15 కిలోల బాక్సు ధర రూ.700
టోకు మార్కెట్‌లో కిలో ధర రూ.50
కొనలేకపోతున్న వినియోగదారులు
కోలారు: టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా రైతులకు మార్కెట్‌లో కాసుల పంట పండుతోంది. రెండు రోజులుగా కోలారు ఏపీఎంసీ మార్కెట్‌లో 15 కిలోల నాణ్యమైన టమాట బాక్సు ధర రూ.700 పలికింది. టోకు మార్కెట్‌లో కిలో ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వేసవి కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌కు పెద్దగా సరుకు రావడం లేదు. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీఎంసీ మార్కెట్ యార్డుకు గురువారం 8500 క్వింటాళ్ల టమాట వచ్చింది.
గత సంవత్సరం ఇదే సీజన్లో మార్కెట్‌కు దాదాపు 15 వేల క్వింటాళ్ల దిగుబడి ఉండింది. ఏప్రిల్ నెలలో విపరీతమైన ఎండలు, ప్రస్తుతం కురుస్తున్న వానలకు టమాట దిగుబడి తగ్గుతోందని రైతులు అంటున్నారు. తెగుళ్ల బాధ, వాతావరణ వైపరీత్యం వల్ల కూడా టమాటా దిగుబడి బాగా తగ్గిందని రైతులు అంటున్నారు. వాతావరణంలో మార్పులను చూసి రైతులు కూడా టమాటా సాగుకు విముఖత చూపడం వల్ల దిగుబడి తగ్గిందని ఏపీఎంసీ మార్కెట్ యార్డు సెక్రటరీ విజయలక్ష్మి తెలిపారు. రాబోయే 15 రోజుల్లో మార్కెట్‌కు టమాట సరఫరా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. టమాట ధరలు రైతులకు లాభాలు కురిపిస్తుండగా వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment