
గుర్రంకొండ : తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగకు మొదటిస్థానం ఉంది. పంటలు బాగా పండి ధాన్యరాశులు ఇంటికి చేరుకొన్న తరువాత వచ్చే మొదటి పండుగ ఇదే కావడంతో సంక్రాంతి ప్రత్యేకతను సంతరించుకుంది. పంటలు పండించడానికి సాయపడే పశువులను భక్తితో పూజించడం ఈ పండుగలో విశేషం. ఆరుగాలం కష్టపడి పనిచేసే ప్రతిరైతూ తప్పనిసరిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా సంక్రాంతి పండుగను గుర్రంకొండ మండలంలోని 18 గ్రామాల్లో జరుపుకోరు. పాత కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని నేటి ఆధునిక కాలంలోనూ కొనసాగిస్తుండటం విశేషం.
సంప్రదాయాలు..ఆచారాలకు నిలయం
వైఎస్సార్ కడప జిల్లాలో మారుమూల ప్రాంతమైన టి.పసలవాండ్లపల్లె పంచాయతీలోని మొత్తం 18 గ్రామాలను సంప్రదాయాలు, ఆచారాలకు నిలయంగా చెప్పుకోవచ్చు. పురాతన ఆచారం ప్రకారం ఈ గ్రామాల్లో సంక్రాంతి పండుగను జరుపుకోవడం నిషేధం. పల్లెల్లో పశువులను సింగారించడం, మేళతాళాలతో ఊరేగించడం వంటి దృశ్యాలు ఇక్కడ కనిపించవు. గ్రామ పొలిమేర్లలో చిట్లాకుప్పల వద్దకు పశువులను తీసుకెళ్లడం, పాడిఆవుల ఆరాధ్య దైవమైన కాటమరాయుడికి పూజలు నిర్వహించడం వంటి దృశ్యాలు మచ్చుకైనా కనిపించవు. గతంలో ఇక్కడి ప్రజల పూరీ్వకులు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లకు నేటి తరం ప్రజలు కూడా కట్టుబడి ఉండడం ఈ గ్రామాల ప్రత్యేకత.
మార్చిలో జరిగే ఉత్సవాలే వీరికి సంక్రాంతి
ప్రతి సంవత్సరం మార్చినెలలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతరే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ లాంటిది. గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం సంక్రాంతి పండుగ జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. ప్రతి ఏడాది మార్చి నెలలో శ్రీ పల్లావలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ రోజున అమ్మవారి పేరుమీద వదిలిన ఆవులను మాత్రమే అందంగా అలంకరించి వాటిని ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో గ్రామస్తులందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవారికి సంక్రాంతి పండుగ.
పాడిఆవులతో వ్యవసాయం నిషిద్ధం
పాడిఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేయడం మాత్రం నిషిద్ధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ మాత్రమే ఉండడం విశేషం. పూర్వపు తమ పెద్దల ఆచారం ప్రకారమే ఈ సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు.
ఆచారాలను మరువబోం
మా పూరీ్వకులు, పెద్దలు ఆ చరించిన ఆచారాలను, సంప్రదాయాలను మరవబోము. మా గ్రామదేవత శ్రీపల్లావల మ్మ ఉత్సవాల రోజున అమ్మ వారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొని వచ్చి పూజలు నిర్వహిస్తాం. అదే మాకు సంక్రాంతి పండుగ. అంతకు మించి ఇప్పుడు ఎలాంటి ఉత్సవాలు ఇక్కడ జరగవు.
– బ్రహ్మయ్య, ఆలయపూజారి, బత్తినగారిపల్లె
Comments
Please login to add a commentAdd a comment