నంద్యాల జిల్లా ప్యాపిలిలో రైతుల నుంచి వేలంలో టమాటాలు కొంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: ధరలేక సతమతమవుతున్న టమాటా రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిమాండ్‌కు మించి టమాటా పంట మార్కెట్లకు వస్తుండటంతో గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను నిరంతరం పరిశీలిస్తూ కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ ధరలు నిలకడగా ఉండేలా చూస్తోంది.
ఇటీవల టమాటా ధరలు చుక్కలనంటి.. కిలో రూ. 250కు పైగా పలికిన దశలో వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 28 నుంచి మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతుల నుంచి పెద్ద ఎత్తున టమాటాలను సేకరించి కిలో రూ. 50కే రైతు బజార్లలో విక్రయించింది. ఇలా దాదాపు రెండు నెలల పాటు రైతుల నుంచి సగటున కిలో రూ. 107.50 చొప్పున రూ.14.66 కోట్ల విలువైన 1,364.55 టన్నుల టమాటాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 105 రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందించింది.
నేడు రైతులకు అండగా నిలిచేందుకు..
గత నెల రోజులుగా ఖరీఫ్ పంట పెద్దఎత్తున వస్తుండటంతో మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లతో సంబంధం లేకుండా కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించింది. దీంతో సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తూ ధరల తగ్గిన మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ రైతులకు బాసటగా నిలుస్తోంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్ పరిధిలో ధరలు తగ్గుదల నమోదవుతుండటంతో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి రైతులవద్ద టమాటాలు కొనుగోలు చేశారు.
లాభం ఆశించకుండా విక్రయం
ఇటీవల ప్యాపిలి మార్కెట్లో కనిష్ట ధర రూ. 6 పలుకగా, అంతకంటే ధర తగ్గకూడదన్న ఆలోచనతో రైతుల వద్ద గడిచిన నాలుగు రోజుల్లో 16 టన్నులు సేకరించి స్థానిక రైతుబజార్లలో నో ప్రాఫిట్–నో లాస్ పద్ధతిన వినియోగదారులకు విక్రయించారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ప్రభుత్వ జోక్యం చేసుకుంటుండటంతో సోమవారం ప్రధాన టమాటా మార్కెట్లలో నాణ్యమైన టమాటాకు సైజును బట్టి కిలో కనిష్టంగా రూ. 8, గరిష్టంగా రూ. 16 చొప్పున పలుకుతోంది. మరోవైపు బహిరంగ మార్కెట్లలో కిలో రూ. 11 నుంచి రూ. 24 పలుకుతుండగా, రైతు బజార్లలో కిలో రూ.9 నుంచి రూ. 20 వరకు ధరలు ఉండేలా చూస్తున్నారు.
ధరల నిలకడే లక్ష్యం
డిమాండ్ మించి పంట మార్కెట్‌కు వస్తుండటంతో గతకొద్ది రోజులుగా తగ్గుతున్న ధరలను నిలకడగా ఉంచడం ద్వారా రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీరోజూ ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కిలో రూ.7 కంటే తక్కువగా పలుకుతున్న మార్కెట్లో జోక్యం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే కిలో రూ. 6 చొప్పున 16 టన్నులు రైతుల నుంచి సేకరించి స్థానిక రైతు బజార్లలో అదే ధరకు విక్రయించాం. ధరల విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదు.
– రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment