టమాటాలు, ఉల్లిపాయల ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలో బుధవారం కిలో టమాటా రూ. 70 కాగా ఉల్లిపాయలు రూ. 40లకు విక్రయిస్తున్నారు.
న్యూఢిల్లీ: టమాటాలు, ఉల్లిపాయల ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలో బుధవారం కిలో టమాటా రూ. 70 కాగా ఉల్లిపాయలు రూ. 40లకు విక్రయిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆశించినమేర వర్షాలు కురియకపోవడం, పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక మదర్‌డెయిరీ సఫల్ మార్కెట్లలో కిలో రూ. 55, ఉల్లిపాయలు రూ. 29 పలుకుతున్నాయి. ఇక స్థానిక చిల్లర వ్యాపారులు కిలో టమాటాలను దాదాపు రూ. 70కి విక్రయిస్తున్నారు. మరోవైపు ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కిలో టమాటాలు రూ. 45 నుంచి రూ. 50 పలుకుతున్నాయి. టోకు మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల ధరలు రూ. 20 నుంచి రూ. 25 వరకూ పలుకుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ నుంచి నగరానికి టమాటా ట్రక్కుల రాక తగ్గిపోయింది. నగరానికి పెద్దసంఖ్యలో టమాటాలు ఆ రాష్ట్రం నుంచే వస్తాయి. టమాటాల ధరలు పెరగడంపై ఆజాద్‌పూర్ మండీ టమాటా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్శన్‌లాల్ మాట్లాడుతూ కరువు ప్రభావమే కారణమన్నారు. నాసిక్, బెంగళూర్‌లతోపాటు ఉత్తరాది నుంచి నగరానికి టమాటా ట్రక్కుల రాక గణనీయంగా తగ్గిపోయిందన్నారు.