జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పాలక మండలిలోని కీలక పదవుల ఎన్నిక నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, రెండు కోఆప్షన్ పదవులకు ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత జెడ్పీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు అర్హుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు కొంత సమయం కేటాయిస్తారు. ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ లోకేష్‌కుమార్, ఇతర అధికారులు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఒంటిగంటలోపు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. 3.30 గంటలలోపు ఎన్నికలు పూర్తవుతాయి. కాగా, ఎన్నిక పూర్తయినప్పటికీ వీరి ప్రమాణ స్వీకారం వచ్చే నెల మొదటి వారంలో జరిగే వీలుంది. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం వచ్చేనెల నాలుగో తేదీ వర కు ఉంది. ఆలోపు ప్రమాణ స్వీకారం జ రిగే తేదీని యంత్రాంగం ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా కొత్త పా లక మండలి కొలువుదీరుతుంది. అదే తొలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు.
వైస్ చైర్మన్ పదవి ఎస్టీకి లేదా బీసీకి
జెడ్పీ చైర్ పర్సన్ పదవికి టీఆర్‌ఎస్ నుంచి మహేశ్వరం జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ తీగల అనితారెడ్డి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈమె ఎన్నిక లాంఛనమే. ఇక వైస్ చైర్మన్ పదవిని ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా.. ఆ పదవి రెడ్డి సామాజిక వర్గం కోటాలో పడింది. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. మరో సమీకరణ కూడా టీఆర్‌ఎస్ పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కొనసాగి ప్రస్తుత కొంత రంగారెడ్డి జిల్లాలో ఉన్న 11 మండలాల పరిధి వ్యక్తికి జెడ్పీ చైర్ పర్సన్‌గా అవకాశం కల్పిస్తున్నారు. పాలమూరు నుంచి రంగా రెడ్డి జిల్లాలో కలిసిన ప్రాంతానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించాలన్న డిమా ండ్ కూడా వినిపిస్తోంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడి పది మండలాల్లో ఎస్టీ జెడ్పీటీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనికి అనుగుణంగా ఎస్టీ సామాజిక వర్గానికి పదవికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ సామాజిక వర్గం.. అభ్యర్థి ఎవరు అన్న దానిపై పార్టీ వర్గాలు వెల్లడించడం లేదు. అధిష్టానం నుంచి వచ్చే సీల్డ్ కవరులో ఎవరి పేరు ఉంటే.. వైస్ చైర్మన్‌గా ఆ వ్యక్తి ఉంటారని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment