ఆలయంలోని బలిపీఠం దగ్గర సత్యప్రమాణం చేస్తున్న ప్రజలు
గుర్రంకొండ: నిజం పలికించే బలిపీఠం తరిగొండలోని శ్రీలక్ష్మినరసింహ్వామి ఆలయం. సత్యప్రమాణాలకు నిలయంగా అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఆలయంగా శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి ఆలయంలోని సత్యప్రమాణాలు చేసే బలిపీఠం దుర్వాసమహర్షి ప్రతిష్టించాడని పురాణ కథనం. తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణం చేయాలంటే భయపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆధునిక సమాజంలో సత్యప్రమాణాల నిలయంగా తరిగొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం విరాజిల్లుతుండడం విశేషం.
దుర్వాస మహర్షి ఇక్కడి ఆలయంలో బలిపీఠం ప్రతిష్టించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఆలయం వెలుపల స్వామివారికి ఎదురుగా ఈ బలిపీఠం ఉంది. అత్యంత శక్తివంతమైన శ్రీచక్రయంత్రం పీఠం కింద ఏర్పాటు చేసి బలిపీఠానికి అత్యంత శక్తిని చేకూర్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ బలిపీఠమే కాలక్రమేణా సత్యప్రమాణాలకు నిలయంగా మారింది. బలిపీఠం ముందరే ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు శ్రీవెంగమాంబ ఆలయం ఉంది. ఉమ్మడి రాయలసీమజిల్లాలో కాణిపాకం తరువాత ఎక్కువగా సత్యప్రమాణాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఆచారం ప్రకారమే సత్యప్రమాణాలు:
ఇక్కడి ఆచారం ప్రకారమే ఎవరైనా సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేసేవారు ముందుగా ఆలయ ప్రాంగణంలోని బావినీటితో స్నానం ఆచరించాలి. తడిబట్టలతో బలిపీఠం వద్దకు చేరుకొని ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆలయప్రాముఖ్యత, స్వామివారి మహత్యం తెలిసినవారు ఎవ్వరు కూడా తప్పు చేసి ఇక్కడ సత్యప్రమాణం చేసే సాహసం చేయరు.
చాలా మంది స్నానాలు చేసి ప్రమాణం చేసే ముందు ఆలయ అర్చకులు చెప్పేమాటలు విని వెనకడగు వేసి నిజం అంగీకరించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. తప్పుడు ప్రమాణాలు చేస్తే వారి వంశం నిర్వీర్యమవుతుందనేది భక్తుల నమ్మకం. ఈ విషయాన్ని దుర్వాస మహాముని ఇక్కడ శాసనం చేసినట్లు ఆలయ అర్చకులు చెబుతుంటారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి సత్యప్రమాణాలు చేసేందుకు వస్తుంటారు.
దేవుడిపై నమ్మకం ఎక్కువ
తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి మీద భక్తులకు, గ్రామస్తులకు నమ్మకం ఎక్కువ. ఆలయంలోని బలిపీఠం మీద సత్యప్రమాణాలు చేయాలంటే తప్పు చేయలేదనే భావన ఉండాలి. ఆధునికంగా ఎంతో టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడి ఆలయంలో సత్యప్రమాణంపై భక్తులకు సడలని నమ్మకం ఉంది. ఎక్కడెక్కడి నుంచో సత్యప్రమాణాలు చేసేందుకు ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు.
– ప్రకాష్‌రెడ్డి, గ్రామస్తులు, తరిగొండ
సత్యప్రమాణం చేయాలంటే భయం
తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణాలు చేయడానికి భయపడతారు. తప్పు చేసి కావాలనే తప్పుగా ప్రమాణం చేస్తే అందుకు తగిన శిక్ష అనుభవిస్తారు. బలిపీఠం గురించి చెప్పే మాటలు విని సాధ్యమైనంత వరకు బలిపీఠం దగ్గరకు వచ్చి చాలా మంది నిజం అంగీకరించి వెనుదిరిగి వెళ్లిపోతుంటారు. ఎలాంటి తప్పు చేయని వాళ్లు మాత్రమే సత్యప్రమాణం చేసేందకు ధైర్యం ఉంటుంది.
– గోపాలబట్టర్, ఆలయ అర్చకులు, తరిగొండ
Comments
Please login to add a commentAdd a comment