మదనపల్లె మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన టమాటా
అన్నమయ్య : రోజురోజుకీ పెరుగుతున్న టమాటా ధరలు మంగళవారం ఏకంగా ఆకాశాన్ని తాకాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ పలకనంతగా మొదటిరకం టమాటా కిలో రూ.140 ధర పలికి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. గత శుక్రవారం మార్కెట్లో నమోదైన కిలో రూ.124 ధర అత్యధికమని ఇప్పటివరకు భావిస్తుంటే, మంగళవారం దాన్ని తలదన్నేలా కిలో రూ.140కు చేరుకోవడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న టమాటా ధరలతో రైతులు ఆనందపడుతున్నప్పటికీ, వినియోగదారులు మాత్రం ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో వారంరోజుల టమాటా ధరలను పరిశీలిస్తే సరిగ్గా 13 రోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.38 ధర పలికి.. రోజురోజుకూ ఊహించనిరీతిలో పెరిగి రూ.140కు చేరుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశంలో టమాటా పండించే రాష్ట్రాల్లో పంట దిగుబడులు లేకపోవడంతో అందరిచూపు ఏడాది పొడవునా క్రయవిక్రయాలు జరిగే మదనపల్లె మార్కెట్‌వైపు పడింది. బయటి రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లెలో మకాం వేసి వచ్చిన సరుకు వచ్చినట్లుగా కొనేస్తుండటంతో పోటీపెరిగి ధరలు పెరిగాయి.
దీనికితోడు దిగుబడులు తగ్గిపోవడం, వర్షాలతో పంటకు నష్టం వాటిల్లుతుండటంతో టమాటాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ నుంచి ఢిల్లీ, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు సరుకు ఎగుమతి అవుతోంది. మార్కెట్‌కు సోమవారం రైతులు తీసుకువచ్చిన టమాటాకు మొదటిరకం కిలో రూ.104 ధర పలికితే మరుసటిరోజు మంగళవారం ఏకంగా కిలోపై రూ.36 పెరిగి రూ.140కు చేరుకుంది.
మార్కెట్లో టమాటా ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పలు మార్కెట్‌యార్డులో వేలంపాటల్లో రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేస్తోంది. వాటిని రైతుబజార్లకు తరలించి రాయితీధరపై కిలో రూ.50కు అమ్మేలా చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment