టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతాం | Bandi Sanjay Slams On TRS Party In Adilabad | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతాం

Published Thu, Sep 10 2020 10:14 AM | Last Updated on Thu, Sep 10 2020 10:14 AM

Bandi Sanjay Slams On TRS Party In Adilabad - Sakshi

సాక్షి, ఇచ్చోడ: సెప్టెంబర్‌ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బుధవారం ఆయన జోడేఘాట్‌ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా ఇచ్చోడలో కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఇక ఇది నడవదని, టీఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గుమ్మడి భీంరెడ్డి, కొల్లురి చంద్రశేఖర్, కేంద్రే నారాయణ, కదం బాబారావు, మాధవ్‌ ఆమ్టె, తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికలొస్తేనే సీఎంకు సింగరేణి గుర్తొస్తది 
గోదావరిఖని(రామగుండం): ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు, కార్మికులు గుర్తొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మంచిర్యాలకు వెళ్తూ మంగళవారం రాత్రి గోదావరిఖనికి చేరుకున్నారు. స్థానిక ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

త్వరలో సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయని, టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌కు కార్మికులు బుద్ధిచెప్పాలని కోరారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ తన కూతురు కవితను గనుల పైకి పంపి ప్రచారం చేయించి, కార్మికుల మారుపేర్లను రెగ్యులరైజ్‌డ్‌ చేస్తామని, రూ. 10లక్షల సొంతింటి కోసం వడ్డీలేని రుణం ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తామని, కొత్త బొగ్గుగనులు ప్రారంభించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఆనేక హామీలిచ్చి గెలిచారన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినా హామీలు మాత్రం నెరవేరలేదన్నారు. త్వరలో నిర్వహించే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఇచ్చే తీర్పుతో సీఎం కేసీఆర్‌ మైండ్‌ బ్లాక్‌ కావాలన్నారు. ధనబలంతో గెలిచేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తాడని, కేసీఆర్‌ వచ్చే డబ్బులు తీసుకుని బీఎంఎస్‌ను గెలిపించాలని కోరారు.

పీవీ ఇప్పుడు గుర్తొచ్చారా.. 
మాజీ ప్రధాని పీవీనర్సింహారావు తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప నేత అని కొనియాడారు. రాష్ట్రం సాధించిన ఆరేళ్లలో ఎన్నడూ పీవీ గురించి మాట్లాడని కేసీఆర్‌ ఇప్పుడు శతజయంతి సందర్భంగా ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ఇది గమనించిన కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్‌ దక్కుతుందనే ఉద్దేశంతో శత జయంతి ఉత్సవాలు ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించి, అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్‌–17ను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఎంఐఎంకు బయపడి ఒకవర్గానికి కొమ్ముకాచేందుకు సీఎం కేసీఆర్‌ తెలంగాణ అమరులను కించపరుస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అక్రమాలపై దృష్టి 
రామగుండంలో పునర్నిర్మిస్తున్న రామగుండం ఎరువుల కార్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రికి విన్నవిస్తామని తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 54కోట్లు చెల్లించాల్సి ఉందని, నిధులు మంజూరు చేయడంలో కేసీఆర్‌ జాప్యం చేస్తున్నారని విమర్శించారు. నవంబర్‌లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో నాయకులు దుగ్యాల ప్రదీప్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, బొడిగె శోభ, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, బల్మూరి అమరేందర్‌రావు, బల్మూరి వనిత, గీతామూర్తి, భానుప్రకాశ్,  రాకేష్‌రెడ్డి, వడ్డెపెల్లి రాంచందర్, రావుల రాజేందర్, మామిడి రాజేష్, కోమల్ల మహేష్, క్యాతం వెంకటరమణ, ప్రవీణ్, జక్కుల నరహరి, పిడుగు క్రిష్ణ, సోమారపు లావణ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement