gurramkonda
-
ఏపీ: తరతరాల ఆచారం.. ఆ 18 గ్రామాల్లో సంక్రాంతి జరుపుకోరు
గుర్రంకొండ : తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగకు మొదటిస్థానం ఉంది. పంటలు బాగా పండి ధాన్యరాశులు ఇంటికి చేరుకొన్న తరువాత వచ్చే మొదటి పండుగ ఇదే కావడంతో సంక్రాంతి ప్రత్యేకతను సంతరించుకుంది. పంటలు పండించడానికి సాయపడే పశువులను భక్తితో పూజించడం ఈ పండుగలో విశేషం. ఆరుగాలం కష్టపడి పనిచేసే ప్రతిరైతూ తప్పనిసరిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా సంక్రాంతి పండుగను గుర్రంకొండ మండలంలోని 18 గ్రామాల్లో జరుపుకోరు. పాత కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని నేటి ఆధునిక కాలంలోనూ కొనసాగిస్తుండటం విశేషం. సంప్రదాయాలు..ఆచారాలకు నిలయం వైఎస్సార్ కడప జిల్లాలో మారుమూల ప్రాంతమైన టి.పసలవాండ్లపల్లె పంచాయతీలోని మొత్తం 18 గ్రామాలను సంప్రదాయాలు, ఆచారాలకు నిలయంగా చెప్పుకోవచ్చు. పురాతన ఆచారం ప్రకారం ఈ గ్రామాల్లో సంక్రాంతి పండుగను జరుపుకోవడం నిషేధం. పల్లెల్లో పశువులను సింగారించడం, మేళతాళాలతో ఊరేగించడం వంటి దృశ్యాలు ఇక్కడ కనిపించవు. గ్రామ పొలిమేర్లలో చిట్లాకుప్పల వద్దకు పశువులను తీసుకెళ్లడం, పాడిఆవుల ఆరాధ్య దైవమైన కాటమరాయుడికి పూజలు నిర్వహించడం వంటి దృశ్యాలు మచ్చుకైనా కనిపించవు. గతంలో ఇక్కడి ప్రజల పూరీ్వకులు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లకు నేటి తరం ప్రజలు కూడా కట్టుబడి ఉండడం ఈ గ్రామాల ప్రత్యేకత. మార్చిలో జరిగే ఉత్సవాలే వీరికి సంక్రాంతి ప్రతి సంవత్సరం మార్చినెలలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతరే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ లాంటిది. గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం సంక్రాంతి పండుగ జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. ప్రతి ఏడాది మార్చి నెలలో శ్రీ పల్లావలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ రోజున అమ్మవారి పేరుమీద వదిలిన ఆవులను మాత్రమే అందంగా అలంకరించి వాటిని ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో గ్రామస్తులందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవారికి సంక్రాంతి పండుగ. పాడిఆవులతో వ్యవసాయం నిషిద్ధం పాడిఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేయడం మాత్రం నిషిద్ధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ మాత్రమే ఉండడం విశేషం. పూర్వపు తమ పెద్దల ఆచారం ప్రకారమే ఈ సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. ఆచారాలను మరువబోం మా పూరీ్వకులు, పెద్దలు ఆ చరించిన ఆచారాలను, సంప్రదాయాలను మరవబోము. మా గ్రామదేవత శ్రీపల్లావల మ్మ ఉత్సవాల రోజున అమ్మ వారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొని వచ్చి పూజలు నిర్వహిస్తాం. అదే మాకు సంక్రాంతి పండుగ. అంతకు మించి ఇప్పుడు ఎలాంటి ఉత్సవాలు ఇక్కడ జరగవు. – బ్రహ్మయ్య, ఆలయపూజారి, బత్తినగారిపల్లె -
సత్యప్రమాణాలకు నిలయం.. తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయం
గుర్రంకొండ: నిజం పలికించే బలిపీఠం తరిగొండలోని శ్రీలక్ష్మినరసింహ్వామి ఆలయం. సత్యప్రమాణాలకు నిలయంగా అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఆలయంగా శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి ఆలయంలోని సత్యప్రమాణాలు చేసే బలిపీఠం దుర్వాసమహర్షి ప్రతిష్టించాడని పురాణ కథనం. తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణం చేయాలంటే భయపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆధునిక సమాజంలో సత్యప్రమాణాల నిలయంగా తరిగొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం విరాజిల్లుతుండడం విశేషం. దుర్వాస మహర్షి ఇక్కడి ఆలయంలో బలిపీఠం ప్రతిష్టించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఆలయం వెలుపల స్వామివారికి ఎదురుగా ఈ బలిపీఠం ఉంది. అత్యంత శక్తివంతమైన శ్రీచక్రయంత్రం పీఠం కింద ఏర్పాటు చేసి బలిపీఠానికి అత్యంత శక్తిని చేకూర్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ బలిపీఠమే కాలక్రమేణా సత్యప్రమాణాలకు నిలయంగా మారింది. బలిపీఠం ముందరే ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు శ్రీవెంగమాంబ ఆలయం ఉంది. ఉమ్మడి రాయలసీమజిల్లాలో కాణిపాకం తరువాత ఎక్కువగా సత్యప్రమాణాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆచారం ప్రకారమే సత్యప్రమాణాలు: ఇక్కడి ఆచారం ప్రకారమే ఎవరైనా సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేసేవారు ముందుగా ఆలయ ప్రాంగణంలోని బావినీటితో స్నానం ఆచరించాలి. తడిబట్టలతో బలిపీఠం వద్దకు చేరుకొని ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆలయప్రాముఖ్యత, స్వామివారి మహత్యం తెలిసినవారు ఎవ్వరు కూడా తప్పు చేసి ఇక్కడ సత్యప్రమాణం చేసే సాహసం చేయరు. చాలా మంది స్నానాలు చేసి ప్రమాణం చేసే ముందు ఆలయ అర్చకులు చెప్పేమాటలు విని వెనకడగు వేసి నిజం అంగీకరించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. తప్పుడు ప్రమాణాలు చేస్తే వారి వంశం నిర్వీర్యమవుతుందనేది భక్తుల నమ్మకం. ఈ విషయాన్ని దుర్వాస మహాముని ఇక్కడ శాసనం చేసినట్లు ఆలయ అర్చకులు చెబుతుంటారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి సత్యప్రమాణాలు చేసేందుకు వస్తుంటారు. దేవుడిపై నమ్మకం ఎక్కువ తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి మీద భక్తులకు, గ్రామస్తులకు నమ్మకం ఎక్కువ. ఆలయంలోని బలిపీఠం మీద సత్యప్రమాణాలు చేయాలంటే తప్పు చేయలేదనే భావన ఉండాలి. ఆధునికంగా ఎంతో టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడి ఆలయంలో సత్యప్రమాణంపై భక్తులకు సడలని నమ్మకం ఉంది. ఎక్కడెక్కడి నుంచో సత్యప్రమాణాలు చేసేందుకు ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. – ప్రకాష్‌రెడ్డి, గ్రామస్తులు, తరిగొండ సత్యప్రమాణం చేయాలంటే భయం తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణాలు చేయడానికి భయపడతారు. తప్పు చేసి కావాలనే తప్పుగా ప్రమాణం చేస్తే అందుకు తగిన శిక్ష అనుభవిస్తారు. బలిపీఠం గురించి చెప్పే మాటలు విని సాధ్యమైనంత వరకు బలిపీఠం దగ్గరకు వచ్చి చాలా మంది నిజం అంగీకరించి వెనుదిరిగి వెళ్లిపోతుంటారు. ఎలాంటి తప్పు చేయని వాళ్లు మాత్రమే సత్యప్రమాణం చేసేందకు ధైర్యం ఉంటుంది. – గోపాలబట్టర్, ఆలయ అర్చకులు, తరిగొండ -
మార్కెట్లో భారీగా పతనమైన టమాట ధరలు
సాక్షి, గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా): మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 36 ఉండేది. ఈసీజన్లో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 14వేల ఎకరాల్లో టమాట సాగు చేశారు. పదిహేనురోజుల కిందట 25 కేజీల క్రీట్ రూ. 900 నుంచి రూ.750 వరకు ధర పలికింది. ప్రస్తుతం వారం రోజులుగా మార్కెట్లో 15కేజీల టమాటా క్రీట్ ధర రూ. 185 కాగా 25కేజీల క్రీట్ ధర రూ. 375 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మొదటిరకం టమాటాకిలో రూ.15, రెండోరకం కిలోరూ.8, మూడో రకం రూ.5 వరకు ధరలు పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, గుంటూరు, తమిళనాడు, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లకు ఇక్కడి టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడులు ఊపందుకున్నాయి. అక్కడి మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి చేసే టమాట ధరలు పతనం కావడంతో వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో బయట రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేశారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గు ముఖం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అల్ల.. నేరేడువనంలో..
గుర్రంకొండ : రైతుల పాలిట కల్పతరువుగా మారింది అల్లనేరేడు. రైతుల లభాల రేడు అల్లనేరేడు కాయలు ఈ ఏడాది విరగ్గాశాయి. ప్రస్తుత సమాజంలో అత్యధిక జనాన్ని పట్టిపీడిస్తున్న చక్కెర(షుగరు)వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వారు తియ్యగా ఉండే ఈ పండ్లను తినవచ్చు. వారికి అన్ని రకాలుగా ఈ కాయలు దివ్య ఔషధం లాగా ఉపయోగ పడుతున్నాయి. దీంతో ఈ సీజన్లో ఈ కాయలకు భలే డిమాండ్ ఏర్పడింది. పలువురు చక్కెర వ్యాధిగ్రస్తులు అల్లనేరేడు కాయల్లోని గింజల్ని ఎండబెట్టుకొని పొడిగా చేసుకొని తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. చక్కెర వ్యాధి గ్రస్తులకు అల్లనేరేడు కాయలు దివ్య ఔషధంలా పని చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో వీటికి భలే డిమాండ్ ఏర్పడింది. కరువు రైతు ఇంట లభాల పంటగా అల్లనేరేడు మిగిలింది. 749 హెక్టర్లలో సాగు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో మొత్తం 746 హెక్టార్లలో అల్లనేరేడు తోటల పెంపకం చేపట్టారు. ఈ ఏడాది మొత్తం 2090 క్వింటాళ్ల అల్లనేరేడు దిగుబడి వచ్చింది. నల్లబంగారంగా పేరున్న ఈ కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.100 ధర పలుకుతుండడంతో రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. బయట రాష్ట్రాల్లోని మార్కెట్లో కిలో రూ.120 వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో రెతులు ఈ ఏడాది లాభాలు చవిచూస్తున్నారు. ముఖ్యంగా హైబ్రీడ్ రకం కాయలు పెద్దపెద్ద సైజుల్లో కాసి చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. హెబ్రీడ్ కాయల్లో గింజ శాతం తక్కువగా ఉండి గుజ్జు శాతం ఎక్కువగా ఉండడం వీటి ప్రత్యేకత. ఇలాంటి రకం కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి మంచి ధరలు పలుకుతున్నాయి. సగటున ఎనిమిది సంవత్సరాల వయసున్న అల్లనేరుడు చెట్టు సరాసరి 25 నుంచి 35 కిలోల వరకు కాయలు కాస్తున్నాయి. ఈఏడాది తోటల్లో చెట్లకు మంచి కాపు పట్టింది. బయట రాష్ట్రాలకు ఎగుమతి నియోజకవర్గంలోని అల్లనేరేడు కాయల్ని రైతులు, వ్యాపారుల బయట రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు తోటల్లోనే కాయల్ని మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తున్నారు. ఏ రకం గ్రేడు కాయల్ని కిలో రూ. 120 చొప్పున విక్రయిస్తున్నారు. బిగ్రేడ్ రకం కాయల్ని కిలో రూ.100 వరకు, సీగ్రేడ్ రకం కాయల్ని రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈప్రాంతంలోని కాయల్ని తిరుపతి, కడప, బెంగుళూరు, చెన్నై వంటి పట్టణాలకు తరలిస్తుంటారు. దివ్య ఔషధంగా అల్లనేరేడు ప్రస్తుత సమాజంలో అల్లనేరేడు పలువురికి దివ్వ ఔషధంగా మారిది. మధుమేహం అదుపుకు, శరీర సమస్యలకు చాలా ఉపయోగ పడుతోంది. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం,జింక్ ఫోలిక్ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. రక్తశుద్ధితోపాటు హిమోగ్లోబిన్ పెంచుతుంది. అస్తమా, ఊపరితిత్తుల వ్యాధులను దూరం చేస్తుంది. రక్తంలో కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. దంతసమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి. గ్యాస్, మూత్ర సమస్యలు చర్మవ్యాధులు, కీళ్ల సమస్యలను నివారించడంలో తోడ్పడుతాయి. ఇంకా పలు రకాల జబ్బులకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. దీంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. -
గాలివానకు దెబ్బతిన్న మామిడి
గుర్రంకొండ: మండలంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలకు పలు గ్రామాల్లో మామిడి పంట దెబ్బతినింది. గుర్రంకొండ–వాల్మీకిపురం మార్గంలో రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు కూలిపోయి రోడ్డుపై పడ్డాయి. మామిడితోటల్లో కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు భారీగా నష్టపోయారు. -
తరగని కీర్తి.. తరతరాలకు స్ఫూర్తి
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, బ్రిటీషువారి పాలనకు నిలువుటద్దం గుర్రంకొండ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా.. చరిత్రాత్మాక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శాతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది.శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పుసూల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషువారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘనచరిత్ర కలిగిన ఈకోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు, ఆకట్టుకొనే కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచేకాక కర్ణాటకా నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. శత్రుదుర్భేద్యం.. కోటముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. వీటిల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా నీటిలో మొసళ్లును వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించేవారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. -
‘కారుణ్యం’ చూపలేక.. మరణమే పలకరించింది
కన్నబిడ్డ నాలుగేళ్లుగా అనారోగ్యంతో అల్లాడుతుంటే.. ఆ తల్లి తట్టుకోలేకపోయింది. శక్తిమేర వైద్యం చేయించినా.. కుదుటపడని కొడుకుని చూడలేక తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇక బిడ్డను బతికించుకోలేననుకున్న ఆ తల్లి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరేందుకు ప్రయత్నించింది. కోర్టు లేదని తెలిసి కొడుకును ఇంటికి తీసుకెళుతుండగా.. మార్గంమధ్యలోనే కన్నుమూశాడు ఆ తనయుడు. అందరికంట తడిపెట్టించిన ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగింది. పుంగనూరు: గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెకు చెందిన మణి చౌడేపల్లె మండలం బీర్జేపల్లెకు చెందిన అరుణను వివాహం చేసుకుని బీర్జేపల్లెలో స్థిరపడ్డాడు. బండలు కొట్టి జీవించే ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకొడుకు హర్షవర్ధన్ (9) నాలుగో తరగతి చదువుతున్నాడు. మరో కుమారుడు ఎబిలైజర్ వయసు ఏడాది. నాలుగేళ్ల కిందట ఒకరోజు హర్షవర్ధన్ బడిలో ఆడుకుంటూ పడిపోయాడు. నోటినుంచి, ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. అప్పటి నుంచి తరచుగా అలాగే అవుతుండేది. తల్లిదండ్రులు తిరుపతి, వేలూరు తదితర ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. గుర్రంకొండలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మి లక్షలు వెచ్చించినా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. హర్షవర్ధన్‌కు తరచు రక్తస్రావం అవుతోంది. కొడుక్కి వైద్యం చేయించలేకపోతున్నాననే వేదనతో మణి 15 రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో బిడ్డ పడుతున్న వేదన చూసి తట్టుకోలేకపోయిన అరుణ.. అతడికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరాలని నిర్ణయించుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కొడుకును తీసుకుని ఆటోలో మంగళవారం పుంగనూరు కోర్టుకు వచ్చింది. కోర్టుకు సెలవని తెలియడంతో వారంతా అదే ఆటోలో వెనుదిరిగారు. బీర్జేపల్లె వెళ్లకముందే ఆటోలోనే హర్షవర్ధన్ తుదిశ్వాస విడిచాడు. కళ్లముందే కన్నపేగు తెగిపోవడంతో ఆ తల్లి రోదన హృదయవిదారకంగా ఉంది. హర్షవర్ధన్ తాత మృతి గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెలో ఉంటున్న హర్షవర్దన్ తాత కె.రెడ్డెప్ప (70) అనారోగ్యంతో సోమవారం తిరుపతి ఆస్పత్రిలో మృతిచెందాడు. ముందురోజు తాత, మరుసటి రోజు మనుమడు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
క్షణికావేశం..పోయిందో చిన్నారి ప్రాణం
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : భార్యతో గొడవ పడి ఓ ప్రబుద్ధుడు క్షణికావేశంలో తాను క్రిమి సంహారక మందు సేవించాడు. తన బిడ్డకూ అదే మందును మింగించ డంతో ఆ చిన్నారి మృత్యువాత పడింది. అతడు పరిస్థితి విషమిం చి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన గుర్రంకొండ మండలం లో చోటుచేసుకుంది. వివరాలు..గుర్రంకొండ మండలం వంకా యలోళ్లపల్లెకు చెందిన దంపతులు ఆదీశ్వర్, నందినికి ఇద్దరు ఆడపిల్లలు, రెండవ కుమార్తె రాజశ్రీ (17 నెలలు). మంగళవారం సాయంత్రం ఊరికి సమీపంలో తమ పొలం వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లారు. తమవెంటే రాజశ్రీనీ అక్కడికి తీసుకెళ్లారు. భార్యతో గొడవపడిన ఆదీశ్వర్ విషపు గుళికల మందును సేవించాడు. అంతేకాకుండా రాజశ్రీకి కూడా తాగించాడు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆ చిన్నారి కన్నుమూసింది. ఇక, ఆదీశ్వర్‌ను గ్రామం నుంచి నేరుగా తిరుపతికే తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలి సింది. పొరబాటున చిన్నారి గుళికల మందు మింగిందని చెప్పినప్పటికీ ఆదీశ్వరే తాగించాడనే విషయం బైటపడింది. -
రెడ్డెమ్మ సొమ్ముకే ఎసరు
మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయ ఆదాయంలో రూ.4.5 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయి. నాలుగేళ్లుగా ఆలయ ఆదాయ, వ్యయ వివరాల రికార్డులను అధికారులు మాయం చేశారు. హుండీ ఆదాయం లెక్కించే సమయంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లడ్డూ తయారీలో గతంలో వేలం పాటలు నిర్వహించే పద్ధతికి స్వస్తి చెప్పి అధికారులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. సాక్షి, గుర్రంకొండ(చిత్తూరు) : రాయలసీమలోనే సంతాన దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ రెడ్డెమ్మ కొండ ఆలయంలో నాలుగేళ్లుగా ఆదాయ లెక్కల వివరాలు గల్లంతయ్యాయి. ఆలయ అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి భద్రపరచాల్సిన దేవాదాయ శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శించారు. హుండీ ఆదాయం లెక్కింపులో నిబంధనలు పాటించడం లేదు. దేవాదాయశాఖకు చెందిన వారిని కాకుండా తమకు అనుకూలమైన వ్యక్తులతో, విద్యార్థులతో హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు. హుండీ ఆదాయం లెక్కింపులో కొంతమంది రూ.2వేలు, రూ.500 నోట్లు మాయం చేస్తున్నారు. బంగారం అసలైనదా కాదా అని నిర్ధారించడానికిగానూ ప్రయివేట్ అప్రైజర్లను తీసుకొచ్చి స్వాహా చేస్తున్నారు. దొడ్డిదారిన నియామకాలు గత ప్రభుత్వ హయాంలో అమ్మవారి ఆలయంలో ఉద్యోగులను దొడ్డిదారిని నియమించేశారు. జీవో నెంబరు 19 సాకుగా చూపించి అప్పుడు పనిచేసే ఈవోనే స్వయంగా ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం గమనార్హం. ఒక్కొక్కరికి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు జీతాలు చెల్లిస్తూ మొత్తం 12 మందిని ఆలయంలో ఉద్యోగులుగా నియమించారు. నాలుగేళ్లుగా మారిన తంతు కాంట్రాక్టర్లు లడ్డూ తయారీని సక్రమంగా నిర్వహించడం లేదనే సాకుతో వేలం పాటలు నాలుగేళ్ల క్రితం రద్దు చేశారు. అప్పటి నుంచి దేవాదాయశాఖ అధికారులే లడ్డూల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మవారి లడ్డూ బరువు 80 గ్రాముల బరువు ఉండాలి. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న లడ్డూ బరువు 60 గ్రాముల లోపే ఉంది. లడ్డూల విక్రయం ద్వారా ఏడాదికి రూ. 24 లక్షల నుంచి రూ. 26 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక్కో లడ్డూ ధర రూ. 10గా నిర్ణయించి విక్రయిస్తుంటారు. నిబంధనల మేరకు లడ్డూ ప్రసాదాల తయారీ ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రయివేట్ వ్యక్తుల వద్ద లడ్డూలను అధికారులు కొనుగోలు చేసి ఆలయానికి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల వివరాలు లేవు 2014–2018 వరకు రెడ్డెమ్మకొండ ఆదాయ, ఖర్చు వివరాలు అందుబాటులో లేవు. గతంలో పనిచేసిన అధికారులు వాటిని ఇక్కడ స్వాధీనం చేయలేదు. దీంతో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మావద్ద లేవు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులను అప్పుడు పనిచేసే ఈవో నియమించారు. లడ్డూ తయారీని కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా మేమే స్వయంగా తయారు చేయించి ఆలయంలో విక్రయిస్తున్నాం. – మునిరాజ, శ్రీరెడ్డెమ్మకొండ ఈవో -
అభిమానానికి ‘సాక్షి’
గుర్రంకొండ: ఆయన యాచకుడు. సాక్షి దినపత్రిక చదవందే తృప్తి ఉండదు. భిక్షాటన చేసిన చిల్లరతోనే పేపర్ కొంటాడు. పత్రిక ఆసాంతం చదవిన తరువాతే తన దినచర్య ప్రారంభిస్తాడు. వైఎస్ఆర్, జగన్‌పై అభిమానమే పత్రికపై మమకారం పెంచిందని తెలిపాడు. మండలంలోని చెర్లోపల్లెకు చెందిన ధర్మయ్య (80) యాచనతోనే జీవిస్తుంటాడు. రెడ్డెమ్మ దేవస్థానం లేదా ఖాళీ జాగాల్లో ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ సేదదీరుతుంటాడు. రెడ్డెమ్మ కొండకు వచ్చే భక్తులు, స్థానికులు ఇచ్చే కాసులతో కడుపు నింపుకుంటాడు. యాచనతో జీవిస్తున్న అతడు తన చిన్న కోరికలను అణిచేసుకోవడం లేదు. ఉదయం లేవగానే సాక్షి దినపత్రిక చదవడం అలవాటు. వైఎస్సార్, జగన్ అంటే వీరాభిమానం ఉన్న అతడు దాతలు ఇచ్చే చిల్లరతోనే సాక్షి దినపద్రిక కొంటాడు. గ్రామంలోని ఏదో ఇంటిమెట్లపై కూర్చుని నింపాదిగా పత్రికలోని అన్ని విషయాలు చదువుతాడు. ఆ తర్వాతే తన దినచర్యలో భాగమైన భిక్షాటనకు బయల్దేరతాడు. ఇంతకు ముందు పత్రికను అక్కడా, ఇక్కడా చదివేవాడినని.. అయితే మూడేళ్లుగా సాక్షి పత్రికను కొని చదవడం అలవాటు చేసుకున్నట్లు తెలిపాడు. సాక్షి చదవకుంటే వెలితిగా ఉంటుందని, వార్తలు చదివిన తర్వాతే తన పని ప్రారంభిస్తానని చెప్పాడు. -
స్కూల్ భవనం కూలి విద్యార్థుల మృతి
-
స్కూల్ భవనం కూలి విద్యార్థిని మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా గుర్రంకొండలో విషాదం చోటు చేసుకుంది. గుర్రంకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్ భవనం కూలిన ఘటనలో ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో హర్ష అనే విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. గాయపడిన విద్యార్థులను ఆటోలు, ఇతర వాహనాల్లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల భవనం వందేళ్ల పైబడిన పురాతనకట్టడం కావడం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పైకప్పు కూలినట్టు తెలుస్తోంది. విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం వ్యవహరించడం ఈ ఘటనకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాల యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై తెలిపారు.