సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ సందడే వేరు. ఇతర రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో స్థిరపడిన వారు సైతం సంక్రాంతికి సొంతూరికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ఈ పెద్ద పండుగకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా ఇప్పుడే రైళ్లలో రిజర్వేషన్లు భర్తీ కావడంతో సంక్రాంతికి ఊరెళ్లేదెలా అంటూ అనేకమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజంపేట: సంక్రాంతి పండుగకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. రైళ్లలో రిజర్వేషన్లు అప్పుడే నిండిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు. తెలంగాణ, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాలలో మన రాష్ట్రానికి చెందిన అనేక కుటుంబాల వారు స్థిరపడిపోయారు. వారు ఏడాదిలో ఒక్కసారి సంక్రాంతికి సొంతూళ్లకు రావాలనుకుంటారు. కానీ పండుగ ఇంకా నాలుగు నెలలు ఉండగానే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క పోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ముందురోజు ఓపెన్ అయ్యే తత్కాల్ మీదే ఆధారపడి ఉన్నారు.
వచ్చే ఏడాది జనవరి 12, 13 తేదీలలో రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంది. హైదరాబాదు నుంచి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని కడప, రాజంపేట, రైల్వేకోడూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కమలాపురం, నందలూరు తదితర ప్రాంతాలకు వేలాది కుటుంబాలు సంక్రాంతి పండుగకు వచ్చేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. హైదరాబాదుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు తిరిగి వెళ్లేందుకు కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నారు. కొంతమందికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. మరికొందరికి బెర్త్ దొరకలేని పరిస్థితులున్నాయి. ఇక చివరిగా రైల్వేశాఖ పండగ సీజన్ దృష్ట్యా ఏమైనా ప్రత్యేకరైళ్లు నడిపితే వాటిలో టికెట్లు బుక్ చేసుకుందామనే ఆశతో పలువురు ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు
రైలులో వెళ్లాలనుకునే వారికి టికెట్లు దొరకక పోవడంతో ఇక ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. అయితే పండుగ సీజన్‌లో ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ సాధారణం కంటే అధిక చార్జీలు వసూలు చేస్తాయి. దీంతో తక్కువ చార్జీతో రైలులో వెళ్లాలనుకునే వారికి కొంత నిరాశ అనే చెప్పుకోవాలి.
డే ట్రైన్ రన్ చేయాలనే డిమాండ్
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా మీదుగా అన్‌రిజర్వుడు డే ట్రైన్‌ను తెలంగాణకు నడిపించాలనే డిమాండ్‌ను ప్రజాప్రతినిధులు రైల్వేబోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును విజయవాడ మీదుగా నడిపిస్తున్నారు. ఇదే విధంగా రెగ్యులర్‌గా జిల్లా మీదుగా కూడా రైళ్లను నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో కొద్దివరకైనా సంకాంత్రి రద్దీని తట్టుకునేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నుంచి హాల్టింగ్‌సమస్యలు
కరోనా ఫస్ట్‌వేవ్ నుంచి అనేక రైళ్లను రద్దు చేశారు. తిరిగి పునరుద్ధరించిన తర్వాత పలు రైళ్లకు తరతరాలుగా కొనసాగుతున్న హాల్టింగ్స్‌ను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే వారు సొంతూరికి చేరుకునే విషయంలో ఇక్కట్లకు గురికాక తప్పదు.
బెర్త్ దొరకకపోయినా..
ఒక్కో రైలులో 500కు పైగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. కొన్ని రైళ్లలో ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్‌కు చేరింది. బెర్తు దొరక్కపోయినా వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ఏదోలా ప్రయాణించేద్దామనుకునే వారికి ఆ అవకాశం కూడా లేకుండా వెయిటింగ్‌లిస్ట్ జాబితా చాంతాండంత ఉంది.
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు మూడురైళ్లు
తెలంగాణ నుంచి రెగ్యులర్‌గా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు మూడు రైళ్లే నడుస్తున్నాయి. అవి చితూర్తు – కాచిగూడ, నిజామాబాద్ – తిరుపతి, చెన్నై ఎగ్మోర్ టు సికింద్రాబాద్. వీటికి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సంక్రాంతి పండుగ సీజన్‌లో ఈ రైలులో బెర్త్ దొరికే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.
సంక్రాంతికి రావాలంటే..
సంకాంత్రికి రావాలంటే చుక్కలు కనిపిస్తాయి. రైలు ప్రయాణం చేయాలంటే కష్టతరమవుతోంది. కుటుంబ సభ్యులందరం రావాలంటే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదృష్టం ఉంటే బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే వెయిటింగ్ లిస్ట్. వైఎస్సార్, అన్నమయ్య జిల్లా మీదుగా నడిచే రైళ్లు యాత్రికులకే సరిపోవడంలేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడిపించాలి.
–చింతల రాంప్రసాద్, బుల్లితెరనటుడు, హైదరాబాద్
వ్యయప్రయాసలు తప్పవు
సంక్రాంతి పండుగకు రావాలన్నా తిరిగి వెళ్లాలన్నా వ్యయప్రయాసలకు గురికాక తప్పదు. రైలులో రిజర్వేషన్ ఉంటే తప్పవెళ్లలేం. జనరల్ బోగీలో ప్రయాణం ఇక చెప్పనకర్లేదు. గతంలో ఉన్న స్టాపింగ్స్ ఇప్పుడు లేవు. అదొక సమస్య. విమాన ప్రయాణం సులభంగా ఉందేమోకానీ రైలు ప్రయాణమే గగనంగా ఉంది.
–పరిటాల ప్రసాద్, స్టోర్‌మేనేజర్, నాగార్జున కన్‌స్ట్రక్షన్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment