మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకే మూతపడుతుండగా.. మద్యం ప్రియులంతా బార్ల బాట పడుతున్నారు. డిమాండ్ పెరగడంతో అక్కడ ఎమ్మార్పీ కంటే రూ.50 దాకా అదనంగా బాదేస్తున్నారు. ఫలితంగా బార్ల గల్లాపెట్టెలు పొంగిపొర్లుతుండగా.. మందుబాబులు జేబులు తడుముకుంటున్నారు. నిన్నటివరకూ రూ.120 ఉన్న ఓ బ్రాండ్ లిక్కర్ క్వార్టర్‌పై ప్రభుత్వం రూ.20 పెంచగా రూ.140కి చేరింది. అదే బార్‌కు వెళ్లి రూ.200 ఇస్తే చిల్లర వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదు. గట్టిగా అడిగితే మందులేదు పొమ్మంటున్నారు. చేసేదేమీలేక మద్యం ప్రియులు బార్ యజమానులు అడిగినంత ఇచ్చి వాళ్లిచ్చింది పుచ్చుకుంటున్నారు.
సాక్షి, అనంతపురం సెంట్రల్ : నూతన మద్యం పాలసీని బార్ నిర్వాహకులు అనుకూలంగా మలుచుకున్నారు. రాత్రి 8 గంటలకే మద్యం షాపులు బంద్ కాగా, బార్లు కళకళలాడుతున్నాయి. ఇదే అదునుగా లిక్కర్ ధరలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రూ.లక్ష కూడా దాటని ఓ బార్ కౌంటర్.. ఇప్పుడు రూ.4 లక్షలు దాటిపోతోంది.
నూతన ఎక్సైజ్ పాలసీతో ‘చుక్క’లు
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్యపాన నిషేధించడంలో భాగంగా తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో ఇటీవలే నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో 247 మద్యం షాపులుండగా.. దాన్ని 197కు కుదించింది. మద్యంషాపుల వేళల్లోనూ మార్పులు చేసింది. దీంతో రాత్రి 8 గంటలకు మద్యం షాపులు మూతపడుతున్నాయి. ఇక పర్మిట్‌షాపులను పూర్తిగా రద్దు చేయడంతో మద్యం ప్రియులంతా బార్ల బాట పడుతున్నారు. జిల్లాలో 32 బార్‌లు ఉండగా..అన్నింటిలోనూ గతంతో పోలిస్తే రెట్టింపు వ్యాపారం జరుగుతోంది.
అన్నింటిపైనా దోపిడీ
బార్ నిర్వాహకులు లిక్కర్‌పైనే కాకుండా వాటర్‌బాటిళ్ల నుంచి ఆహార పదార్థాల వరకూ భారీ రేట్లు అమలు చేస్తున్నారు. డాబాలతో పోలిస్తే 50 నుంచి 60 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. అధికారులకు మామూళ్లుతో పాటు వారు వచ్చినప్పుడు మర్యాదలు చూసుకుంటుండడంతో అధికారులెవరూ∙పెద్దగా పెట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మద్యం ప్రియుల ఇళ్లకు కాసిన్ని కాసులైనా వెళ్తాయి...లేకపోతే పేదల కష్టార్జితం బారు గల్లాపెట్టెలోకి వెళ్తుంది.
నియంత్రించే పరిస్థితి లేదు
బార్లలో మద్యం రేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి లే దని ఇన్‌చార్జ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చెబుతున్నారు. సర్వీసు పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారనీ, త్వరలో బార్ల వేళల్లోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అది అమలైతే వారికి కూడా చెక్ పడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment