‘ఉల్లి’కిపడుతున్న టమాటా!
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మహా నగర మార్కెట్లో మాయాజాలం రాజ్యమేలుతోంది. దళారుల దగాతో ఉల్లి ధర మరింత ఘాటెక్కు తూ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు భారీగా తగ్గుతూ పండించిన రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో శనివారం ఉల్లి, టమాటాలకు పలికిన ధర ల్లో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. మలక్‌పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్-1 రకం ఉల్లికి క్వింటాల్ రూ.3,800, గ్రేడ్-2 ఉల్లికి రూ.2,400 కనీస మద్దతు ధర నిర్ణయం కాగా, టమాటా మాత్రం బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.500 మత్రమే మద్దతు ధర పలికింది.
ఇదే సరుకు రిటైల్ మార్కెట్లోకి వచ్చే సరికి ఉల్లి కేజీ రూ.45-50లు ధర పలుకుతుండగా, టమాటా కేజీ రూ.7-10ల మధ్య లభిస్తోంది. స్థానికంగా పండించిన పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. అదే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటున్న ఉల్లికి మాత్రం భారీగా చెల్లించాల్సి వస్తోంది.
ఇందులో లబ్ధి పొందుతున్నది మా త్రం దళారులే. నిత్యావసరాలైన రెండు ప్రధాన వస్తువుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉల్లిని స్థానికంగా పండించేం దుకు రైతులను ప్రోత్సహించకపోవడం ఒక కారణమైతే... సమృద్ధిగా దిగుబడి వ చ్చే టమాటాను నిల్వ చేసుకొనే సాంకేతికత అం దుబాటులో లేకపోవడం మరో వైఫల్యంగా కన్పిస్తోంది. నగరంలో డిమాండు-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం ఉండటంతో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి.
ధరలను అదుపులోకి తెచ్చేందుకు సబ్సిడీ పథకం పేరుతో మార్కెటింగ్ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నాయి. కూరగాయల కొరత కారణంగా రైతు బజార్‌తో సహా బహిరంగ మార్కెట్లో దళారుల దోపిడీ దర్జాగా కొనసాగుతోంది. టమాటా కొత్త పంట దిగుబడి ప్రారంభం కావడంతో ధర దిగివచ్చింది. ప్రస్తుతం రైతుబజార్‌లో కిలో టమాటా రూ.9 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ.13 ఉంది. దీంతో పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.
బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, మాదన్నపేట హోల్‌సేల్ మార్కెట్లకు శనివారం 230కి పైగా డీసీఎం లు, ఆటోల్లో టమోటా వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం సబ్సిడీ ధరపై ఉల్లి విక్రయాలు ప్రారంభించినా నగరంలోని అన్ని ప్రాంతాల్లో రైతుబజార్లు లేకపోవడంతో వినియోగదారులు రిటైల్ మార్కెట్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
నిల్వలపై నిర్లక్ష్యం..
మార్కెట్లో మరింత కొరతను సృష్టించి... ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ఎత్తుగడ వే సి పెద్దమొత్తంలో ఉల్లిని నిల్వ చేసినట్లు సమాచారం. హోల్‌సేల్ మార్కెట్ వరకు తాము పర్యవేక్షిస్తామే తప్ప, బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించడం తమ చేతుల్లో లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.