సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ప్రస్థానం ఈ ప్రాదేశిక ఎన్నికల అనంతరం ముగిసిపోనుంది. 1959లో ఏర్పాటైన జెడ్పీ అరవై సంవత్సరాలు కలిసి నడిచింది. జిల్లాల విభజనతో ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా ఏర్పడటం, ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇక ఉమ్మడి జెడ్పీ చరిత్రగా మిగిలిపోనుంది. ఉమ్మడి జెడ్పీలో ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి జెడ్పీ చైర్మన్ల ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి కూడా పలువురు ప్రాతినిధ్యం వహించారు.
నిర్మల్ నుంచే అత్యధికం..
ఉమ్మడి గా 1959 నుంచి 2019 వరకు 19 మంది ప్రాతినిధ్యం వహించారు. మధ్యకాలంలో కాల పరిమితి ముగిసినప్పుడు ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగింది. స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు వ్యవహరించారు. ఈ 19 మందిలో ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచే 11 మంది ఉండటం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానంగా రాజకీయ చైతన్యం ఈ ప్రాంతంలో అధికం. ఆ తర్వాత మంచిర్యాల నుంచి ఐదుగురు, ఆదిలాబాద్ నుంచి ఇద్దరు, కుమురంభీం జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాకో జెడ్పీ చైర్మన్ స్థానం ఏర్పడింది. దీంతో స్థానిక నేతలకు అవకాశం లభించనుంది.
కొంతమందికి ఉన్నతి..
ఉమ్మడి జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించిన వారిలో కొంతమంది రాజకీయంగా ఉన్నతి సాధించారు. మరికొంత మంది ఆ పదవి తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. ఇంకొంతమంది ఇప్పటికీ ఉన్నత పదవి కోసం పోరాడుతున్నారు. మొదటి చైర్మన్ రంగారావు పల్సికర్ రాజకీయం అక్కడితోనే నిలిచిపోయింది. 1960 నుంచి 1961 వరకు జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించిన పి.నర్సారెడ్డి ముఖ్యమంత్రులు బ్రహ్మానందంరెడ్డి, వెంగల్‌రావుల హయాంలో రెండుసార్లు మంత్రులుగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా ఆయన పేరు గడించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయిలో పదవి అలంకరించారు. ఆయనకు సోదరుడైనటువంటి పి.గంగారెడ్డి 1964 నుంచి 1967 వరకు జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. టి.మధుసూదన్‌రెడ్డి 1983 నుంచి 1985 వరకు జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన ఆ తర్వాత ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. మహ్మద్ సుల్తాన్‌అహ్మద్ 1985 నుంచి 1986 వరకు జెడ్పీచైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. 2006 నుంచి 2009 వరకు అధ్యక్షుడిగా ఉన్న రాథోడ్ రమేశ్ ఎమ్మెల్యే, ఎంపీగా కూడా పనిచేశారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
కొంతమంది కనుమరుగు..
జెడ్పీచైర్మన్లుగా పనిచేసిన వారిలో కొంతమంది రాజకీయంగా కనుమరుగయ్యారు. మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. కడెంకు చెందిన జి.నారాయణరెడ్డి ఏడాదిపాటు 1967 నుంచి 1968 వరకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ఎలాంటి పదవులు లభించలేదు. 1991 నుంచి 1992 వరకు చైర్మన్‌గా ఉన్న చుంచు ఊశన్నది కూడా అదే పరిస్థితి. 1995 నుంచి 1996 వరకు చైర్ పర్సన్‌గా వ్యవహరించిన సుమతిరెడ్డి ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. టి.పురుషోత్తంగౌడ్‌ది ఇదే పరిస్థితి. చిట్యాల సుహాసిని ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. లోలం శ్యామ్‌సుందర్ నిర్మల్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో చేరారు. జుట్టు అశోక్ చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నత పదవి చేపట్టలేదు. సిడాం గణపతి ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నతి లభించలేదు.
పూర్తి కాలం కొంతమందే..
జెడ్పీచైర్మన్లుగా పూర్తికాలం కొంత మందే పదవిలో ఉన్నారు. జి.నర్సింహారెడ్డి 1970 నుంచి 1976 వరకు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 1987 నుంచి 1991 వరకు, లోలం శ్యామ్‌సుందర్ 2001 నుంచి 2006 వరకు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న వి.శోభారాణి 2014 నుంచి పదవిలో ఉన్నారు. ఈ జూన్‌తో పదవి కాలం ముగియనుంది. జెడ్పీచైర్మన్ రిజర్వేషన్ మొదట్లో ఉండేది కాదు. ఆ తర్వాత బీసీ, ఎస్సీలకు వచ్చింది. 2014లో బీసీ (మహిళ)కు రిజర్వ్ చేశారు. అప్పట్లో టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాలో 52 స్థానాలకు గాను 38 ఏకపక్షంగా గెలిచింది. ఆ తర్వాత పలువురు ఇతర పార్టీల జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో కలవడంతో సంపూర్ణమైంది. ఇక అప్పట్లో చైర్‌పర్సన్ స్థానం కోసం టీఆర్‌ఎస్‌లో నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి, మంచిర్యాల జెడ్పీటీసీ ఆశాలత, నార్నూర్ జెడ్పీటీసీ రూపావతి పుష్కర్‌ల మధ్య పోటీ నెలకొనగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి పేరును జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఖరారు చేశారు.
జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్లు..
నిర్మల్ : రంగారావు పల్సికర్, రాంచంద్రారావు అన్నాజీ, లోలం శ్యామ్‌సుందర్, జుట్టు అశోక్ (ముథోల్ నియోజకవర్గం), పి.నర్సారెడ్డి, పి.గంగారెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎన్.సుమతిరెడ్డి, వి.శోభారాణి (నిర్మల్ నియోజకవర్గం), జి.నారాయణరెడ్డి, రాథోడ్ రమేశ్(ఖానాపూర్ నియోజకవర్గం).
మంచిర్యాల: జి.నర్సింహారెడ్డి, బి.సీతాపతి, చుంచు ఊశన్న(మంచిర్యాల నియోజకవర్గం), మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (చెన్నూర్ నియోజకవర్గం), టి.పురుషోత్తంగౌడ్ (బెల్లంపల్లి నియోజకవర్గం).
కుమురంభీం : సిడాం గణపతి (సిర్పూర్ నియోజకవర్గం).
ఆదిలాబాద్ : టి.మధుసూదన్‌రెడ్డి, చిట్యాల సుహాసిని రెడ్డి (ఆదిలాబాద్ నియోజకవర్గం)
పెరిగిన జెడ్పీటీసీ స్థానాలు
ఉమ్మడి జిల్లాలో 52 మండలాలు ఉండగా 52 మంది జెడ్పీటీసీలు ఎన్నికయ్యేవారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడడంతో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 66కు పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాతో పోలిస్తే.. 14 జెడ్పీటీసీ స్థానాలు పెరిగాయి. 636 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కొత్త జిల్లాల్లో ఈ సంఖ్య తగ్గి 568కి చేరింది. ప్రధానంగా పలు ఎంపీటీసీ స్థానాలు ఉన్నటువంటి గ్రామాలు సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయడం, తక్కువ ఓటర్లు ఉన్న వాటిని సమీపంలోని మరో ఎంపీటీసీ స్థానంలో కలపడం వంటివి జరగడంతో ఈ సంఖ్య తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.
కొత్త జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు
జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ
ఆదిలాబాద్ 17 158
మంచిర్యాల 16 130
కుమురంభీం 15 124
నిర్మల్ 18 156
మొత్తం 66 568
అందరికీ అవకాశం
Published Tue, Apr 23 2019 10:48 AM | Last Updated on Tue, Apr 23 2019 10:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment