టమోటా ధరపై గందరగోళం!
గుడివాడ : టమోటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎలాగైనా ధరలను అదుపు చేయాలని జిల్లా అధికారులు భావించారు. అధికారులు చెప్పినట్లు చేస్తే తాము నష్టపోతామని రైతులు రైతుబజారుల్లో టమోటా విక్రయాలను నిలిపివేశారు. ధరల నియంత్రణకు టమోటా, వంకాయ, బెండకాయ, ఉల్లిపాయలను అన్ని రైతు బజారుల్లో ఒకే ధరకు విక్రయించాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి ఆదేశాలు జారీచేశారు.
ఆయా ధరలను అధికారులే నిర్ణయిస్తారు. ఈ క్రమంలో సోమవారం టమోటా కిలో ధర రూ.35గా ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మన జిల్లాలో టమోటా పంట లేదని, తాము హోల్‌సేల్ మార్కెట్‌లో ఎక్కువకు కొనుగోలు చేసి తక్కువ ధరకు ఎలా విక్రయించగలమని ప్రశ్నించారు. రైతుబజార్లలో విక్రయాలు నిలిపివేశారు.
గుడివాడలో మంగళవారం రైతుబజారు బయట టమోటాలను కిలో రూ.41కు విక్రయించారు. అధికారులు స్పందించి బుధవారం టమోటా కిలో రూ.41గా నిర్ణయించడంతో రైతుబజారుల్లో యథావిధిగా విక్రయాలు కొనసాగించారు.