‌తో మొదటి స్థానంలో ఉంది. 74 రోజులతో ములుగు రెండవ స్థానంలో 72 రోజులతో కుమురం భీం మూడవ ప్లేస్‌లో ఉంది. 

జోగులాంబ గద్వాలలో ఏడాదిలో కేవలం 47 రోజులు, వనపర్తిలో 49, హైదరాబాద్‌లో 51 రోజులు మాత్రమే రెయినీ డేస్‌ ఉన్నాయి.

అల్పపీడనాలే ఎక్కువ... 
తెలంగాణలో సాధారణ సగటు వర్షపాతం కంటే అల్పపీడనాల వల్లే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అల్పపీడనాలు ఒడిశా వైపు మళ్లే సమయంలో ఉత్తర తెలంగాణలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీంతో అతిభారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా తీర ప్రాంతంతో పోలిస్తే గోదావరి పరీవాహకంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉండటం కూడా అక్కడ అత్యధిక వర్షాలకు ఓ కారణం. 
– వై.కరుణాకర్‌రెడ్డి, వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ 

ఇదీ వర్షం లెక్క.. (ప్రతి గంటకు) 
తేలికపాటి వర్షం: 1 సెంటీమీటర్‌ 
మోసర్తు వర్షం: 1–2 సెంటీమీటర్లు 
భారీ వర్షం: 2–3 సెంటీమీటర్లు 
అతి భారీ వర్షం: 3–5 సెంటీమీటర్లు 
అత్యంత భారీ వర్షం: 5–10 సెంటీమీటర్లు 
క్లౌడ్‌ బరస్ట్‌: 10 సెంటీమీటర్లపైన  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement