
మదనపల్లె వ్యవసాయ మార్కెట్టుకు వచ్చిన టమాటాలు
కూలీలు కూడా గిట్టుబాటు కాకుండా నష్టపరిచిన టమాట ప్రస్తుతం రైతులను ఆదుకుంటోంది. కిలో రూ.37లు పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కొద్ది రోజలు ఇలాగే ఉంటే చేసిన అప్పులు కొంతమేర తీరుతాయని చెబుతున్నారు. పెరిగిన ఎండలు, ఇతర ప్రాంతాల నుంచి కాయలు రాకుండా చర్యలు తీసుకోవడంతోనే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
చిత్తూరు, మదనపల్లె టౌన్ /రామసముద్రం : జిల్లాలోని పడమటి మండలాల్లో ప్రధానంగా టమాట పంట సాగు చేస్తారు. ఎకరా సాగుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. నీరు తక్కువగా ఉన్న రైతులు మల్చింగ్, డ్రిప్, స్ప్రింక్లర్లను వినియోగిస్తూ ఖర్చుకు వెనకాడకుండా పంటను పెడుతున్నారు. మదనపల్లె డివిజన్‌లో ప్రస్తుత రబీ సీజన్‌లో 43 వేల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 36 వేల హెక్టార్లో టమాట సాగు చేసినట్టు ఉద్యానవన శాఖ అధికారులు సుబ్రమణ్యం, ఉమాదేవి తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలంలో 1200 హెక్టార్లకు గాను 480 హెక్టార్లు, రామసముద్రం మండలంలో 2,200 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1,600 హెక్టార్లలో, మదనపల్లె మండలంలో 1,400 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 800 హెక్టార్లలో టమాట పంట సాగు చేశారు. వేసవిలో పంట దిగుబడి తగ్గడం, మార్కెట్ అధికారులు నెల రోజులుగా బయటి రాష్ట్రాల కాయలను మార్కెట్‌లోకి అనుమతించకపోవడంతో రేట్లు పెరిగాయి. మార్కెట్‌కు ప్రస్తుతం మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం టమాట పది కిలోలు రూ.340, రెండో రకం రూ.200 పలికింది. వారం రోజులుగా సగటున కిలో రూ.34–36 మధ్య ధర ఉంది. శుక్రవారం మార్కెట్‌కు 262 టన్నుల టమాట కాయలు వచ్చాయి.
నార్లకు పెరిగిన డిమాండ్
నెల క్రితం టమాట నార్లను అడిగేవారు లేకపోవడంతో నర్సరీల్లో పడేశారు. 20 రోజులుగా టమాట ధరలు పెరగడంతో రైతులు సాగుపై దృష్టి సారించారు. దీంతో నార్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఒక్కొక్క మొలకకు 60 పైసల నుంచి 80 పైసల వరకు చెల్లించి తీసుకెళుతున్నారు. అయినా నార్లు లభించడంలేదని రైతులు చెబుతున్నారు. కర్ణాటకకు వెళ్లి నారు తెచ్చుకుంటున్నట్టు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment