
మదనపల్లె మార్కెట్‌కు వచ్చిన టమాటాలు
వారం రోజులుగా ఒడిదుడుకులకు గురవుతున్న టమాట రేట్లు ఆదివారం నాటికి మరింత పతనమయ్యాయి. మదనపల్లె మార్కెట్‌కు తక్కువ మోతాదులో టమాటాలు వస్తున్నా వ్యాపారులు, అధికారుల సిండికేట్‌తో కర్షకుల కష్టం దోపిడీకి గురవుతోంది. నిబంధనలకు నీళ్లు వదులుతూ ఈ–వేలానికి బదులు బహిరంగ వేలంనిర్వహిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తుం డడంతో తమకు ఆత్మహత్యలేశరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు.
చిత్తూరు, మదనపల్లెటౌన్: మదనపల్లె మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కో రకంగా టమాటా ధరలు పలుకుతూ రేట్లు పతనమవుతున్నాయి. తక్కువగా టమాటాలు వస్తున్నా వ్యాపారులు, అధికారులు కుమ్మక్కవడంతో ధరలు పడిపోతున్నాయి. రోజు రోజుకు టమాటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తుండడంతో రవాణా చార్జీలు కూడా గిట్టడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో అధికారులు, వ్యాపారుల గూడుపుఠానీ కారణంగా ఈ–వేలం పాటలకు మంగళం పాడి చట్టవిరుద్ధంగా బహిరంగ వేలం నిర్వహిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా...
డివిజన్‌తో పాటు పశ్చిమ మండలాలైన అనంతపురం జిల్లాల నుంచి రోజూ మార్కెట్‌కు 200 టన్నుల వరకు టమాటా వస్తోంది. ఇవే కాకుండా ఛత్తీస్‌గఢ్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో టమాటా ఉత్పత్తి అధికంగా ఉండడంతో అక్కడి కాయలను ఇక్కడి మండీ వ్యాపారులు, మార్కెట్ అధికారులతో కుమ్మక్కై బయట రాష్ట్రాల టమాటా లారీలను రాత్రికి రాత్రే మదనపల్లె మార్కెట్‌కు తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా అన్‌లోడ్ చేస్తున్నారు. వ్యాపారులు కొన్నాక తిరిగి లోడ్‌చేసి తెల్లవారకనే పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. దీంతో వ్యాపారులు పెద్దగా మదనపల్లె పరిసర ప్రాంతాల రైతులు తీసుకు వచ్చే టమాటాలను కొనడం లేదు. స్థానిక వ్యాపారులు కొందరు మాత్రమే ఉదయం ఓపెన్ ఆక్షన్‌లో కొంటున్నారు.
నిబంధనలకు పాతర
నిబంధనల ప్రకారం వ్యాపారులు, మార్కెట్ అధికారులు, టమాటాలను తీసుకు వచ్చిన రైతులు ముందుగా ఓ గదిలో సమావేశం అయ్యాక ఈ–వేలం నిర్వహించాలి. ఆ తతంగం లేట్ అవుతుందని వ్యాపారులతో మార్కెట్ అధికారులు కుమ్మక్కై ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. స్థానికంగా కాయలు కొంటున్న ఒకరిద్దరు వ్యాపారులు ఒక రోజు కాయలు కొనడానికి వస్తే మరో రోజు మార్కెట్‌కు రావడం లేదు. దీంతో మార్కెట్‌లో ఒక్కో రోజు ఒక్కో రకంగా టమాటా ధరలు పలుకుతున్నాయి. ఇప్పుడే టమాటా ధరలు పతనమైతే ఎండలు ముదిరి దిగుబడి తగ్గితే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు స్పందించాలి
వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్, కలెక్టర్, మార్కెటింగ్ రీజనల్ మేనేజర్‌లు స్పందించి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి మదనపల్లె టమాటా మార్కెట్‌కు బయట టమాటాలు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ అధికారులు మాత్రం రైతుల కష్టాలు పట్టించుకోకుండా మార్కెట్‌కు ఎన్ని టన్నుల టమాటా వస్తే అంత ఆదాయం వస్తుందని ఆశించి పొరుగు రాష్ట్ర, జిల్లాల టమాటాను కూడా అనుమతిస్తున్నారు. దీంతో మదనపల్లె పరిసర ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment