సాక్షి, గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా): మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
వారం రోజుల క్రితం కిలో రూ. 36 ఉండేది. ఈసీజన్‌లో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 14వేల ఎకరాల్లో టమాట సాగు చేశారు. పదిహేనురోజుల కిందట 25 కేజీల క్రీట్ రూ. 900 నుంచి రూ.750 వరకు ధర పలికింది. ప్రస్తుతం వారం రోజులుగా మార్కెట్లో 15కేజీల టమాటా క్రీట్ ధర రూ. 185 కాగా 25కేజీల క్రీట్ ధర రూ. 375 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మొదటిరకం టమాటాకిలో రూ.15, రెండోరకం కిలోరూ.8, మూడో రకం రూ.5 వరకు ధరలు పలుకుతున్నాయి.
ఇక్కడి నుంచి మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, గుంటూరు, తమిళనాడు, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లకు ఇక్కడి టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడులు ఊపందుకున్నాయి. అక్కడి మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి.
దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి చేసే టమాట ధరలు పతనం కావడంతో వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో బయట రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేశారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గు ముఖం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment